దేశం విడిచి వ్యాపారవేత్తలు పారిపోయారు కానీ రాజకీయ నాయకులు పారిపోయారా?
'అక్రమ మైనింగ్ ద్వారా మనీలాండరింగ్' ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ తనను ప్రశ్నించనున్న రోజున, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తీవ్రంగా స్పందించారు. నేను ముఖ్యమంత్రిగా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నాను. కానీ విచారణ జరుగుతున్న తీరు, నన్ను పిలిపించిన విధానం, నేను దేశం విడిచి పారిపోయే వ్యక్తినని వారు భావిస్తున్నట్లుగా ఉంది అని ఆయన మండి పడ్డారు.
రాష్ట్రంలో జార్ఖండ్ ముక్తి మోర్చా-కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చేస్తున్న పెద్ద కుట్రలో భాగమే తన పై ఈడి ప్రయోగమని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ ధ్వజమెత్తారు. 'అక్రమ మైనింగ్ ద్వారా మనీలాండరింగ్' ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ తనను ప్రశ్నించనున్న రోజున, ఆయన ఇలా స్పందించారు. ఇదే సమయంలో, తనను ఎమ్మెల్యేగా అనర్హునిగా చేస్తారనే వార్తలపై స్పందిస్తూ..ఈ విషయంలో గవర్నర్ రమేష్ బయాస్ ఏదో ఒక నిర్ణయాన్ని వెంటనే ప్రకటించాలని కోరారు.
ముఖ్యమంత్రి హోదాలో ఆయన తనకు తానుగానే మైనింగ్ లైసెన్సులు కేటాయించకున్నారంటూ బిజెపి హేమంత్ సోరేన్ పై బిజెపి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. సోరేన్ పై అనర్హత వేటు వేయాలని ఈసీ సిఫార్సు చేస్తూ గవర్నర్ కు నివేదిక పంపిందనే వార్తలు వచ్చాయి. దీనిపై ఇప్పటివరకూ ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఈసీ సిఫార్సుపై సెకండ్ ఒపీనియన్ తీసుకుంటున్నట్టు గవర్నర్ ప్రకటించిన విషయం తెలిసిందే. బిజెపియేతర రాష్ట్రాలలో మరింతమంది విపక్ష నాయకులపై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వెంటపడే అవకాశాలు ఉన్నాయని సోరేన్ చెప్పారు.
"నేను ముఖ్యమంత్రిగా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నాను. కానీ విచారణ జరుగుతున్న తీరు, నన్ను పిలిపించిన విధానం, నేను దేశం విడిచి పారిపోయే వ్యక్తినని వారు భావిస్తున్నట్లుగా ఉంది. బడా బడా వ్యాపారవేత్తలు దేశం విడిచి పారిపోయారనే విన్నాను గానీ ఏ రాజకీయ నాయకుడూ అలా పారిపోవడం ఇప్పటివరకూ నేను వినలేదు'' అని అన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి వెళ్లే ముందు రాంచీలోని తన ఇంటి వద్ద జెంఎంఎం మద్దతుదారులను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు.
2019 ఎన్నికలలో జెంఎంఎం-కాంగ్రెస్ గెలిచినప్పటి నుండి తనను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని సోరెన్ అన్నారు.. తనపై ఈడీ చేసిన ఆరోపణలు నిరాధారం అని వ్యాఖ్యానించారు. ''రూ. 1,000 కోట్ల అక్రమార్జనకు ఎంత మైనింగ్ జరగాల్సి ఉంటుందో ఊహించండి. మరి ఆ తవ్వకాల ద్వారా వచ్చిన వాటిని రవాణా చేయాలి కదా. వాటికి వేలాది వ్యాగన్లు కావాలి. ఆలోచించండి. మైనింగ్ రాయల్టీ ద్వారా రాష్ట్ర ఆదాయన్ని పెంచాము.మీరు రూ. 1,000-కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించిన కాలంలో రాష్ట్రం మొత్తం రూ. 750 కోట్లు ఆదాయం సంపాదించింది. ఆరోపణలు చేసే ముందు మీరు ఈ వాస్తవాలు, డేటాను గమనించలేదని నేను భావిస్తున్నాను" అని ఆయన ఈడీకి ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో పేర్కొన్నారు.
ఈ కేసులో సోరెన్ రాజకీయ సహాయకుడు పంకజ్ మిశ్రాతో పాటు మరో ఇద్దరు.. బచ్చు యాదవ్, ప్రేమ్ ప్రకాష్‌లను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.