Telugu Global
National

మహారాష్ట్ర నుంచి కర్నాటకకు బస్సులు బంద్... సరిహద్దు గొడవలకు నెహ్రూనే కారణమన్న బీజేపీ

రెండు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో కర్ణాటకలో మహారాష్ట్ర బస్సులను లక్ష్యంగా చేసుకుని మరిన్ని దాడులు చేసే అవకాశం ఉందని పోలీసు ఇంటలీజన్స్ విభాగము ఇచ్చిన‌ సమాచారం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ ధృవీకరించింది.

మహారాష్ట్ర నుంచి కర్నాటకకు బస్సులు బంద్... సరిహద్దు గొడవలకు నెహ్రూనే కారణమన్న బీజేపీ
X

కర్నాటక, మహారాష్ట్రల మధ్య సరిహద్దు గొడవలు కొనసాగుతున్నాయి. నిన్న కర్నాటకలోని బెలగావిలో మహారాష్ట్ర వాహనాలపై నిరసనకారులు రాళ్ళతో దాడి చేసి ధ్వంసం చేయడంతో ఈ రోజు నుంచి కర్నాటకకు బస్సులు నడపొద్దని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

రెండు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో కర్ణాటకలో మహారాష్ట్ర బస్సులను లక్ష్యంగా చేసుకుని మరిన్ని దాడులు చేసే అవకాశం ఉందని పోలీసు ఇంటలీజన్స్ విభాగము ఇచ్చిన‌ సమాచారం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ ధృవీకరించింది.

"ప్రయాణికులు, బస్సుల భద్రత మాకు ముఖ్యం. పోలీసుల నుండి క్లియరెన్స్ వచ్చిన తర్వాత సేవలను పునరుద్ధరిస్తాం" అని మహారాష్ట్ర రవాణా శాఖ అధికారులు తెలిపారు.

శివసేన ప్రతీకారం

నిన్న మహారాష్ట్రకు చెందిన కనీసం ఆరు ట్రక్కులపై బెలగావి జిల్లాలో కన్నడ రక్షణ వేదిక కార్య‌కర్తలు దాడి చేశారు. హీరేబాగేవాడి సమీపంలో మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సులపై కూడా రాళ్లు రువ్వారు.

దీనికి ప్రతీకారంగా మహారాష్ట్రలో శివసేన కర్నాటక బస్సులపై దాడులకు దిగింది. పూణే సమీపంలో నాలుగు కర్ణాటక రాష్ట్ర రవాణా బస్సులను శివసేన కార్యకర్తలు ధ్వంసం చేశారు.

ఈ వివాదంపై స్పందించిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ వివాదంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడతాన‌ని చెప్పారు. విలేకరుల సమావేశంలో ఫడ్నవీస్ మాట్లాడుతూ, మంగళవారం జరిగిన సంఘటనలపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైతో మాట్లాడినట్లు చెప్పారు.

"నేను స్వయంగా కర్ణాటక ముఖ్యమంత్రితో మాట్లాడాను. శరద్ పవార్ కర్నాటకకు వెళ్లాల్సిన అవసరం లేదని మేము హామీ ఇస్తున్నాము. ఈ కర్ణాటక వివాదంపై నేను కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మాట్లాడతాను, ఆయన ఈ విషయాన్ని త్వరలో పరిశీలిస్తారు" అని ఫడ్నవీస్ అన్నారు. .

మరో వైపు ఈ గొడవలకు మాజీ ప్రధాని నేహ్రూనే కారణమని బీజేపీ ఆరోపిస్తోంది. మహారాష్ట్ర, కర్ణాటక ల మధ్య వివాదం నెహ్రూ ఇచ్చిన బహుమతి అని మహారాష్ట్ర మంత్రి సుధీర్ ముంగంటివార్ ఆరోపించారు.

First Published:  7 Dec 2022 5:17 AM GMT
Next Story