కష్టపడి ఏటీఎంని పగలగొడితే..
మాస్వాన్ గ్రామంలో ఉన్న ఓ ఏటీఎం వద్దకు గుర్తు తెలియని వ్యక్తులు తెల్లవారుజామున రెండు గంటలకు వెళ్లారు. సీసీ కెమెరాను ధ్వంసం చేసి ఏటీఎంను పగలగొట్టారు.
గుర్తుతెలియని దుండగులు ఏటీఎం చోరీకి ప్లాన్ చేశారు. ఓ గ్రామంలో కనిపించిన ఏటీఎంని టార్గెట్ చేసుకున్నారు. అనుకున్నదే తడవుగా దానిని పగలగొట్టేశారు. అంతా చేసి చూస్తే.. ఏటీఎంలోని ర్యాక్‌లన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. దీంతో నోరెళ్లబెట్టడం వారి వంతయింది. మహారాష్ట్రలోని పాల్హర్ జిల్లాలో శనివారం ఈ ఘటన జరిగింది.
మాస్వాన్ గ్రామంలో ఉన్న ఓ ఏటీఎం వద్దకు గుర్తు తెలియని వ్యక్తులు తెల్లవారుజామున రెండు గంటలకు వెళ్లారు. సీసీ కెమెరాను ధ్వంసం చేసి ఏటీఎంను పగలగొట్టారు. అందులో నగదు లేకపోవడంతో విస్తుపోయారు. చేసేదేమీ లేక నిరాశతో వెనుదిరిగారు. అసలు విషయమేమిటంటే.. గత కొన్ని రోజులుగా ఆ ఏటీఎం పనిచేయడం లేదు. బ్యాంకు వారు దానికి మరమ్మతులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అందులో నగదును అందుబాటులో ఉంచలేదు. ఇది తెలియని దొంగలు చోరీకి యత్నించారు. ఇప్పుడు నిందితుల కోసం పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు.