అధికారులా లేక సెలబ్రిటీలా..? ఐఏఎస్, ఐపీఎస్ లకు చురక
ఆయన డ్యూటీలో దిగగానే చేసిన మొదటి పని, కార్ పక్కన నిలబడి ఫొటోలు దిగడం. ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్లో ఫొటోలు పెట్టిన అభిషేక్ సింగ్ తనను తాను ఎన్నికల అబ్జర్వర్ కమ్ యాక్టర్ కమ్ సోషల్ యాక్టివిస్ట్ గా పేర్కొన్నారు.
ఐఏఎస్, ఐపీఎస్ అయినంత మాత్రాన వారికి వ్యక్తిగత అభిప్రాయాలు, అభిరుచులు ఉండకూడదా. వారి అభిప్రాయాలను స్వేచ్ఛగా బయటపెట్టకూడదా. పక్కనే తీన్మార్ బ్యాండ్ వాయిస్తున్నా కాలు కదపకుండా నిష్టగా ఉండాలా..? ఇలాంటి ప్రశ్నలు చాలా సందర్భాల్లో తలెత్తాయి. అయితే అధికారులు తమ అభిరుచులను బహిరంగపరచవచ్చు కానీ, దానికి కూడా కొన్ని పరిమితులున్నాయని అంటున్నారు. అధికార దర్పం చూపిస్తూ సామాజిక ఖాతాల్లో పోస్టింగ్ లు పెట్టడం సరికాదంటున్నారు. ఇలా ప్రవర్తించినందుకు తాజాగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పరిశీలకుడిగా వెళ్లిన ఓ ఐఏఎస్ అధికారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ఆయన్ను విధులనుంచి తొలగించారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు పరిశీలకుడిగా నియమితులైన ఐఏఎస్ అధికారి అభిషేక్ సింగ్, విధి నిర్వహణలో భాగంగా అహ్మదాబాద్ జిల్లా వెళ్లారు. అక్కడ రెండు నియోజకవర్గాలకు ఆయన అబ్జర్వర్ గా నియమితులయ్యారు. అయితే ఆయన డ్యూటీలో దిగగానే చేసిన మొదటి పని, కార్ పక్కన నిలబడి ఫొటోలు దిగడం. ఆ వెంటనే వాటిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడం. ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్లో ఆ ఫొటోలు పెట్టిన అభిషేక్ సింగ్ తనను తాను ఎన్నికల అబ్జర్వర్ కమ్ యాక్టర్ కమ్ సోషల్ యాక్టివిస్ట్ గా పేర్కొన్నారు. డ్యూటీలో దిగీ దిగగానే ఇలా తన హోదా చూపిస్తూ కారు పక్కన నిలబడి ఫొటోలు దిగడం ఏంటని ఎన్నికల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ఆయన్ను విధులనుంచి తప్పించింది.
అధికారిక హోదాను ప్రచార ఆర్భాటానికి ఉపయోగించుకోవడం తప్పని పేర్కొంది కేంద్ర ఎన్నికల సంఘం. వెంటనే ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోవాలని ఆయనను ఆదేశించింది. అభిషేక్ కు కల్పించిన ప్రభుత్వ సదుపాయాలను వెనక్కు తీసుకోవాలని గుజరాత్ ఎన్నికల సంఘం సీఈవోని సీఈసీ ఆదేశించింది. అతని స్థానంలో మరో ఐఏఎస్ అధికారికి ఆ రెండు నియోజకవర్గాల పరిశీలక బాధ్యతలు అప్పగించింది. ఐఏఎస్, ఐపీఎస్ లు సెలబ్రిటీలు కాదని చురకలంటించింది. సోషల్ మీడియా పోస్టింగ్ లు బాధ్యతాయుతంగా ఉండాలని చెప్పింది.