Telugu Global
National

పెళ్లికాని ప్రసాదులు.. అక్కడ పింఛన్ కి అర్హులు

సీఎం అధికారిక ప్రకటనతో ఆ రాష్ట్రంలో పెళ్లికాని ముదురు బ్రహ్మచారులు, 45 ఏళ్లు దాటినా వివాహం కాని మహిళలు సంబరపడుతున్నారు.

పెళ్లికాని ప్రసాదులు.. అక్కడ పింఛన్ కి అర్హులు
X

పెళ్లికాని ప్రసాదులు.. అక్కడ పింఛన్ కి అర్హులు

వృద్ధాప్య పింఛన్, వితంతు పింఛన్, ఒంటరి మహిళ పింఛన్.. ఇలా ప్రభుత్వం అందించే సామాజిక పింఛన్లలో చాలా రకాలున్నాయి. వితంతు, ఒంటరి మహిళ, అనే కేటగిరీతోపాటు ఇప్పుడు అన్ మ్యారీడ్ అనే స్పెషల్ కేటగిరీ పింఛన్లను తెరపైకి తెచ్చింది బీజేపీ. హర్యానాలో పెళ్లికానివారికి కూడా పింఛన్ ఇస్తామని ప్రకటించారు సీఎం మనోహర్ లాల్ ఖట్టర్.

45 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న అవివాహిత పురుషులు, మహిళలకు ఇకపై హర్యానాలో సామాజిక పింఛన్ ఇస్తారు. 60 ఏళ్లు దాటితే వివాహంతో సంబంధం లేకుండా ఎలాగూ వృద్ధాప్య పింఛన్ వస్తుంది. ఆ లోపు ఉన్నవారు మాత్రం పెళ్లి కాకపోతే పింఛన్ కి అర్హులే. హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ అధికారిక ప్రకటనతో ఆ రాష్ట్రంలో పెళ్లికాని ముదురు బ్రహ్మచారులు, 45 ఏళ్లు దాటినా వివాహం కాని మహిళలు సంబరపడుతున్నారు. నెలరోజుల్లోగా ఈ పథకం అమలులోకి వస్తుంది. ప్రస్తుతానికి పింఛన్ సాయం ఎంత అనేది నిర్ణయించలేదు.

గతంలో ఏపీలో కూడా వివాహంతో సంబంధం లేకుండా 45 ఏళ్లు దాటిన బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు పింఛన్ ఇస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు జగన్. అయితే అధికారంలోకి వచ్చాక వైసీపీకి అది సాధ్యపడలేదు. నవరత్నాలలో ఆ పథకం లేదు కాబట్టి జగన్ దాన్ని పక్కనపెట్టారు. ప్రత్యామ్నాయంగా చేయూత పథకం తెరపైకి వచ్చింది. ఇక హర్యానాలో ప్రవేశ పెడుతున్న అవివాహితుల పింఛన్ మాత్రం దేశంలోనే సరికొత్త చర్చకు తావిచ్చింది.

First Published:  3 July 2023 4:57 PM IST
Next Story