తెలుగు రాష్ట్రాలకు బడ్జెట్ కేటాయింపులు ఇవి! ఎమ్మెల్సీ కవిత, ఏపీ మంత్రి బుగ్గన ఏమన్నారంటే..
కేంద్రానికి ఏపీ రూ.41,338 కోట్లు, తెలంగాణ రూ.21,470 కోట్లు పన్నులు చెల్లిస్తోంది. కానీ బడ్జెట్‌లో కేటాయింపులు మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి.
కేంద్ర వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవ్వాళ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. తెలంగాణ, ఏపీకి సంబంధించి కేటాయింపులను కూడా ఆమె బడ్జెట్‌లో ప్రవేశపెట్టారు. కేంద్రానికి ఏపీ రూ.41,338 కోట్లు, తెలంగాణ రూ.21,470 కోట్లు పన్నులు చెల్లిస్తోంది. కానీ బడ్జెట్‌లో కేటాయింపులు మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. తెలంగాణ గతం నుంచి కోరుతున్న పలు పథకాలకు, ప్రాజెక్టులకు నిధులను కేటాయించలేదు. వరద సాయం కోసం ఎన్నో సార్లు లేఖలు రాసినా ప్రయోజనం శూన్యం అయ్యింది.
ఏపీ సెంట్రల్ యూనివర్సిటీకి రూ.47 కోట్లు, పెట్రోలియం యూనివర్సిటీకి రూ.168 కోట్లు, విశాఖ స్టీల్ స్లాంట్‌కు రూ.683 కోట్లు కేటాయించింది. ఇక తెలంగాణలోని సింగరేణి సంస్థకు రూ.1,650 కోట్లు, ఐఐటీ హైదరాబాద్‌కు రూ.300 కోట్లు, మణుగూరు హెవీ వాటర్ ప్లాంట్‌కు (కోటాలోని ప్లాంట్‌తో కలిపి) రూ.1,473 కోట్లు, హైదరాబాద్ సాలార్ జంగ్ మ్యూజియం సహా ఇతర మ్యూజియంలు అన్నింటికీ కలిపి రూ.357 కోట్లు, రెండు రాష్ట్రాల్లోని గిరిజన విశ్వవిద్యాలయాలకు రూ.37 కోట్లు, మంగళగిరి, బీబీనగర్ సహా దేశంలోని 22 ఎయిమ్స్‌కు కలిపి రూ.6,835 కోట్లు కేటాయించారు.
కాగా తెలంగాణకు నిధులు పెద్దగా కేటాయించకపోవడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్ నిరాశాజనకంగా ఉందని అన్నారు. చిన్న తరహా పరిశ్రమల ఊసే లేదని, ఆర్థిక మాంద్యం కారణంగా వేలాది మంది ఉద్యోగాలు ఊడిపోతుంటే వారి ఉద్యోగ భద్రతపై ఎలాంటి చర్య తీసుకోలేదని విమర్శించారు. అలాగే స్మార్ట్ సిటీల గురించి కూడా బడ్జెట్‌లో ప్రస్తావించక పోవడం బాధాకరమన్నారు.
ఇక మూల ధన వ్యయం కోసం రాష్ట్రాలకు కేంద్ర ఇచ్చే రుణానికి సంబంధించిన వడ్డీ చెల్లింపు పరిమితిని 50 ఏళ్లకు పెంచడం శుభపరిణామమని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన అన్నారు. ఇది అన్ని రాష్ట్రాలకు ఉపయోగకరంగా ఉంటుందని ఆయన చెప్పపారు. అలాగే కేంద్రం ఏర్పాటు చేస్తామన్న నర్సింగ్ కాలేజీల వల్ల కూడా మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా 30 స్కిల్ ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్స్ ఏర్పాటు చేయడం వల్ల యువతకు ఉపయోగకరం అన్నారు.