Telugu Global
National

బీటెక్ లో ఆ రెండు గ్రూపులే టాప్.. వారికే నైపుణ్యాలు ఎక్కువ

ఉద్యోగ నైపుణ్యాలున్న బీటెక్‌ అభ్యర్థుల్లో మహారాష్ట్ర టాప్ లో నిలవడం గమనార్హం. అక్కడ 80.56 శాతం మంది విద్యార్థుల్లో నైపుణ్యాలున్నట్టు భారత నైపుణ్యాల నివేదిక-2024 తెలిపింది.

బీటెక్ లో ఆ రెండు గ్రూపులే టాప్.. వారికే నైపుణ్యాలు ఎక్కువ
X

ఇంటర్ తర్వాత డిగ్రీ కానే కాదు, ఇంటర్ తర్వాత బీటెక్ మాత్రమే. ఈ రోజుల్లో విద్యార్థులు, తల్లిదండ్రులందరి మాట ఇదే. అందులోనూ బీటెక్ లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉండే ఐటీ, కంప్యూటర్ సైన్స్ వైపే టాప్ ర్యాంకర్లు మొగ్గు చూపుతున్నారు. సహజంగా బీటెక్ పూర్తయిన తర్వాత కూడా వారే టాప్ ర్యాంకర్లుగా ఉంటున్నారు. ఉద్యోగ నైపుణ్యాల్లో కూడా ఐటీ, సీఎస్ఈ అభ్యర్థులే టాప్ లో ఉంటున్నారు. ఉద్యోగ అవకాశాలు కూడా వారికే ఎక్కువ. భారత నైపుణ్యాల నివేదిక-2024లో కూడా ఇదే విషయం స్పష్టమైంది.

బీటెక్‌ లో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ), కంప్యూటర్‌ సైన్స్‌ (సీఎస్‌ఈ) చదువుతున్న యువతలో ఉద్యోగ నైపుణ్యాలు అధికంగా ఉంటున్నట్లు భారత నైపుణ్యాల నివేదిక-2024 వెల్లడించింది. ఐటీలో 68.44 శాతం మంది విద్యార్థులు, సీఎస్‌ఈలో 66 శాతం మంది విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నారని ఆ నివేదిక పేర్కొంది. ఆ తర్వాత ఈసీఈ, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ గ్రూపులు ఉన్నాయి. సివిల్ గ్రూపులో చదివే విుద్యార్థుల్లో కేవలం 54.31 శాతం మందికే ఉద్యోగ నైపుణ్యాలు ఉన్నాయి. అంటే.. చివరి ఆప్షన్ గా ఆ గ్రూపులో చేరుతున్నవారు చదువులో, నైపుణ్యాల్లో కూడా వెనకబడుతున్నారు.

ఐటీయే మేటి..

ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఐటీ రంగంలోనే అత్యధిక ఉద్యోగావకాశాలు ఉండటం, వేతనాలు కూడా వారికే ఎక్కువగా వస్తుండటంతో యువత ఐటీ, సీఎస్‌ఈల్లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఆయా గ్రూపుల్లో సీటు రానివాళ్లు మాత్రమే ప్రత్యామ్నాయంగా ఇతర గ్రూపుల్లో చేరుతున్నారు. అందుకే పోటీ పరీక్షల్లో కూడా ఆ రెండు గ్రూపుల విద్యార్థులే ముందు వరుసలో ఉన్నారు.

మహారాష్ట్ర టాప్..

ఉద్యోగ నైపుణ్యాలున్న బీటెక్‌ అభ్యర్థుల్లో మహారాష్ట్ర టాప్ లో నిలవడం గమనార్హం. అక్కడ 80.56 శాతం మంది విద్యార్థుల్లో నైపుణ్యాలున్నట్టు భారత నైపుణ్యాల నివేదిక-2024 తెలిపింది. ఆంధ్రప్రదేశ్ లో 73.23 శాతం మంది విద్యార్థుల్లో నైపుణ్యాలున్నాయి. ఆ తర్వాత కేరళ 68.36 శాతంతో మూడో స్థానంలో నిలిచింది. ఇక కొలువుల విషయానికొస్తే.. 2024లో ఉద్యోగ నియామకాలు అధికంగా ఉండే రాష్ట్రాల్లో కర్నాటక తొలి స్థానంలో ఉంటుందని జాతీయ నివేదిక తెలిపింది. ఎక్కువ ఉద్యోగాలకల్పన విషయంలో కర్నాటక తర్వాత ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ ఉన్నాయి.

First Published:  26 Dec 2023 9:39 AM IST
Next Story