లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీచేస్తాం..
తన తుదిశ్వాస వరకు రాజకీయాల్లోనే కొనసాగుతానని మాయావతి స్పష్టం చేశారు. తన పొలిటికల్ రిటైర్మెంట్ గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆమె పైవిధంగా బదులిచ్చారు.
వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయవతి స్పష్టం చేశారు. ఎలాంటి పొత్తులూ లేకుండా ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేస్తామని ఆమె తేల్చిచెప్పారు. సోమవారం మాయావతి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. అయితే.. ఎన్నికల అనంతరం పొత్తులు ఉండవచ్చని ఆమె తెలిపారు.
అందుకే పొత్తులకు దూరంగా...
పొత్తులు లేకుండా పోటీ చేయడానికి ప్రధాన కారణం ఈ సందర్భంగా మాయావతి వెల్లడించారు. ఇతర పార్టీలతో పొత్తుతో పోటీకి దిగితే.. పొత్తు ధర్మానికి కట్టుబడి తమ ఓట్లు భాగస్వామ్యపక్షానికి బదిలీ చేస్తున్నామని, కానీ అవతలి పక్షం ఓట్లు మాత్రం తమకు రావడం లేదని తెలిపారు. అందుకే ఈసారి జరగబోయే ఎన్నికల్లో పొత్తులు లేకుండానే పోటీ చేయనున్నామని ఆమె వివరించారు. గత ఎన్నికల్లో బీఎస్పీ.. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలతో పొత్తులు కుదుర్చుకుని ఎన్నికల బరిలో నిలిచిన సంగతి తెలిసిందే.
తుదిశ్వాస వరకు రాజకీయాల్లోనే...
తన తుదిశ్వాస వరకు రాజకీయాల్లోనే కొనసాగుతానని మాయావతి స్పష్టం చేశారు. తన పొలిటికల్ రిటైర్మెంట్ గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆమె పైవిధంగా బదులిచ్చారు. వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. ఉద్యోగాలు కల్పించకుండా ఉచిత రేషన్ పేరుతో కేంద్రంలోని బీజేపీ సరిపుచ్చుతోందని విమర్శించారు. రామమందిర ప్రాణప్రతిష్ఠకు తనకూ ఆహ్వానం అందిందని, పార్టీ కార్యక్రమాల దృష్ట్యా వెళ్లాలా వద్దా అనే అంశంపై ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పారు. రామమందిర ప్రారంభోత్సవంపై తనకెలాంటి అభ్యంతరాలూ లేవని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. బాబ్రీ మసీదుకు సంబంధించి కార్యక్రమం నిర్వహించినా తాము స్వాగతిస్తామని చెప్పారు. బీఎస్పీ సెక్యులర్ పార్టీ అని, తాము అన్ని మతాలనూ సమానంగా గౌరవిస్తామని ఆమె తెలిపారు.