Telugu Global
National

రాహుల్ గాంధీ ఆఫీస్ ఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్ కట్ చేసిన బీఎస్ఎన్ఎల్

బీఎస్ఎన్ఎల్ సంస్థ రాహుల్ గాంధీ కార్యాలయానికి ఇంటర్నెట్, ల్యాండ్‌లైన్ సేవలు నిలిపి వేసింది. రాహుల్ గాంధీ కార్యాలయం కల్పెట్టాలోని కైనాటీలో ఉన్నది.

రాహుల్ గాంధీ ఆఫీస్ ఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్ కట్ చేసిన బీఎస్ఎన్ఎల్
X

కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, డిస్‌క్వాలిఫైడ్ ఎంపీ రాహుల్ గాంధీకి బీఎస్ఎన్ఎల్ షాక్ ఇచ్చింది. వాయనాడ్‌‌లోని రాహుల్ కార్యాలయానికి ఇంటర్నెట్, ల్యాండ్ ఫోన్ కనెక్షన్లను కట్ చేసింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ యూపీలోని అమేథీతో పాటు కేరళలోని వాయనాడ్ నుంచి పోటీ చేశారు. అమేథీలో బీజేపీ అభ్యర్థి స్మృతీ ఇరానీ చేతిలో ఓడిపోయారు. అయితే వాయనాడ్ నుంచి మాత్రం రాహుల్ గెలిచారు. అప్పటి నుంచి వాయనాడ్ ఎంపీగా కొనసాగుతున్నారు.

'మోడీ' ఇంటి పేరును కించపరిచారనే నెపంతో రాహుల్‌పై పరువు నష్టం దావా వేశారు. సూరత్ కోర్టు ఆ కేసులో రాహుల్‌కు రెండేళ్ల శిక్ష విధించడం, ఆ వెంటనే లోక్‌సభ సెక్ర‌టేరియ‌ట్‌ రాహుల్‌ను డిస్‌క్వాలిఫై చేయడం జరిగిపోయాయి. రాహుల్ ఢిల్లీలోని తన అధికార నివాసాన్ని కూడా ఖాళీ చేశారు. ఈ క్రమంలో తాను గెలిచిన వాయనాడ్ నియోజకవర్గానికి వెళ్లాలని రాహుల్ నిర్ణయించుకున్నారు. ఏప్రిల్ 11న వాయనాడ్‌లో 'జై భారత్ సత్యాగ్రహ' అనే కార్యక్రమంలో భాగంగా ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలను కలవాలని భావించారు. ఇప్పటికే దీనికి సంబంధించిన షెడ్యూల్ వెలువడింది.

కాంగ్రెస్ ఈ ఏర్పాట్లలో ఉండగా.. బీఎస్ఎన్ఎల్ సంస్థ రాహుల్ గాంధీ కార్యాలయానికి ఇంటర్నెట్, ల్యాండ్‌లైన్ సేవలు నిలిపి వేసింది. రాహుల్ గాంధీ కార్యాలయం కల్పెట్టాలోని కైనాటీలో ఉన్నది. ఎంపీగా గెలిచిన తర్వాత తన అధికారిక కార్యక్రమాలను అక్కడి నుంచే చూస్తున్నారు. నియోజకవర్గానికి సంబంధించిన అన్ని పనుల కోసం సిబ్బందిని నియమించుకున్నారు.

రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం రద్దు అయినట్లు బీఎస్ఎన్ఎల్‌కు సమాచారం రావడంతో వాయనాడ్ కార్యాలయానికి సంబంధించిన కనెక్షన్లు తొలగించారు. ఎంపీగా రాహుల్ పొందుతున్న ఉచిత కనెక్షన్లు మాత్రమే తొలగించామని, లోక్‌సభ సెక్రటరీ నుంచి మాకు సమాచారం అందడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని స్థానిక బీఎస్ఎన్ఎల్ అధికారులు పేర్కొన్నారు.

వాయనాడ్‌లో సంఘ్ పరివార్ చేస్తున్న అరాచకాలు, వారి ఫాసిస్టు సిద్ధాంతాలను వ్యతిరేకిస్తూ ఏప్రిల్ 11న కాంగ్రెస్ నిర్వ‌హిస్తున్న‌ కార్యక్రమంలో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. ఈ క్రమంలో ఆయన కార్యాలయానికి ఫోన్. ఇంటర్నెట్ కనెక్షన్లు నిలిపివేయడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

First Published:  7 April 2023 10:23 AM GMT
Next Story