యడ్యూరప్ప కుటుంబానికే మళ్లీ కర్ణాటక బీజేపీ సారథ్య బాధ్యతలు
ప్రస్తుతం కర్ణాటకలో బీజేపీని మళ్లీ గాడిలో పెట్టేందుకు పార్టీ అధిష్టానం మళ్ళీ యడ్యూరప్పనే నమ్ముకుంది. ఆయన తనయుడు విజయేంద్రను పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా నియమించింది.
కర్ణాటక బీజేపీ సారథ్య బాధ్యతలు మళ్లీ యడ్యూరప్ప కుటుంబానికే దక్కాయి. ఆ రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడిగా యడ్యూరప్ప కుమారుడు విజయేంద్ర యడ్యూరప్పను నియమిస్తూ బీజేపీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. విజయేంద్ర ప్రస్తుతం షికారిపుర ఎమ్మెల్యేగా, రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో కేవలం కర్ణాటకలో మాత్రమే బీజేపీ బలంగా ఉన్న విషయం తెలిసిందే. ఆ రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి, పార్టీని బలోపేతం చేయడానికి యడ్యూరప్ప తీవ్ర కృషిచేశారు. రెండు దఫాలు బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చారు.
కాగా, కర్ణాటకలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. ఆ సమయంలో కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. జేడీఎస్ నేత కుమారస్వామి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగా.. కొద్ది నెలలకే ఆయన ప్రభుత్వం కుప్పకూలింది. ఆ తర్వాత యడ్యూరప్ప మూడవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
యడ్యూరప్ప రెండేళ్ల పాటు పదవిలో కొనసాగిన తర్వాత బీజేపీ అధిష్టానం ఆయనను పదవి నుంచి తొలగించి బసవరాజ్ బొమ్మైని ముఖ్యమంత్రిని చేసింది. అయితే బొమ్మై బలమైన నేతగా ఎదగలేకపోయారు. దీంతో ఎన్నికల ముంగిట బీజేపీ అగ్రనేతలు మళ్ళీ యడ్యూరప్ప చెంతకే వెళ్లారు. ఎన్నికల ప్రచారం బాధ్యతలు ఆయనకే అప్పగించారు. అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది.
ప్రస్తుతం కర్ణాటకలో బీజేపీని మళ్లీ గాడిలో పెట్టేందుకు పార్టీ అధిష్టానం మళ్ళీ యడ్యూరప్పనే నమ్ముకుంది. ఆయన తనయుడు విజయేంద్రను పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా నియమించింది. ఎంపీ నళిన్ కుమార్ కటీల్ స్థానంలో విజయేంద్ర బాధ్యతలు స్వీకరించనున్నారు. కాగా, యడ్యూరప్ప పెద్ద కుమారుడు రాఘవేంద్ర కూడా రాజకీయాల్లోనే ఉన్నారు. ఆయన షిమోగా పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగుతున్నారు. పార్టీ సారథ్య బాధ్యతలు మళ్లీ తమకే దక్కడంతో బీజేపీని బలోపేతం చేయడానికి యడ్యూరప్ప కుటుంబం దృష్టి సారించింది.