Telugu Global
National

ప్రజల డబ్బుతో కేంద్రం ఆటలాడుతోంది.. అదానీ వ్యవహారంపై కవిత ఫైర్

అదానీ కంపెనీల్లో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎల్ఐసీ పెట్టిన పెట్టుబడుల విలువ 11 శాతం మేర నష్టపోవడంపై ఆమె స్పందించారు.

ప్రజల డబ్బుతో కేంద్రం ఆటలాడుతోంది.. అదానీ వ్యవహారంపై కవిత ఫైర్
X

దేశంలోని ఎంతో మంది మధ్య తరగతి, పేద ప్రజలు పెట్టుబడులు పెట్టిన ఎల్ఐసీ డబ్బులతో కేంద్రం ఆటలాడుకుంటోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. అదానీ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆమె మండిపడ్డారు. ఎల్ఐసీ డబ్బులు ఆవిరవుతుంటే కేంద్రం ఎందుకు మౌనంగా ఉందని, సామాన్య ప్రజల డబ్బుకు మోడీ ప్రభుత్వం ఏమని సమాధానం చెబుతుందని ఆమె ప్రశ్నించారు. ఈ మేరకు ట్విట్టర్‌లో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఫైర్ అయ్యారు.

అదానీ కంపెనీల్లో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎల్ఐసీ పెట్టిన పెట్టుబడుల విలువ 11 శాతం మేర నష్టపోవడంపై ఆమె స్పందించారు. దేశంలోనే అతిపెద్ద కుంభకోణం జరిగి.. దాదాపు రూ.12 లక్షల కోట్లు ఆవిరయినా.. ఈడీ, ఆర్బీఐ, సీబీఐ వంటి సంస్థలు ఎందుకు మౌనంగా ఉన్నాయని ప్రశ్నించారు. ఆయా సంస్థలు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించుకోవడానికి ఉన్నాయా అని అన్నారు. అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణ జరిపించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నట్లు కవిత తెలిపారు.

కాగా, హిండెన్‌బర్గ్ నివేదక బహిర్గతం అయిన దగ్గర నుంచి ఎల్ఐసీ, ఎస్బీఐ షేర్ల ధరల్లో హెచ్చుతగ్గులు రావడం ఆందోళనకరంగా ఉందని గత నెలలో కవిత ట్వీట్ చేశారు. ఈ రెండు సంస్థల షేర్లు కోలుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సెబీని కవిత కోరారు. దీని వల్ల లక్షలాది మంది పెట్టుబడిదారుల నమ్మకం సడలకుండా ఉంటుందని.. ఇప్పటికే అనేక కుటుంబాలు ఆందోళనలో ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. ఆ ట్వీట్‌నే తిరిగి రీట్వీట్ చేస్తూ కేంద్రాన్ని మళ్లీ ప్రశ్నించారు.

హిండెన్‌బర్గ్ నివేదిక విడుదల చేసిన అనంతరం అదానీ గ్రూప్‌కు చెందిన షేర్లు భారీగా నష్టపోయాయి. ముఖ్యంగా అదానీ సంస్థలో పెట్టుబడులు పెట్టిన ఎల్ఐసీ ప్రధానంగా వార్తల్లో నిలిచింది. అదానీ గ్రూప్‌లోని ఐదు సంస్థల్లో గత ఏడాది డిసెంబర్ చివరి నాటికి ఎల్ఐసీ దాదాపు రూ.35,917 కోట్లు పెట్టుబడులు పెట్టింది. హిండెన్‌బర్గ్ నివేదిక తరువాత అదానీ గ్రూప్ షేర్లు పతనం అవ్వడంతో ఎల్ఐసీ పెట్టుబడుల విలువసైతం భారీగా క్షీణించింది. అదానీ వ్యవహారంపై కేంద్రం తీరు పట్ల ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడిపడుతున్నాయి.


First Published:  25 Feb 2023 3:14 PM IST
Next Story