Telugu Global
National

వివాహ రిసెప్షన్ లో అందరి ముందు ముద్దు.. భర్తకు విడాకులిచ్చిన భార్య

పెద్దలు ఆమెకు సర్ది చెప్పి తిరిగి వేదిక పైకి తీసుకువచ్చే ప్రయత్నం చేసినప్పటికీ ఆమె వినలేదు. వందల మంది అతిథులు చూస్తుండగా.. ముద్దు పెట్టాడు. అతడి ప్రవర్తన పై తనకు అనుమానంగా ఉందని, ఇలా ప్రవర్తించినవాడు మారతాడనే నమ్మకం తనకు లేదని పెద్దలతో ఆమె తెగేసి చెప్పింది.

వివాహ రిసెప్షన్ లో అందరి ముందు ముద్దు.. భర్తకు విడాకులిచ్చిన భార్య
X

వివాహ రిసెప్షన్‌లో ముద్దు పెట్టిన భర్తపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదేమైనా పెద్ద తప్పా.. దానికే ఫిర్యాదా..అనుకోవచ్చు. అయితే వరుడు 300 మంది అతిథుల సమక్షంలో ముద్దు పెట్టుకోవడమే వధువుకు నచ్చలేదు. అందరు చూస్తున్నా మరీ ఇంత బరితెగింపు ఏంటని నొచ్చుకున్న వధువు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు అతడికి విడాకులు కూడా ఇచ్చింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.

సంభాల్ లో ఈనెల 26వ తేదీన ఓ జంటకు పెద్దలు వివాహం చేశారు. 28వ తేదీన పావసా గ్రామంలో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు దాదాపు 300 మంది హాజరయ్యారు. వేదికపై వధూవరులు ఉండగా వేడుకకు వచ్చిన వారందరూ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ ఫొటోలు దిగుతూ సందడి సందడిగా ఉన్నారు. అంతలో ఉన్నట్టుండి భర్త భార్యను ముద్దు పెట్టుకున్నాడు. వేదికపై చుట్టూ జనం, ఎదురుగా వందలాదిమంది జనం ఉండగా వరుడు ముద్దు పెట్టుకోవడం వధువుకు నచ్చలేదు. దీంతో ఆమె ఆగ్రహంతో వేదిక నుంచి తన గదిలోకి వెళ్ళిపోయింది.

పెద్దలు ఆమెకు సర్ది చెప్పి తిరిగి వేదిక పైకి తీసుకువచ్చే ప్రయత్నం చేసినప్పటికీ ఆమె వినలేదు. వందల మంది అతిథులు చూస్తుండగా.. ముద్దు పెట్టాడు. అతడి ప్రవర్తన పై తనకు అనుమానంగా ఉందని, ఇలా ప్రవర్తించినవాడు మారతాడనే నమ్మకం తనకు లేదని పెద్దలతో ఆమె తెగేసి చెప్పింది. చివరికి ఆమె పోలీస్ స్టేషన్ కి వెళ్లి వరుడిపై ఫిర్యాదు చేసింది. తన భర్తతో జీవించడం ఇష్టం లేదని.. తనకు విడాకులు ఇప్పించాలని కోరింది.

పందెం కట్టడం వల్లే ముద్దు

ఇదిలా ఉండగా ఈ వ్యవహారమై వరుడి వాదన మరోలా ఉంది.స్టేజ్ పై అందరి ముందు నువ్వు నీ భార్యను ముద్దు పెట్టుకుంటే 1500 ఇస్తామని, ఒకవేళ నువ్వు పెట్టుకోలేకపోతే మాకు 3000 ఇవ్వాలని స్నేహితులు పందెం కాయడంతోనే ఇలా ప్రవర్తించానని వరుడు పోలీసులకు వివరించాడు. అయితే వధువు ఈ పందెంతో తనకు సంబంధం లేదని, తన అనుమతి లేకుండా తనను ముద్దు పెట్టుకున్నందుకు విడాకులు ఇప్పించాలని పోలీసులను కోరింది.

అనంతరం పోలీసులు పెద్దలతో చర్చించగా.. ఇంత గొడవ జరిగిన తర్వాత వారిద్దరూ కలిసి ఉండకపోవడమే మేలని పెద్దలు అభిప్రాయం వ్యక్తం చేశారు. వాళ్ళిద్దరి పెళ్లి ఇంకా అధికారికంగా రిజిస్టర్ కాలేదు కాబట్టి వారు విడిపోవచ్చని పోలీసులు తెలపడంతో నూతన వధూవరులు తమ బంధాన్ని తెంచుకున్నారు. పెళ్లయిన రెండో రోజే భర్త ముద్దు పెట్టుకున్నాడని భార్య బంధాన్ని తెంపేసుకుని వెళ్లిన ఘటన సంచలనం సృష్టిస్తోంది.

First Published:  1 Dec 2022 6:26 PM IST
Next Story