Telugu Global
National

బ్రేకింగ్ : కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య

కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ఎంపికైనట్లు టీవీల్లో వార్తలు వస్తుండడంతో ఆయన అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో ఆయన నివాసం వద్దకు చేరుకుంటున్నారు.

Karnataka CM Siddaramaiah
X

కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య

కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించినప్పటికీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేదెవరు? అనే విషయమై గత ఐదు రోజులుగా తీవ్ర సస్పెన్స్ నెలకొంది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపించింది. తాను చివరి ఎన్నికలు ఎదుర్కొన్నానని, రాజకీయాల్లో సీనియర్ నని.. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేసిన తనకు రెండేళ్ల పదవి ఇచ్చినా చాలని సిద్ధ రామయ్య కాంగ్రెస్ హై కమాండ్ కు విజ్ఞప్తి చేశారు.

అయితే ముఖ్యమంత్రి పదవి రేసులో ఉన్న పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఇందుకు ఒప్పుకోలేదు. పదవిని పంచుకోవడం ఇష్టం లేదని.. ఇస్తే సీఎం పదవి ఇవ్వండి..లేదా ఎమ్మెల్యేగా ఉండనివ్వండి.. అని ఆయన ఖరాకండిగా చెప్పేశారు. దీంతో కర్ణాటక ముఖ్యమంత్రిగా ఎవరిని నియమిస్తారో నన్న సస్పెన్స్ కొనసాగుతూ వచ్చింది.

అయితే ఈ సస్పెన్స్ కు ఇవాళ కాంగ్రెస్ అధిష్టానం తెరదించింది. కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యను ఎంపిక చేసినట్లు సమాచారం. బెంగళూరులో సిద్ధరామయ్య నివాసం వద్ద ఉన్నట్టుండి వందలాదిమంది పోలీసులతో భద్రత పెంచారు. మరోవైపు అధికారులు ఆయనకు ప్రోటోకాల్ ఇవ్వడంతో ఆయనను కాంగ్రెస్ అధిష్టానం సీఎంగా ఎంపిక చేసినట్లు అర్థమవుతోంది.

తనను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసినందుకుగాను సిద్ధరామయ్య సోనియాగాంధీ నివాసానికి వెళ్లి సోనియా, రాహుల్ గాంధీలకు కృతజ్ఞతలు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ సిద్ధరామయ్యకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. డీకే శివకుమార్ కు డిప్యూటీ సీఎం పదవితోపాటు రెండు కీలక శాఖలు కూడా అప్పగించాలని హైకమాండ్ నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం డీకే పీసీసీ అధ్యక్ష పదవిలో ఉండగా ఆ పదవిలో కూడా ఆయన కొనసాగనున్నారు. ఇవాళ మధ్యాహ్నం రాహుల్ గాంధీ డీకేతో భేటీ అయి ఆయన్ను బుజ్జగించనున్నట్లు తెలుస్తోంది.

కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ఎంపికైనట్లు టీవీల్లో వార్తలు వస్తుండడంతో ఆయన అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో ఆయన నివాసం వద్దకు చేరుకుంటున్నారు. ప్రస్తుతం సిద్ధరామయ్య ఇంటి వద్ద కోలాహలం నెలకొంది. అభిమానులు భారీగా టపాసులు పేల్చారు. ఇవాళ మధ్యాహ్నంలోగా సిద్ధరామయ్యను కర్ణాటక ముఖ్యమంత్రిగా ఎంపిక చేసినట్లు కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ప్రకటించనుంచనున్నట్లు తెలుస్తోంది. సాయంత్రం సిద్దరామయ్య బెంగళూరుకు చేరుకోనున్నారు. రేపు ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణం చేస్తారు. ఇందుకోసం బెంగళూరులోని ఓ స్టేడియంలో ఏర్పాట్లు కూడా ప్రారంభించారు.కర్ణాటక ముఖ్యమంత్రిగా ఎవరిని ఎంపిక చేయాలనే విషయమై కాంగ్రెస్ పెద్దలు నాలుగైదు రోజులపాటు సుదీర్ఘంగా చర్చించారు. చివరికి సీఎం పదవి కాలాన్ని సిద్ధరామయ్య, డీకే చెరి సగం రోజులు చేపట్టేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతోనే ఇద్దరు నేతలకు న్యాయం జరుగుతుందని అధిష్టానం పెద్దలు భావించి ఈ మేరకు ఈ నిర్ణయమే ఫైనల్ చేశారు.

First Published:  17 May 2023 1:34 PM IST
Next Story