అర్ధరాత్రి తర్వాత విచారణ.. హక్కుల ఉల్లంఘనే.. - ఈడీ తీరుపై బాంబే హైకోర్టు అసహనం
అతన్ని రాత్రంతా విచారించడాన్ని మాత్రం తప్పుపట్టింది. నిందితుడి అంగీకారంతోనే తెల్లవారుజాము మూడు గంటల వరకు విచారించినట్టు ఈడీ తరపు న్యాయవాది వాదించడంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.
నిందితులను అర్ధరాత్రి తర్వాత కూడా విచారించడం హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని బాంబే హైకోర్టు అభిప్రాయపడింది. మనుషుల ప్రాథమిక అవసరమైన నిద్రించే హక్కును ఉల్లంఘించడమవుతుందని అభిప్రాయపడింది. ఓ కేసులో విచారణ సందర్భంగా ఒక వ్యక్తి విషయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వ్యవహరించిన తీరుపై న్యాయస్థానం తప్పుపట్టింది. నిద్రించే హక్కును ఉల్లంఘించలేమని, అది మనుషుల ప్రాథమిక అవసరమని ఈ సందర్భంగా హైకోర్టు తెలిపింది.
మనీల్యాండరింగ్‌కి సంబంధించిన ఓ కేసులో ఈడీ గత ఏడాది ఆగస్టులో రామ్ ఇస్రానీ అనే 64 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసింది. అయితే తన అరెస్టును సవాల్ చేస్తూ అతను న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. తన అరెస్టు చట్టవిరుద్ధమని తన పిటిషన్‌లో ఆరోపించాడు. తాను ఈడీ విచారణకు పూర్తిగా సహకరించానని, పిలిచినప్పుడల్లా హాజరైనా సరే తనను అరెస్టు చేశారని పేర్కొన్నాడు.
గత ఆగస్టు 7వ తేదీన అధికారులు తనను రాత్రంతా విచారించి మరుసటిరోజు అదుపులోకి తీసుకున్నారని ఇస్రానీ తెలిపాడు. దీనిని పరిశీలించిన న్యాయస్థానం అతని పిటిషన్‌ను తోసిపుచ్చింది. అయితే.. అతన్ని రాత్రంతా విచారించడాన్ని మాత్రం తప్పుపట్టింది. నిందితుడి అంగీకారంతోనే తెల్లవారుజాము మూడు గంటల వరకు విచారించినట్టు ఈడీ తరపు న్యాయవాది వాదించడంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.
నిద్ర మనుషుల కనీస అవసరమని, దానిని అడ్డుకోవడం హక్కుల ఉల్లంఘన కిందికే వస్తుందని న్యాయస్థానం తెలిపింది. నిద్ర లేకపోవడం మనిషి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని పేర్కొంది. అర్ధరాత్రి తర్వాత వాంగ్మూలాన్ని రికార్డు చేసే పద్ధతిని తాము నిరాకరిస్తున్నామని స్పష్టం చేసింది. పగటిపూట మాత్రమే వాంగ్మూలాలను రికార్డు చేయాలని తెలిపింది. పిటిషనర్ అంగీకరించినప్పటికీ.. ఆ తర్వాత రోజో లేక మరోసారో ఆ వ్యక్తిని విచారణకు పిలిచి ఉండాల్సిందని తాజాగా న్యాయస్థానం పేర్కొంది.