హిజాబ్ నిషేధ నిర్ణయంలో జోక్యం చేసుకోలేం.. - బాంబే హైకోర్టు కీలక తీర్పు
కాలేజీ తీసుకున్న నిర్ణయం తమకు రాజ్యాంగం కల్పిస్తున్న ప్రాథమిక హక్కును ఉల్లంఘిస్తోందని వారు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు.
ముంబైలోని ఒక కాలేజీ యాజమాన్యం హిజాబ్‌ను నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయం విషయంలో తాము జోక్యం చేసుకోలేమని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ ఎ.ఎస్.చందుర్కర్, జస్టిస్ రాజేష్ పాటిల్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో గల ఒక కాలేజీ యాజమాన్యం హిజాబ్‌ను నిషేధిస్తూ నిర్ణయం తీసుకోగా, దానిని సవాల్ చేస్తూ 9 మంది విద్యార్థినులు ఈ పిటిషన్ దాఖలు చేశారు.
చెంబూర్ ట్రాంబే ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలోని ఎన్‌జీ ఆచార్య, డీకే మరాఠే కళాశాలల్లో విద్యార్థినులు హిజాబ్, నఖాబ్, బుర్ఖా, క్యాప్‌లు, బ్యాడ్జీలు ధరించడానికి వీల్లేదని యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. అయితే.. విద్యార్థినులు దీనిపై బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కాలేజీ తీసుకున్న నిర్ణయం తమకు రాజ్యాంగం కల్పిస్తున్న ప్రాథమిక హక్కును ఉల్లంఘిస్తోందని వారు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. విచారణ సందర్భంగా కాలేజీ యాజమాన్యం తన వాదన వినిపిస్తూ.. తాము ఏ మతానికి వ్యతిరేకంగానూ.. ఎలాంటి డ్రెస్ కోడ్ పెట్టలేదని తెలిపింది. విద్యార్థులందరూ క్రమశిక్షణతో ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని కాలేజీ యాజమాన్యం కోర్టుకు వివరించింది. ఈ నేపథ్యంలో బాంబే హైకోర్టు కాలేజీ నిర్ణయం విషయంలో తాము జోక్యం చేసుకోలేమని తెలిపింది.