Telugu Global
National

ఢిల్లీలో పలు మ్యూజియంలకు బాంబు బెదిరింపులు

మ్యూజియంల నిర్వాహకులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బెదిరింపు మెయిల్ వచ్చిన మ్యూజియంలకు పోలీసులు చేరుకొని క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు.

ఢిల్లీలో పలు మ్యూజియంలకు బాంబు బెదిరింపులు
X

దేశ రాజధాని ఢిల్లీని బాంబు బెదిరింపులు భయపెడుతున్నాయి. నగరంలో ఏదో ఒకచోట బాంబు పెట్టామని రోజూ మెయిల్స్ వస్తూనే ఉన్నాయి. దీంతో పోలీసు ఉన్నతాధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. తీరా అవి ఉత్తుత్తి బెదిరింపులే అని నిర్ధారించుకొని వెనుదిరుగుతున్నారు. తాజాగా ఢిల్లీలోని దాదాపు 15 మ్యూజియంలకు బాంబు బెదిరింపులు వచ్చాయి.

ఢిల్లీలోని రైల్వే మ్యూజియంతో సహా దాదాపు 15 మ్యూజియంలకు మంగళవారం బాంబు బెదిరింపులు వచ్చాయి. మ్యూజియంలలో బాంబులు పెట్టినట్లు దుండగులు మెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు. దీనిపై మ్యూజియంల నిర్వాహకులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బెదిరింపు మెయిల్ వచ్చిన మ్యూజియంలకు పోలీసులు చేరుకొని క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అయితే ఏ మ్యూజియంలో బాంబులు లేవని వారు తేల్చారు. బెదిరింపులన్నీ అవాస్తవాలేనని ప్రకటించారు.

దీనిపై కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల ఢిల్లీలోని పాఠశాలలు, కాలేజీలు, ఆసుపత్రులు, ఎయిర్ పోర్ట్ లకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. అయితే ఈ పని ఎవరు చేస్తున్నారో పోలీసులు కనుక్కోలేకపోతున్నారు. ఈ బెదిరింపుల వెనకాల ఎవరున్నారో తెలుసుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.

First Published:  12 Jun 2024 8:43 AM GMT
Next Story