Telugu Global
National

మణిపూర్‌ సీఎం ఇంటి వద్ద బాంబు కలకలం

ఘటన నేపథ్యంలో సీఎం ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం

మణిపూర్‌ సీఎం ఇంటి వద్ద బాంబు కలకలం
X

మైతేయ్‌-కుకీ తెగల మధ్య చెలరేగిన ఘర్షణలతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ ఏడాదిన్నర కాలంగా అతలాకుతలమవున్నది. పలుచోట్ల హింసాత్మక ఘటనలు, బాంబు దాడులు, ఆందోళనలతో అట్టుడుకుతున్నది. ఈ నేపథ్యంలో తాజాగా సీఎం నివాసం వద్దే బాంబు కనిపించడం తీవ్ర కలకలం సృష్టించింది.

మణిపూర్‌లోని కొయిరెంగేయ్‌ ప్రాంతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌కు ప్రైవేట్‌ నివాసం ఉన్నది. ఈ ఇంటికి కొన్ని మీటర్ల దూరంలో మంగళవారం తెల్లవారుజామున ఓ మోర్టార్‌ బాంబును గుర్తించారు. దీంతో స్థానికులు భయాందోళనకు గురై పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాంబును నిర్వీర్యం చేశారు. అయితే ఘటన సమయంలో సీఎం ఇంట్లో లేరని తెలస్తోంది.

ఈ రాకెట్‌ ప్రొపెల్డ్‌ బాంబును గత రాత్రి ప్రయోగించి ఉంటారని కొంతమంది స్థానికులు చెబుతున్నారు. అది పేలకుండా ఇక్కడ పడిపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఘటన నేపథ్యంలో సీఎం ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాంబు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎవరు ప్రయోగించి ఉంటారు? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

First Published:  17 Dec 2024 11:24 AM IST
Next Story