Telugu Global
National

బాలీవుడ్‌ను కలవరపెడుతున్న బెట్టింగ్ స్కామ్..

ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీకి రూ. 112 కోట్లు హవాలా మార్గంలో చెల్లించారని, ఒక్క హోటల్ గదుల కోసమే రూ. 42 కోట్లు వెచ్చించినట్టుగా సమాచారం.

బాలీవుడ్‌ను కలవరపెడుతున్న బెట్టింగ్ స్కామ్..
X

బెట్టింగ్ యాప్ మహాదేవ్ మనీ ల్యాండరింగ్ కేసు ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ కేసులో ఈడీ విచారణ కొనసాగుతుండగా.. విస్తుగొలిపే విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పటికి ఈ కేసుకు సంబంధించిన కోల్‌కతా, భోపాల్, ముంబై వంటి నగరాల్లోని 39 ప్రాంతాల్లో ఈడీ సోదాలను నిర్వహించి, రూ.417 కోట్ల నగదుతో పాటు పలు విలువైన పత్రాలను స్వాధీనం చేసుకుంది. అయితే ఈ క్రమంలోనే దుబాయ్ వేదికగా ఫిబ్రవరిలో యాప్ ప్రమోటర్, నిందితుడు సౌరభ్ చంద్రకర్ వివాహ వేడుకకు పలువురు బాలీవుడ్ నటులు, గాయకులు హాజరైన విషయం బయటపడింది.

దుబాయ్‌లోని రాస్ అల్ ఖైమా‌లో రూ.200 కోట్లు ఖర్చుచేసి ధూం ధాంగా పెళ్లి చేసుకున్నాడు చంద్రకర్. ఈ వేడుకల్లో దాదాపు 17మంది బాలీవుడ్‌ ప్రముఖులు పాల్గొన్నట్టు దర్యాప్తులో తేలింది. వివాహానికి టైగర్ ష్రాఫ్, సన్నీ లియోన్, నేహా కక్కర్, అతిఫ్ అస్లాం, రహత్ ఫతే అలీ ఖాన్, అలీ అస్గర్, విశాల్ దడ్లానీ, ఎల్లి అవ్రామ్, భారతీ సింగ్, భాగ్యశ్రీ, కృతి కర్బందా, నుష్రత్ భరుచ్చా, కృష్ణ అభిషేక్, గాయకులు సులీ, నేహా కక్కర్ తదితరులు ఈ వేడుకలకు హాజరైనట్టు గుర్తించారు.

వీరి కోసం ఒక ప్రైవేటు జెట్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీకి రూ. 112 కోట్లు హవాలా మార్గంలో చెల్లించారని, ఒక్క హోటల్ గదుల కోసమే రూ. 42 కోట్లు వెచ్చించినట్టుగా సమాచారం. ఇలా హవాలా సొమ్మునే ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ బాలీవుడ్ సెలబ్రిటీలకు చెల్లింపులు చేసినట్టు తెలియడంతో వీరందరికీ కూడా ఈడీ సమన్లు పంపేందుకు సిద్ధమవుతోంది.

ఇప్పటి వరకు మహాదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌పై ఛత్తీస్‌గఢ్ పోలీసులు 72 కేసులు నమోదు చేయగా.. ఢిల్లీ, ముంబై తదితర ప్రాంతాలలో 449 మంది అనుమానితులను అరెస్టు చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా డజనుకు పైగా వ్యక్తులను ప్రశ్నించింది. ఆగస్టు చివరి వారం నుంచి కేసుపై దర్యాప్తును ఈడీ ఉధృతం చేసింది.

First Published:  16 Sept 2023 12:15 PM GMT
Next Story