Telugu Global
National

ఉత్తరప్రదేశ్ లో పడవ బోల్తా..25 మందికి పైగా గ‌ల్లంతు

ఉత్త‌ర ప్ర‌దేశ్ లో జ‌రిగిన ప‌డవ ప్రమాదంలో 25 మంది గల్లంతయ్యారు. ఇప్పటివరకు నాలుగు మృత‌దేహాలను వెలికి తీయగలిగారు.

ఉత్తరప్రదేశ్ లో పడవ బోల్తా..25 మందికి పైగా గ‌ల్లంతు
X

ఉత్త‌ర ప్ర‌దేశ్ లో జ‌రిగిన ప‌డ‌వ బోల్తా ఘ‌ట‌న‌లో విషాదం చోటుచేసుకుంది. ఈ ప్ర‌మాదంలో 25 మందికి పైగా గ‌ల్లంత‌య్యార‌ని శుక్ర‌వారంనాడు అధికారులు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌లో నాలుగు మృత‌దేహాల‌ను వెలికితీసిన‌ట్టు చెప్పారు.

ఎన్డీఆర్ ఎఫ్, ఎస్ డిఆర్ ఎఫ్ బృందాలు గాలింపు చ‌ర్య‌ల్లో నిమ‌గ్న‌మ‌య్యాయ‌ని ,సహాయం కోసం ప్రయాగ్‌రాజ్ నుండి గ‌జ ఈత‌గాళ్ళ‌ను (డైవర్లు) కూడా పిలిపించామ‌ని తెలిపారు. ఈ ఘోర ప్రమాదంలో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి మృత‌దేహాల‌ను వెలికితీశార‌ని డిఐజి విపిన్ మిశ్రా తెలిపారు.

గురువారం ఫతేపూర్ జిల్లాలోని మార్కా నుంచి జరౌలీ ఘాట్‌కు వెళ్తుండగా బోటు బోల్తా పడింది. ప్ర‌మాద స‌మ‌యంలో అందులో 30 మందికి పైగా ఉన్నారు. కొంత‌మంది ఈదుకుంటూ సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డార‌ని, ఇంకా 20-25 మంది ఆచూకీ తెలియాల్సి ఉంద‌న్నారు. బాండా జిల్లాలోని మార్క పోలీస్ స్టేషన్ పరిధిలోని సంగర గ్రామంలో ఈ ఘటన జరిగిందని మిశ్రా శుక్రవారం తెలిపారు.

అతివేగంగా వీస్తున్న గాలుల కారణంగా బండా జిల్లా సరిహద్దు సమీపంలో పడవ బోల్తా పడిందని పోలీసులు తెలిపారు. ప్రత్యక్ష సాక్షుల క‌థ‌నం మేర‌కు ప్ర‌మాద స‌మ‌యంలో ప‌డ‌వ‌లో 40-45 మంది ప్రయాణికులు ఉన్నారని, వారిలో 15 మంది సురక్షితంగా ఈదుకుంటూ ఒడ్డుకు రావ‌డం క‌నిపించింద‌ని పోలీసు అధికారి ఒక‌రు తెలిపారు. మృతులు ముగ్గురిని ఫుల్వా (50), రాజ్‌రాణి (45), కిషన్ (7 నెలలు)గా గుర్తించినట్లు తెలిపారు. కాగా ప్ర‌మాద విష‌యం తెలియ‌గానే ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ ఇద్ద‌రు మంత్రుల‌ను సంఘ‌ట‌నా స్థ‌లానికి పంపారు. మృతుల కుటుంబీకుల‌కు రూ. 4 ల‌క్షల స‌హాయాన్ని ప్ర‌క‌టించారు.

First Published:  12 Aug 2022 2:31 PM GMT
Next Story