Telugu Global
National

బెంగాల్ లో బీజేపీ త్రిముఖ వ్యూహం.. కారణం ఏంటంటే..?

తాజాగా ముగ్గురు కేంద్ర మంత్రులను రంగంలోకి దించింది బీజేపీ అధిష్టానం. కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్‌, స్మృతి ఇరానీ, జోతిరాదిత్య సింధియాకు పశ్చిమ బెంగాల్‌ బాధ్యతలు అప్పగించింది.

బెంగాల్ లో బీజేపీ త్రిముఖ వ్యూహం.. కారణం ఏంటంటే..?
X

ఇటీవల పశ్చిమబెంగాల్ లో బీజేపీ హడావిడి బాగా ఎక్కువైంది. ఆ రాష్ట్ర మంత్రి అరెస్ట్ అయ్యారు, టీఎంసీలో మరో కీలక నేతను విచారణ పేరుతో కటకటాల వెనక్కు నెట్టారు. మొత్తంగా సీఎం మమతా బెనర్జీని ఇబ్బంది పెట్టాలనే టార్గెట్ తో బీజేపీ వ్యూహాలు పన్నుతోంది. ఈ క్రమంలో తాజాగా ముగ్గురు కేంద్ర మంత్రులను రంగంలోకి దించింది బీజేపీ అధిష్టానం. కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్‌, స్మృతి ఇరానీ, జోతిరాదిత్య సింధియాకు పశ్చిమ బెంగాల్‌ బాధ్యతలు అప్పగించింది.

ఇప్పటికిప్పుడు హడావిడి ఏంటి..?

పశ్చిమబెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసి ఏడాది మాత్రమే. కానీ అక్కడ అధికారం ఆశించి భంగపడ్డ బీజేపీ ఎలాగైనా కలకలం సృష్టించాలనుకుంటోంది. నిన్న మొన్నటి వరకూ గవర్నర్ గా ఉన్న జగదీప్ ధన్ కర్ తో ఏదో చేయాలనుకున్నా సాధ్యం కాలేదు, చివరకు ఈడీ రంగంలోకి దిగాల్సి వచ్చింది. కానీ మమత బెదిరేలా లేదు. అందుకే బీజేపీ బెంగాల్ పై మరింత ఫోకస్ పెంచింది. 2024 లోక్ సభ ఎన్నికలనాటికి బెంగాల్ లో పరిస్థితులు తమకు అనుకూలంగా మార్చేందుకు బీజేపీ పావులు కదుపుతోంది.

42 లోక్ సభ స్థానాలున్న పశ్చిమబెంగాల్ లో 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 18 స్థానాల్లో గెలిచింది. అదే ఊపులో 2021 అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చూపించాలనుకున్నా సాధ్యం కాలేదు, సరికదా ఆ 18 లోక్ సభ స్థానాల పరిధిలో కూడా బీజేపీకి ఘోర పరాభవాలు ఎదురయ్యాయి. దీంతో నష్టనివారణ చర్యలు చేపట్టింది అధిష్టానం. అత్యథిక లోక్ సభ స్థానాలున్న రాష్ట్రాలపై దృష్టి పెట్టిన బీజేపీ, 2024నాటికి బెంగాల్ లో పట్టు నిలుపుకోవ‌డానికి ప్రయత్నిస్తోంది. అందుకే ముగ్గురు కేంద్ర మంత్రులతో త్రిముఖ వ్యూహాన్ని రెండేళ్ల ముందుగానే అమలులో పెట్టింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు బెంగాల్ పై పట్టు ఉంది, నాయకులు, పార్టీ శ్రేణులతో ఆయనకు మంచి సంబంధాలున్నాయి. ఆ దిశగా ఆయన పార్టీని బలోపేతం చేస్తారని అంటున్నారు. ఇక మహిళల ఓట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై మరో మంత్రి స్మృతి ఇరానీ ఫోకస్ పెడతారని తెలుస్తోంది. జ్యోతిరాదిత్య సింధియాకి కూడా కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారు. వీరంతా బెంగాల్ లో పార్టీని ఏ మేరకు బలపరుస్తారో, 2024నాటికి ఎలా సిద్ధం చేస్తారో వేచి చూడాలి.

First Published:  12 Aug 2022 9:04 AM IST
Next Story