బెంగాల్ లో బీజేపీ మైండ్ గేమ్.. మిథున్ కి మైండే లేదన్న టీఎంసీ..
బీజేపీ నేత మిథున్ చక్రవర్తి మానసిక ఆరోగ్యం సరిగా లేనట్లుందని టీఎంసీ ఎంపీ శాంతను సేన్ విమర్శించారు.
"మీ పార్టీ నేతలంతా మాతో టచ్ లో ఉన్నారు, రేపో మాపో పార్టీ ఫిరాయిస్తారు, మీ ప్రభుత్వం పడిపోతుంది కాచుకోండి.." నిజంగా ఎమ్మెల్యేలు టచ్ లో ఉంటే ఇలాంటి మాటలు ఎవరూ చెప్పరు. ఇది కేవలం మైండ్ గేమ్ అని ఈజీగా అర్థమవుతుంది. బెంగాల్ లో ఇలాంటి మైండ్ గేమ్ మొదలు పెట్టాలనుకుంటోంది బీజేపీ. తృణమూల్ కాంగ్రెస్ ని బలహీన పరచాలనుకుంటోంది. అయితే బీజేపీ నేత మిథున్ చక్రవర్తి వ్యాఖ్యలు కలకలం రేపాల్సింది పోయి కామెడీగా మారాయి. చివరకు ఆయనకే మెంటలొచ్చిందని టీఎంసీ విమర్శలు చేసింది. మిథున్ కి మద్దతుగా బీజేపీ నుంచి ఎవరూ మాట్లాడకపోవడం, టీఎంసీకి కౌంటర్లివ్వకపోవడం విశేషం.
ఇటీవల బెంగాల్ లో మంత్రి పార్థా చటర్జీ అరెస్ట్ వ్యవహారంతో టీఎంసీలో అసంతృప్తి చెలరేగిందని, పార్టీ నిట్టనిలువునా చీలిపోతోందని, 38మంది టీఎంసీ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లో ఉన్నారని చెప్పుకొచ్చారు బీజేపీ నేత మిథున్ చక్రవర్తి. 21 మంది ఎమ్మెల్యేలు నేరుగా తనతోనే టచ్ లో ఉన్నారని చెప్పారాయన. ఇక మిగతా విషయాలు మీ అంచనాకు వదిలేస్తున్నానంటూ మీడియాని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఇదో బ్రేకింగ్ న్యూస్ అంటూ చెప్పుకొచ్చారు. శివసేన తరహా చీలిక టీఎంసీలో వస్తుందా అన్న ప్రశ్నకు ట్రైలర్ విడుదల చేయాలని అడగొద్దు, మ్యూజిక్ ని విని ఎంజాయ్ చేయండి అంటూ సినిమా స్టైల్ లో సమాధానమిచ్చారు మిథున్.
మహారాష్ట్రలో శివసేన చీలిక విషయంలో బీజేపీ ప్రయత్నం లేదు, ఉద్ధవ్ పై కోపంతో షిండే తనకు తానుగా పార్టీని విడగొట్టారు, బీజేపీతో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. బెంగాల్ లో అలాంటి పరిస్థితి వస్తుందని ఎవరూ ఊహించట్లేదు. కానీ బీజేపీ మైండ్ గేమ్ ఆడాలనుకుంది, మిథున్ ఇలా మీడియాకు లీకులిచ్చి తానేదో సంచలన విషయం బయటపెట్టానని ఫీలయ్యారు. కానీ టీఎంసీనుంచి గట్టిగానే కౌంటర్లు మొదలయ్యాయి. బీజేపీ నేత మిథున్ చక్రవర్తి మానసిక ఆరోగ్యం సరిగా లేనట్లుందని టీఎంసీ ఎంపీ శాంతను సేన్ విమర్శించారు. మిథున్ ఆసుపత్రిలో చేరారని విన్నాను, ఆయన సమస్య శారీరకం కాదు, బహుశా మానసిక వ్యాధి అయి ఉంటుందంటూ సెటైర్లు పేల్చారు. మిథున్ ని సొంత పార్టీలోనే ఎవరూ నమ్మరని, ఇక ప్రజలు ఎందుకు నమ్ముతారని ఎద్దేవా చేశారు.