Telugu Global
National

బ్రహ్మానందం ప్రచారం చేసిన స్థానంలో బీజేపీ అభ్యర్థి ఓటమి

చిక్‌బల్లాపూర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి డాక్టర్ సుధాకర్‌పై కాంగ్రెస్ అభ్యర్థి ప్రదీప్ ఈశ్వర్ 11,130 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.

బ్రహ్మానందం ప్రచారం చేసిన స్థానంలో బీజేపీ అభ్యర్థి ఓటమి
X

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కన్నడిగులు విలక్షణమైన తీర్పు ఇచ్చారు. హేమాహేమీలు, తప్పకుండా గెలుస్తారని అంచనా వేసిన వారు ఓటమి పాలవుతున్నారు. బీజేపీ తరపున ప్రధాని మోడీ 110కు పైగా రోడ్ షోలు.. 10 బహిరంగ సభలు నిర్వహించారు. అమిత్ షా, జేపీ నడ్డా కూడా కర్ణాటకలో ప్రచారాన్ని హోరెత్తించారు. ఇక కొంత మంది బీజేపీ అభ్యర్థులు తమ సొంత పరిచయాలతో సినీ నటులను కూడా తీసుకొచ్చి ప్రచారం చేయించారు. కిచ్చా సుదీప్ తొలుత బీజేపీ తరుపున ప్రచారం చేస్తారని భావించినా.. చివరకు ఆయన సీఎం బసవరాజు బొమ్మై మీద అభిమానంతో ఆయనకు మాత్రమే ప్రచారం చేస్తానని చెప్పుకొచ్చారు.

ఇక టాలీవుడ్ స్టార్ కమేడియన్ బ్రహ్మానందం కూడా కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీ నాయకుడు, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సుధాకర్ తరపున చిక్‌బల్లాపూర్‌లో నాలుగు రోజుల పాటు రోడ్ షోలు, ప్రచారం చేశారు. తెలుగు వారు ఎక్కువగా నివసించే చిక్‌బల్లాపూర్ ప్రాంతంలో బ్రహ్మానందాన్ని చూడటానికి జనాలు బాగానే వచ్చారు. కానీ అవన్నీ ఓట్లుగా మాత్రం మారలేదు. బ్రహ్మానందం ప్రచారం ప్రచారం చేసిన చోట డాక్టర్ సుధాకర్ ఓడిపోయారు.

చిక్‌బల్లాపూర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి డాక్టర్ సుధాకర్‌పై కాంగ్రెస్ అభ్యర్థి ప్రదీప్ ఈశ్వర్ 11,130 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. ఈశ్వర్‌కు 69,008 ఓట్లు పోలవగా.. సుధాకర్‌కు 57,878 ఓట్లు.. జేడీఎస్ అభ్యర్థి కేపీ బచేగౌడకు 13,300 ఓట్లు వచ్చాయి.

డాక్టర్ సుధాకర్ గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. అయితే ఆ తర్వాత పార్టీ మారి బీజేపీలో చేరారు. ఆయన ఏ పార్టీలో ఉన్నా.. తన స్నేహితుడిపై ప్రేమతో బ్రహ్మానందం ప్రచారం చేశారు. బ్రహ్మానందం ప్రచారం చేసిన ప్రతీసారి సుధాకర్ గెలుస్తూ వస్తున్నారు. అదే సెంటిమెంట్‌తో సుధాకర్ మరోసారి బ్రహ్మానందాన్ని పిలిపించి ప్రచారం నిర్వహించారు. కానీ ఆ గెలుపు సెంటిమెంట్ మాత్రం ఈ సారి వర్కవుట్ కాలేదు.

First Published:  13 May 2023 1:31 PM IST
Next Story