ముంబై: ఉప ఎన్నికలో అనూహ్య ట్విస్ట్..పోటీ నుంచి బిజెపి ఉపసంహరణ!
ముంబైలోని అంధేరీ అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలో బీజేపీ తన అభ్యర్థిని ఉపసంహరించుకుంది. మరణించిన ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే రమేష్ లత్కే భార్య రుతుజ లత్కే ఉద్దవ్ శివసేన వర్గం తరపున పోటీ చేస్తున్నారు. ఆమెకు మద్దతుగా బీజేపీ తన అభ్యర్థిని ఉపసంహరించుకుంది.
ముంబైలోని అంధేరి ఈస్ట్ ఉప ఎన్నికలో సోమవారంనాడు అనూహ్య ట్విస్టు చోటు చేసుకుంది. ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన ఉద్దవ్ శివసేన వర్గం ఎమ్మెల్యే రమేష్ లత్కే మరణించడంతో ఈ ఉప ఎన్నిక జరుగుతోంది. ఆయన భార్య రుతుజ లత్కే ఉద్దవ్ శివసేన వర్గం తరపున పోటీ చేస్తున్నారు. బిజెపి తరపున ముర్జీ పటేల్ పోటీలో ఉన్నారు.
అయితే సోమవారంనాడు అనూహ్యంగా పటేల్ పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు బిజెపి ప్రకటించి అందర్నీ ఆశ్చర్య పరిచింది. విచిత్రమేమటంటే ఉద్ధవ్ తో దూరంగా ఉన్న ఆయన బంధువు, మహారాష్ట్ర నవనిర్మాణ సమితి (ఎంఎన్ ఎస్) అధినేత రాజ్ ఠాక్రే ముందుగా రుతుజ కు మద్దతుగా నిలిచారు. ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు వీలుగా తమ అభ్యర్ధిని ఉపసంహరించుకోవాలంటూ రాజ్ థాక్రే ఉపముఖ్యమంత్రి బిజెపి నేత దేవేంద్ర ఫడ్నవీస్ కు లేఖ రాశారు.
ఇది జరిగిన కొద్ది గంటల్లోనే షిండే వర్గం ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయక్ కూడా ముఖ్యమంత్రి షిండేకు లేఖ రాస్తూ బిజెపి అభ్యర్ధిని నిలబెట్టకుండా చూడాలని కోరారు. రమేష్ లత్కేకు నివాళిగా రుతుజ ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు.
అతకు ముందు ఎన్ సీపీ అధినేత శరద్ పవార్ కూడా రుతుజ ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు పార్టీలన్నీ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దివంగత నేత చేసిన సేవలను పరిగణనలోకి తీసుకుని ఆయనకు నివాళిగా ఆయన భార్య ను ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా సహకరించి మహారాష్ట్ర ఒక గొప్ప సంస్కృతికి ప్రతీకగా నిలవాలని పవార్ విజ్ఞప్తి చేశారు.