Telugu Global
National

బీజేపీవి నిజమైన విజయాలేనా? కమలం పార్టీకి జనామోదం ఉన్నదా?

దేశంలో బీజేపీ అలా వెలిగిపోతోందా? సగానికి పైగా భారతీయులు కాషాయ దళానికి జై కొడుతున్నారా? అంటే.. కాదనే సమాధానం వస్తుంది.

బీజేపీవి నిజమైన విజయాలేనా? కమలం పార్టీకి జనామోదం ఉన్నదా?
X

గుజరాత్, హిమాచల్ అసెంబ్లీ, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు 7 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఒక ట్వీట్ వైరల్ అయ్యింది. ఈ సిరీస్‌ను బీజేపీ 1-3 తేడాతో ఓడిపోయింది అనేది ఆ ట్వీట్ సారాంశం. గుజరాత్‌లో గెలిచింది.. హిమాచల్, ఢిల్లీలో ఓడింది. దాంతో పాటు 7 స్థానాల్లో ఉపఎన్నికలు జరిగితే ఐదింట బీజేపీకి పరాజయాలే.. అంటే ఈ లీగ్‌లో బీజేపీ ఓడిపోయినట్లే కదా అని నెటిజన్లు అభిప్రాయపడ్డారు.

ఇటీవల ఎన్నికల ఫలితాల సమయంలో మీడియా మొత్తం గుజరాత్‌ విజయాన్నే హైలైట్ చేస్తూ వచ్చింది. మిగిలిన ఎన్నికల ఫలితాలను పూర్తిగా పక్కన పెట్టి.. బీజేపీ ప్రభ వెలిగిపోతోందనే రీతిలో వార్తలు ప్రసారం చేసింది. ఎస్.. నిజమే. గుజరాత్‌లో బీజేపీ రికార్డు విజయాన్ని అందుకున్నది. ప్రభుత్వ వ్యతిరేకతను కూడా అధిగమించిన గతంలో కంటే ఎక్కువ సీట్లు గెలుచుకున్నది. అంత మాత్రాన మిగిలిన చోట్ల బీజేపీ ఓడిపోవడం నిజం కాకుండా పోతుందా? కేవలం గుజరాత్ అసెంబ్లీ ఫలితాలను మాత్రమే హైలైట్ చేసి.. మిగిలిన వార్తలకు ప్రయార్టీ లేకుండా చేయడం కాషాయ పార్టీ వ్యూహంలో భాగమే అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

దేశంలో సగానికి పైగా రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి ఉన్నది. ప్రతీ ఇద్దరు భారతీయుల్లో ఒకరు మా పార్టీకే మద్దతు పలుకుతున్నారని బీజేపీ నాయకులు ప్రతీ రోజూ డప్పు కొడుతుంటారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా గుజరాత్‌ను చూపించి.. మా నాయకత్వానికి తిరుగే లేదని బీరాలు పలుకుతారు. కానీ వాస్తవంగా దేశంలో బీజేపీ అలా వెలిగిపోతోందా? సగానికి పైగా భారతీయులు కాషాయ దళానికి జై కొడుతున్నారా? అంటే.. కాదనే సమాధానం వస్తుంది. ఇవన్నీ బీజేపీ చెప్పుకునే అబద్దాలే తప్ప.. సాంకేతిక అంశాలను పరిగణలోకి తీసుకుంటే దేశంలో బీజేపీకి 28 శాతం మంది ప్రజలే మద్దతుగా ఉన్నారని తెలిసిపోతుంది. ఈ విషయం బీజేపీ నాయకులకు కూడా తెలుసు. కానీ నిజాలు బయటపడితే పార్టీ పని ఖతమ్ అవుతుందని భావించే.. ఇలా తమ అనుకూల మీడియాతో లేని బలాన్ని చూపించుకుంటుందనే విమర్శలు ఉన్నాయి.

దేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఢిల్లీ, పుదుచ్చేరితో కలిపి అసెంబ్లీలు ఉన్న రాష్ట్రాలు మొత్తం 30. ఇందులోని 16 అసెంబ్లీల్లో బీజేపీ, దాని మిత్ర పక్షాలు అధికారంలో ఉన్నాయి. వీటిలో కేవలం కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర మాత్రమే పెద్ద రాష్ట్రాలు. ఈ మూడింట కూడా బీజేపీ దొడ్డిదారినే అధికారంలోకి వచ్చింది. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ను, మహారాష్ట్రలో శివసేనను చీల్చి అధికారం చేపట్టింది. ఇక కర్ణాటకలో జేడీయూ, కాంగ్రెస్‌ను ఎన్ని ముప్పతిప్పలు పెట్టి అధికారం చేపట్టిందో తెలిసిందే.

బీజేపీ సొంతగా అధికారంలోకి వచ్చిన 10 రాష్ట్రాల్లో యూపీ, గుజరాత్ మాత్రమే పెద్దవి. మిగతా రాష్ట్రాల్లో అస్సాం తప్ప మిగిలినవి అన్నీ వరంగల్ నగర జనాభా అంత కూడా లేని రాష్ట్రాలు. సిక్కిం, నాగాలాండ్, మేఘాలయ, మణిపూర్, గోవా, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, అస్సాంలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉన్నది. కానీ.. దేశంలో పెద్ద రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ, ఒడిషా, చత్తీస్‌గడ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, రాజస్థాన్, పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్‌లో బీజేపీ ఉనికే లేదు. దక్షిణాదిలో కాలు పెట్టడానికి ఎన్నో ఏళ్ల నుంచి బీజేపీ నానా ఆపసోపాలు పడుతోంది.

కానీ, బయటకు ఇవేమీ తెలియనీయకుండా.. సగానికి పైగా రాష్ట్రాల్లో మేమే అధికారంలోకి వచ్చామని చెప్పుకుంటోంది. అత్యధిక జనాభా ఉండే బడా రాష్ట్రాల్లో బీజేపీ వైపు చూసే వాళ్లు కూడా లేరు. కొన్ని రాష్ట్రాల్లో అయితే కనీసం పార్టీకి అభ్యర్థులు కూడా లేరు. ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉన్న 16 రాష్ట్రాల్లోని ఎనిమిదింట దొడ్డిదారినే అధికారంలోకి వచ్చింది. ఎమ్మెల్యేలను కొనుగోళ్లు చేసి, ఈడీ, సీబీఐ పేరుతో బెదిరించి తమ పార్టీలో చేర్చుకొని అధికారం చేపట్టింది. ప్రజలు వేరే పార్టీకి ఓట్లేసి గెలిపిస్తే.. వారి నిర్ణయానికి వ్యతిరేకంగా ఎమ్మెల్యేలను కొనుగోళ్లు చేసి అధికారంలోకి వస్తే ప్రజామోదం ఉన్నట్లా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

బీజేపీ స్వతహాగా అధికారంలోకి వచ్చిన రాష్ట్రాలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటే.. ఆ పార్టీకి కేవలం 28 శాతం మంది మాత్రమే మద్దతు పలుకుతున్నారు. అంటే దాదాపు నాలుగింట మూడొంతుల మంది.. అంటే ప్రతీ నలుగురు భారతీయుల్లో ముగ్గురు ఇతర పార్టీలకే జై కొట్టారు. ఈ విషయం సామాన్యులకు అర్థం కాకుండా చేసి.. దేశమంతా మోడీ హవా, కాషాయ ప్రభ అంటూ గప్పాలు కొడుతూ ఉంది. ఇదంతా బీజేపీ గాలి బుడగ వాటం విజయాలే కానీ.. అసలైన విజయాలు కావని, కమలం పార్టీకి పూర్తిగా భారతీయుల ఆమోదం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

First Published:  11 Dec 2022 8:08 AM IST
Next Story