Telugu Global
National

అయోధ్యకు అద్వానీ రాకపోవడానికి కారణమదేనా..?

అసలు రామ మందిర ప్రారంభోత్సవానికి ఆ ఇద్దరినీ ఆహ్వానించారా..? లేదా..? అన్న ప్రశ్నలు ఉత్ప‌న్న‌మ‌య్యాయి. అయితే ఈ ప్రచారాన్ని ఆలయ అధికారులు ఖండించారు.

అయోధ్యకు అద్వానీ రాకపోవడానికి కారణమదేనా..?
X

ఇవాళ అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం జరిగింది. రామ మందిర ప్రారంభ వేళ ఒక్క అయోధ్యలోనే కాదు దేశవ్యాప్తంగా శ్రీరామ నామస్మరణతో జనం పులకించిపోతున్నారు. అయోధ్యలో బాల రాముడి విగ్ర‌హ‌ ప్రాణప్రతిష్ఠ‌కు దేశంలోని పలువురు ప్రముఖులను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానాలు పలికింది. ఆహ్వానాలు అందుకున్న ప్రముఖులందరూ అయోధ్యకు తరలివచ్చారు. అయితే అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం కృషి చేసిన బీజేపీ కురువృద్ధులు ఎల్‌.కే. అద్వానీ, మురళీ మనోహర్ జోషి హాజరు కాకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

అసలు రామ మందిర ప్రారంభోత్సవానికి ఆ ఇద్దరినీ ఆహ్వానించారా..? లేదా..? అన్న ప్రశ్నలు ఉత్ప‌న్న‌మ‌య్యాయి. అయితే ఈ ప్రచారాన్ని ఆలయ అధికారులు ఖండించారు. ఎల్‌.కే.అద్వానీ, మురళీ మనోహర్ జోషిలకు ఆహ్వానాలు అందించినట్లు తెలిపారు. వయసు, ఆరోగ్యం దృష్ట్యా వారు అయోధ్యకు రావొద్దని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.

ప్రాణప్రతిష్ఠ‌కు తాను హాజరవుతున్నట్లు కొద్ది రోజుల కిందట అద్వానీ ప్రకటించారు. అయితే ప్రస్తుతం అయోధ్యలో తీవ్ర చలి ఉండడంతోనే అద్వానీ అయోధ్యకు రాలేదని తెలుస్తోంది. వయోసంబంధిత సమస్యలతో మురళీ మనోహర్ జోషి అయోధ్యకు హాజరు కాలేకపోయారని సమాచారం.

అద్వానీ వయస్సు ప్రస్తుతం 96 కాగా, మురళీ మనోహర్ జోషి వయసు 90 ఏళ్లు. ఈ ఇద్దరు నేతలు వయోభారంతో కొన్నేళ్లుగా ఇంటికే పరిమితం అయ్యారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరగాలని ఎన్నో కలలు కన్న ఈ ఇద్దరు నాయకుల కల సాకారమైన వేళ అయోధ్యకు రాలేని పరిస్థితిలో ఉన్నారు.

అయోధ్యలో రామ మందిరం నిర్మాణం చేపట్టాలన్న డిమాండ్ తో 90వ దశకంలో అద్వానీ గుజరాత్ రాష్ట్రం సోమనాథ్ నుంచి అయోధ్యకు రథయాత్ర ప్రారంభించారు. మురళీ మనోహర్ జోషి కూడా ఈ రథయాత్రలో కీలకంగా వ్యవహరించారు. దేశవ్యాప్తంగా బీజేపీ బలపడడానికి, ఆ తర్వాత కేంద్రంలో ఆ పార్టీ అధికారంలోకి రావడానికి రథయాత్ర ఓ కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతుంటారు.

First Published:  22 Jan 2024 5:33 PM IST
Next Story