Telugu Global
National

రాహుల్‌పై ముప్పేటదాడి దేనికి సంకేతం?

ఈ దుర్నీతి పైన కాంగ్రేసేతర ప్రతిపక్షాల మౌనం భయానకం. రాహుల్‌ గాంధీ క్షమాపణ చెప్పక్కర్లేదని, ముందుగా ఆయన జవాబు వినాలని ఏ ఒక్కపార్టీ విస్పష్టంగా చెప్పలేకపోతుంది.

రాహుల్‌పై ముప్పేటదాడి దేనికి సంకేతం?
X

లండన్‌లో రాహుల్‌ గాంధీ చేసిన ప్రసంగాలపై కాషాయ పరివారం ముప్పేట దాడి కొనసాగుతుంది. తాజాగా అమిత్‌షా ఈ దాడిలో భాగమయ్యారు. విదేశీ గడ్డపై మన ప్రజాస్వామ్య వ్యవస్థ మీద వ్యాఖ్యలు చేయడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ, విదేశీ పర్యటనలను తన ప్రచార వేదికలుగా వాడుకున్న నరేంద్ర మోదీ ప్రసంగాలని రాజకీయ పరిశీలకులు ప్రస్తావిస్తున్నారు. ప్రవాస భారతీయులను వేలాదిగా సమీకరించి భారత ఘనత పేరుతో బిజెపి ఘనతని చాటుకున్న మోదీ ఉపన్యాసాల వెనుక వున్న వ్యూహం తెలియనిది కాదు. 60 ఏళ్ళ కాలంలో భారత్‌లో పురోగతి శూన్యమని తాము వచ్చాకనే భారత్‌ వెలుగుతోందని మోదీ విదేశాల్లో చాటుకున్నారు. ఇది గత పాలకులని అవమానించడమేనన్నది స్పష్టం. అమెరికాలో, ఆస్ట్రేలియాలో ఆయన ప్రసంగాల తీరును గమనిస్తే ఇలాంటి అనేక విషయాలు వెలుగులోకి వస్తాయి.

మోదీతో పోలిస్తే లండన్‌లో ఎంపిక చేసిన మేధావుల ముందు, అకాడమిక్‌ వేదికల మీదనే రాహుల్‌ మాట్లాడారు. వాటిని కాంగ్రెస్‌ ప్రచారవేదికలుగా వాడుకోలేదు. పెద్దఎత్తున భారతీయులని సమీకరించి ప్రసంగాలు చేయలేదు. ఏ ఉపన్యాసంలోనూ ఎక్కడా విదేశీజోక్యం కోరలేదు. అయినప్పటికీ రాహుల్‌ దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తున్నాడని, విదేశీ జోక్యాన్ని కోరుతున్నాడని, జాతి వ్యతిరేక శక్తుల చేతిలో టూల్‌కిట్‌గా మారాడని బిజెపి అధ్యక్షులు నడ్డా కూడా ఆరోపించారు. వాస్తవాల్ని ఏమార్చి అబద్ధాల ప్రచారానికి తెగబడిన బిజెపి నేతలు వరుసగా రాహుల్‌ గాంధీ మీద అన్నివైపుల నుంచి దాడి కొనసాగిస్తున్నారు.

పార్లమెంటులో ఏ విషయమైనా చర్చకు అవకాశముందని శనివారం అమిత్‌ షా అన్నారు. కానీ రెండురోజులుగా రాహుల్‌ గాంధీ పార్లమెంటులోకి ప్రవేశించిన తరువాత వాయిదా వేయడం, మైకులు మూగబోవడం వంటి పరిణామాలు గమనార్హం. పార్లమెంటు లోపల ఐదుగురు మంత్రులు తన మీద చేసిన ఆరోపణలకు తాను పార్లమెంటులోనే సమాధానం చెబుతానంటున్న రాహుల్‌ని క్షమాపణ చెప్పేవరకు మాట్లాడనిచ్చేది లేదని కాషాయదళం మొండికేస్తుంది. ఆరోపణలు చేసినవారు ఎదుటివ్యక్తి స్పందన వినాలి, కానీ అందుకు ససేమిరా అంటూ జాతి వ్యతిరేకునిగా రాహుల్‌ గాంధీని నిందించడం దుర్మార్గం.

ఈ దుర్నీతి పైన కాంగ్రేసేతర ప్రతిపక్షాల మౌనం భయానకం. రాహుల్‌ గాంధీ క్షమాపణ చెప్పక్కర్లేదని, ముందుగా ఆయన జవాబు వినాలని ఏ ఒక్కపార్టీ విస్పష్టంగా చెప్పలేకపోతుంది. రాహుల్‌ని పార్లమెంటు నుంచి బహిష్కరించాలని బిజెపి ఎంపీలు ఇష్టానుసారం మాట్లాడుతుంటే ప్రతిపక్షాలు నోరు మెదపకపోవడం వైచిత్రి.

కాంగ్రేసేతర పక్షాలకు కాంగ్రెస్‌తో విభేదాలుండవచ్చు కానీ, అబద్ధాలతో కూడిన బిజెపి నేతల ముప్పేటదాడిని ఎదుర్కోకపోతే.. ఈ పరిణామం ఇక్కడితో ఆగదని గ్రహించాలి. బిజెపినీ, ఆర్‌ఎస్‌ఎస్‌నీ, ప్రత్యేకించి పాలకుల అప్రజాస్వామిక విధానాలని పదేపదే రాహుల్‌ ప్రశ్నించడం బిజెపి పరివారానికి కంటగింపయింది. మరీ ముఖ్యంగా ఆర్‌ఎస్‌ఎస్‌ని పేరు పెట్టి ఇతరులందరికన్నా రాహుల్‌గాంధీ నిర్దిష్టంగా ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నలకు జవాబు చెప్పలేని ఆ సంస్థ రాహుల్‌గాంధీ మీద జాతివిద్రోహిగా, దేశద్రోహిగా ముద్ర వేస్తుంటే కిమ్మనకపోవడం మరింత ప్రమాదకరం.

ఈ క్రమంలోనే అబద్ధాలు చెప్పడం అలవాటైన అమిత్‌షా కూడా రాహుల్‌ మీద ఆరోపణలకు దిగారు. ఇందిరాగాంధీ విదేశాల్లో ఎక్కడా భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడలేదని అంటున్నారు. నిజమే. కానీ ఇక్కడ రాహుల్‌ కూడా భారతదేశానికి వ్యతిరేకంగా ఏది మాట్లాడలేదు. ఇక్కడి ప్రజాస్వామ్య వ్యవస్థ పనితీరు గురించే ప్రస్తావించారు. మన దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కర్నాటక, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర ప్రభుత్వాలని కుతంత్రాలతో పడగొట్టిన వైనం బిజెపికి ప్రజాస్వామ్య వ్యవస్థ మీద నమ్మకం ఏమిటో చెబుతుంది. మొన్నటికి మొన్న పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ ఎన్నికల్లో గెలిచిన తరువాత కూడా ఆ పార్టీలో వందమందికి పైగా ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని బిజెపి నేతలు మాట్లాడారు.

తెలంగాణలోనూ తమతో అనేకమంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని, ప్రభుత్వాన్ని పడగొడతామని చెప్పడమే కాదు, ఎమ్మెల్యేల కొనుగోలుకు చేసిన మంత్రాంగం మన కళ్ళముందే ఉంది. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ పునాదులు కదలిపోతున్నాయనడానికి ఈ పరిణామాల పరంపరనే తార్కాణం. నిజాలు మాట్లాడటం భరించలేని కాషాయ దళాలు మున్ముందు ఎవరూ ఎక్కడా నోరు మెదపకుండా చేయాలన్న కుటిల వ్యూహంలో భాగంగానే రాహుల్‌ మీద ముప్పేట దాడికి దిగింది. ఈ దుర్మార్గంపై కాంగ్రేసేతర పక్షాల మౌనం మరింత ప్రమాదకరం.

First Published:  18 March 2023 6:12 PM IST
Next Story