Telugu Global
National

కాలుష్యానికి మతం రంగు.. టపాకాయల నిషేధంపై బీజేపీ స్పందన

దేశ రాజధానిలో టపాకాయలు కాల్చడాన్ని నిషేధించడం మత సామరస్యాన్ని దెబ్బతీయడమేనంటున్నారు గుజరాత్ బీజేపీ చీఫ్ సీఆర్ పాటిల్. హిందూ పండగలను జరుపుకోనీయకుండా అడ్డుకుంటున్న వారంతా మత వ్యతిరేకులేనని అన్నారు.

కాలుష్యానికి మతం రంగు.. టపాకాయల నిషేధంపై బీజేపీ స్పందన
X

కాలుష్యానికి మతానికి సంబంధం ఏంటి..? ఏమీ లేదు. కానీ బీజేపీ మాత్రం కాలుష్య భూతానికి కూడా మతం రంగు పులిమింది. ఢిల్లీలో టపాకాయలపై విధించిన నిషేధాన్ని అడ్డు పెట్టుకుని మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తోంది. ఢిల్లీలో ప్రతి ఏడాదీ దీపావళికి వాయుకాలుష్యం దారుణంగా పెరుగుతుంది. వాతావరణంలో కాలుష్య కారకాలు తొలగిపోయి, పరిస్థితి సాధారణ స్థాయికి రావడానికి మూడు నాలుగు రోజుల సమయం పడుతుంది. దీపావళి ఒక్కరోజుతో ముగిసే సమస్య కాదిది. డిసెంబర్ -31 కూడా ఆ స్థాయిలోనే జరుపుకుంటారు. అందుకే రెండేళ్లుగా ఢిల్లీలో టపాకాయలు కాల్చడంపై ఆమ్ ఆద్మీ ప్రభుత్వం నిషేధం విధిస్తూ వస్తోంది. సెప్టెంబర్ తో మొదలు పెట్టి, జనవరి 1 వరకు ఆంక్షలు అమలు చేస్తోంది.

ఢిల్లీలో ఆప్ సర్కారు నిర్ణయాన్ని పౌరులు కూడా వ్యతిరేకించలేదు. ఢిల్లీ వాతావరణ పరిస్థితులను బట్టి వారు కూడా టపాకాయలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నారు. కానీ బీజేపీ మాత్రం మత చిచ్చు పెట్టాలని చూస్తోంది. దేశ రాజధానిలో టపాకాయలు కాల్చడాన్ని నిషేధించడం మత సామరస్యాన్ని దెబ్బతీయడమేనంటున్నారు గుజరాత్ బీజేపీ చీఫ్ సీఆర్ పాటిల్. హిందూ పండగలను జరుపుకోనీయకుండా అడ్డుకుంటున్న వారంతా మత వ్యతిరేకులేనని అన్నారు.

గుజరాత్ లో కూడా ఇంతే..

త్వరలో గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ బీజేపీకి గట్టిపోటీ ఇస్తోంది. ఉచిత విద్యుత్ సహా ఢిల్లీలో విజయవంతమైన పథకాలను గుజరాత్ లో కూడా ప్రవేశ పెడతామని చెబుతున్నారు ఆప్ అధినేత కేజ్రీవాల్. గుజరాత్ లో ఆప్ అధికారంలోకి వస్తే టపాకాయలపై కూడా నిషేధం విధించే అవకాశముందని అంటున్నారు పాటిల్. హిందూ వ్యతిరేకులకు అవకాశమివ్వొద్దని చెబుతున్నారాయన.

టపాకాయలపై నిషేధానికి ఇలా మతం రంగు పులమాలనుకోవడం దారుణం అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సెప్టెంబర్ నుంచి జనవరి వరకు హిందూ పండగలతోపాటు, ఇతర మతాలకు చెందిన పండగలు కూడా జరుగుతాయని, ఎక్కడా ఎవరికీ వెసులుబాటు ఇవ్వడంలేదంటున్నారు ఆప్ నేతలు. ప్రజల జీవితాలను నాశనం చేసేలా టపాకాయలు కాల్చాలని ఏ మతమూ చెప్పలేదని వివరిస్తున్నారు. కాలుష్యాన్ని తరిమేయాలంటే కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని, చెబుతున్నారు ఆప్ నేతలు.

First Published:  24 Oct 2022 11:34 AM IST
Next Story