Telugu Global
National

మైసూర్ శాండిల్ ని గబ్బు పట్టించిన బీజేపీ

ఆ కాంట్రాక్టర్ లోకాయుక్తను ఆశ్రయించాడు. లోకాయుక్త అధికారులు KSDL కార్యాలయంలో మాటు వేశారు. ప్రశాంత్ కుమార్ 40 లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

మైసూర్ శాండిల్ ని గబ్బు పట్టించిన బీజేపీ
X

మైసూర్ శాండిల్ సోప్ గురించి తెలియనివారుండరు. ఆ సబ్బుని కర్నాటక సోప్స్ అండ్ డిటర్జెంట్ లిమిటెడ్(KSDL) సంస్థ తయారు చేస్తుంది. దీనికి ప్రభుత్వమే యజమాని. ప్రభుత్వం తరపున KSDLకి చైర్మన్ ఉంటారు. ప్రస్తుతం దావణగెరె జిల్లా చెన్నగిరి బీజేపీ ఎమ్మెల్యే మాదాల్ విరూపాక్షప్ప KSDLకి చైర్మన్ గా ఉన్నారు. విరూపాక్షప్ప కొడుకు ప్రశాంత్ కుమార్ బెంగళూరు వాటర్‌ సప్లై అండ్‌ సీవరేజ్‌ బోర్డు లో చీఫ్ అకౌంట్స్‌ ఆఫీసర్‌ గా పనిచేస్తున్నాడు. తండ్రీ కొడుకులిద్దరూ ఇప్పుడు మైసూర్ శాండిల్ వ్యవహారాన్ని గబ్బు పట్టించారు.

KSDL ఆధ్వర్యంలో సబ్బులు తయారు చేసేందుకు ప్రభుత్వ సూచనతో అధికారులు ముడి సరుకు కొనుగోలు చేస్తారు. దీనికోసం కాంట్రాక్టర్లతో ఒప్పందం కుదుర్చుకునే క్రమంలో చైర్మన్ గా ఉన్న విరూపాక్షప్ప, ఆయన కొడుకు ప్రశాంత్ కుమార్ ముడుపులు తీసుకున్నారు. ఓ కాంట్రాక్టర్ నుంచి 81 లక్షల రూపాయల కమీషన్ కొట్టేయాలని చూశారు. అయితే ఆ కాంట్రాక్టర్ లోకాయుక్తను ఆశ్రయించాడు. లోకాయుక్త అధికారులు KSDL కార్యాలయంలో మాటు వేశారు. ప్రశాంత్ కుమార్ 40 లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆయన ఉన్న రూమ్ లో టైబుల్ పై 40 లక్షల రూపాయల నోట్ల కట్టలు ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కర్నాటక ఎన్నికల వేళ బీజేపీ ఎమ్మెల్యే, ఆయన తనయుడి అవినీతి భాగోతం కమల దళానికి ఇబ్బందిగా మారింది. వాస్తవానికి కమీషన్ల దందాలో తండ్రీకొడుకులిద్దరూ అరెస్ట్ కావాల్సి ఉన్నా.. ఆ సమయానికి ఎమ్మెల్యే విరూపాక్షప్ప అక్కడ లేకపోవడంతో బతికిపోయాడు. ఆయన కొడుకు ప్రశాంత్ కుమార్ అడ్డంగా బుక్కయ్యాడు. తండ్రీకొడుకుల వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. బీజేపీ ఎమ్మెల్యే తనయుడు అరెస్ట్ కావడం, లంచాల మేతలో ఎమ్మెల్యేకి కూడా పాత్ర ఉందని తేలడంతో బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి ప్రతిపక్షాలు. కర్నాటకలో ఇప్పటికే కమీషన్ రాజ్ వ్యవస్థ ఉంది. ఇప్పుడిలా అది సాక్ష్యాధారాలతో సహా బయటపడింది.

First Published:  3 March 2023 10:06 AM IST
Next Story