Telugu Global
National

నెహ్రూ మీద మళ్లీ బీజేపీ బురద

పాకిస్తాన్‌ ఏర్పాటు చేయాలన్న మహమ్మద్‌ అలిజిన్నా డిమాండును పండిత్‌ నెహ్రూ ఆమోదించారని తెలియజేశారు. ఆ రకంగా దేశవిభజన ఘోరాల దినోత్స‌వాన్ని కూడా నెహ్రూ మీద దుమ్మెత్తి పోయాడానికి వాటంగా ఉపయోగించుకున్నారు.

నెహ్రూ మీద మళ్లీ బీజేపీ బురద
X

మోదీ అధికారంలోకి వచ్చిన తరవాత గణతంత్ర దినోత్సవానికి తోడు నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం జరుపుతున్నారు. 2015 నుంచి ఈ పద్ధతి మొదలైంది. అంతకుముందు దీన్ని శాసన దినోత్సవం అనేవారు. ఆ తరువాత గత సంవత్సరం నుంచి స్వాతంత్య్రానికి ఒక్కరోజు ముందు అంటే ఆగస్టు 14న "దేశవిభజన ఘోరాల దినం" నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది మోదీ ప్రభుత్వం ఒక వీడియో తయారు చేసింది. ఈ వీడియోలో దేశ విభజనకు దారితీసిన పరిస్థితులను బీజేపీ దృష్టితో చూపించారు. ఈ వీడియో తయారు చేయడానికి పాత వీడియోలనే వాడుకున్నా వాటిని అమర్చిన తీరు, నేపథ్యంలో చేసిన వ్యాఖ్యానం బీజేపీ ఊహలకు అనువుగా రూపొందించారు. పాకిస్తాన్‌ ఏర్పాటు చేయాలన్న మహమ్మద్‌ అలిజిన్నా డిమాండును పండిత్‌ నెహ్రూ ఆమోదించారని తెలియజేశారు. ఆ రకంగా దేశవిభజన ఘోరాల దినోత్స‌వాన్ని కూడా నెహ్రూ మీద దుమ్మెత్తి పోయాడానికి వాటంగా ఉపయోగించుకున్నారు.

అప్పుడు దేశ విభజన భౌగోళికంగా ఖరారు చేసే బాధ్యతను సిరిల్ రాడ్ క్లిఫ్‌కు అప్పగించారు. "ఆయనకు భారత సంస్కృతి, నాగరికత, విలువలు, యాత్రా స్థలాల గురించి తెలియదు. ఆయన మూడు వారాల్లో భౌగోళిక సరిహద్దులను ఖరారు చేయడానికి అనుమతించారు" అని ఈ వీడియోలో తెలియజేశారు. "ఇదంతా జరుగుతున్నప్పుడు విచ్ఛిన్నకర శక్తులను నిలవరించవలసిన బాధ్యత ఉన్నవారు ఎక్కడున్నారు?" అని ఈ వీడియోతో పాటు బీజేపీ ట్విట్టర్లో వ్యాఖ్యానించింది.

దేశ విభజన ఓ విషాదం. అసలు ఆరోజును గుర్తుచేసుకోవడానికి ఒక దినాన్ని నిర్వహించడంలో బీజేపీ ఆంతర్యం ఏమిటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భారత్, పాకిస్తాన్‌లు ఒక‌ ప్రాతిపదిక మీద విడిపోయాయి కనక తమ ముస్లిం వ్యతిరేక ప్రచారానికి ఈ దినం నిర్వహించాలని నిర్ణయించారు. ఆ దుర్దినాన్ని పురస్కరించుకుని విద్వేషం నింపాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ నాయ‌కుడు జైరాం ర‌మేశ్ ఈ కుటిల ప్రయత్నాలను తీవ్రంగానే దుయ్యబట్టారు. "ద్వి జాతి సిద్ధాంతాన్నిప్రతిపాదించింది వీరసావర్కర్. దానికి పదునుపెట్టింది మహమ్మద్‌ అలీ జిన్నా" అని గుర్తు చేశారు. "పాకిస్తాన్‌ ఏర్పాటుకు అంగీకరించకుండా ఉంటే దేశం ముక్కచెక్కలై పూర్తిగా నాశనమయ్యేది" అని స‌ర్దార్ ప‌టేల్ రాసిన మాట‌ల‌ను కూడా జైరాం ర‌మేశ్ గుర్తుచేశారు.

రాడ్ క్లిఫ్ నిర్ణ‌యించిన భౌగోళిక సరిహద్దుల ప్రకారం పశ్చిమాన పంజాబ్, తూర్పున బెంగాల్ నిలువునా చీలిపోయాయి. బెంగాల్ వి భజనకు మద్దతు ఇచ్చింది డాక్ట‌ర్‌ శ్యాంప్రసాద్ ముఖర్జీ. ఆయనే ఆ తరవాత భారతీయ జనసంఘ్‌ను స్థాపించారు. బీజేపీ వీడియోలో పనిలో పనిగా దేశ విభజనకు కమ్యూనిస్టులూ బాధ్యులే అని దుమ్మెత్తిపోశారు. ఈ వీడియో నిండా నెహ్రూ, జిన్నా ఉన్న దృశ్యాలే ఎక్కువగా కనిపిస్తాయి. కానీ వాటిని బీజేపీ దుష్ప్రచారానికి అనువుగా మర్చారు.

First Published:  15 Aug 2022 9:23 AM IST
Next Story