Telugu Global
National

బీజేపీ ప్రజల మధ్య విద్వేషాన్ని పెంచుతోంది –రాహుల్

భారత్ జోడో యాత్ర తాను ప్రసంగాలు చేయడానికి కాదని, ప్రజలు చెప్పేది వినేందుకేనని స్పష్టం చేశారు రాహుల్ గాంధీ. అందుకే తాను ఎక్కువగా మాట్లాడటంలేదని, ప్రజలకు ఏంకావాలో తెలుసుకుంటూ ముందుకెళ్తున్నానని అన్నారు.

బీజేపీ ప్రజల మధ్య విద్వేషాన్ని పెంచుతోంది –రాహుల్
X

బీజేపీ ప్రజల మధ్య విద్వేషాన్ని పెంచుతోందని విమర్శించారు రాహుల్ గాంధీ. ఈ ఉదయం పంజాబ్ లోని ఫతేగఢ్ సాహిబ్ గురుద్వారా వద్ద ప్రార్థనలు చేసి యాత్ర ప్రారంభించారు. అక్కడి ర్యాలీలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. భారతదేశం సోదరభావం, ఐక్యత, గౌరవంతో కూడి ఉండటం వల్ల తన యాత్ర విజయవంతం అయిందని చెప్పారు రాహుల్. జోడో యాత్ర నుంచి తాను చాలా నేర్చుకున్నానని వెల్లడించారు. రైతులు, దుకాణ దారులు, కార్మికులు, నిరుద్యోగ యువతతో మాట్లాడే అవకాశం దక్కిందని అన్నారు. యాత్రలో భాగంగా ద్వేషం, హింస, నిరుద్యోగం, ద్రవ్యోల్బణంపై పోరాటం సాగించామన్నారు.


నేను చెప్పను, వింటాను..

భారత్ జోడో యాత్ర తాను ప్రసంగాలు చేయడానికి కాదని, ప్రజలు చెప్పేది వినేందుకేనని స్పష్టం చేశారు రాహుల్ గాంధీ. అందుకే తాను ఎక్కువగా మాట్లాడటంలేదని, ప్రజలకు ఏంకావాలో తెలుసుకుంటూ ముందుకెళ్తున్నానని అన్నారు. ప్రస్తుతం పంజాబ్ లో సాగుతున్న యాత్ర ఆ తర్వాత జమ్మూకాశ్మీర్ తో ముగుస్తుంది. 2021 సెప్టెంబర్ 7న ఈ యాత్రను కన్యాకుమారి నుంచి రాహుల్ గాంధీ ప్రారంభించారు. తమిళనాడు, కేరళ, కర్నాటక, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఢిల్లీ, యూపీ, హర్యానా రాష్ట్రాల తర్వాత ప్రస్తుతం పంజాబ్ లో పర్యటిస్తున్నారు రాహుల్ గాంధీ. 5నెలల్లో 3570 కిలోమీటర్ల దూరం యాత్ర చేస్తారు. జనవరి 19న పఠాన్ కోట్ లో భారీ ర్యాలీకి సన్నాహాలు జరుగుతున్నాయి.

భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ లో ఆత్మవిశ్వాసం పెరిగింది. రాహుల్ గాంధీ నాయకత్వంపై పార్టీ నాయకుల్లోనే కాదు, సామాన్య జనాల్లో కూడా ఓ భరోసా వచ్చింది. అదే సమయంలో మిత్రపక్షాలను కూడా రాహుల్ కలుపుకొని వెళ్లడం శుభపరిణామం అంటున్నారు నాయకులు. బీజేపీని అంతం చేయడానికి అన్ని వర్గాల వారు కాంగ్రెస్ తో కలసి పనిచేయడానికి సుముఖంగానే ఉన్నారు. జోడో యాత్ర ప్రభావం సార్వత్రిక ఎన్నికలపై ఏమేరకు ఉంటుందో చూడాలి.

First Published:  11 Jan 2023 1:03 PM IST
Next Story