Telugu Global
National

బీఆర్ఎస్ ఔరంగాబాద్ సభకు అడ్డంకులు సృష్టిస్తోన్న బీజేపీ-శివసేన ప్రభుత్వం!

తెలంగాణలో అధికారంలోకి రావడానికి నానా కష్టాలు పడుతున్న బీజేపీ.. ఇప్పుడు బీఆర్ఎస్‌కు మహారాష్ట్రలో వస్తున్న ప్రజాదరణ చూసి ఈర్ష్య పడుతోంది.

బీఆర్ఎస్ ఔరంగాబాద్ సభకు అడ్డంకులు సృష్టిస్తోన్న బీజేపీ-శివసేన ప్రభుత్వం!
X

సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రలో దూసుకొని పోతోంది. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్‌గా మారిన తర్వాత ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఆ తర్వాత మహారాష్ట్రలో రెండు సభలు పెట్టారు. నాందేడ్, కందార్ లోహలో నిర్వహించిన రెండు సభలు కూడా సూపర్ సక్సెస్ అయ్యాయి. ఈ క్రమంలోనే మహారాష్ట్ర నాయకుల విన్నపం మేరకు ఈ నెల 24న ఔరంగాబాద్‌లో భారీ సభ పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కీలక నాయకులు ఔరంగాబాద్ వెళ్లి సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు.

తెలంగాణలో అధికారంలోకి రావడానికి నానా కష్టాలు పడుతున్న బీజేపీ.. ఇప్పుడు బీఆర్ఎస్‌కు మహారాష్ట్రలో వస్తున్న ప్రజాదరణ చూసి ఈర్ష్య పడుతోంది. ఔరంగాబాద్ సభకు అనుమతులు ఇవ్వకుండా అక్కడి బీజేపీ-శివసేన ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోంది. ఔరంగాబాద్ లోని ఆంఖాస్ మైదానంలో సభ నిర్వహించాలని బీఆర్ఎస్ నాయకులు భావించారు. సమయం దగ్గర పడుతుండటంతో ఏర్పాట్లు చేసేందుకు వీలుగా పోలీసుల అనుమతి కోరారు. మొదట్లో అనుమతి ఇవ్వడానికి సుముఖంగా కనిపించిన పోలీసులు.. అక‌స్మాత్తుగా భద్రతా కారణాలు చూపించి అనుమతి నిరాకరించారు.

ఆంఖాస్ మైదానంలో సభకు అనుమతి ఇవ్వలేమని ఔరంగాబాద్ పోలీసులు బీఆర్ఎస్ నాయకులకు స్పష్టం చేశారు. ఔరంగాబాద్ పోలీసుల తీరుపై సీఎం కేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తున్నది. వెంటనే ప్రత్యామ్నాయ ప్రదేశాన్ని చూడాలని బీఆర్ఎస్ నాయకులను ఆదేశించారు. దీంతో మరో ప్రదేశాన్ని వెతికే పనిలో పడ్డారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ వేగంగా దూసుకొని పోవడం చూడలేకే బీజేపీ ప్రభుత్వం ఇలాంటి చీప్ ట్రిక్స్‌కు పాల్పడుతుందని బీఆర్ఎస్ నాయకులు విమర్శిస్తున్నారు.

2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ కోసం బీఆర్ఎస్ ప్లాన్ చేసింది. కాగా, ఆ గ్రౌండ్ కేంద్రంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ పరిధిలో ఉంటుంది. భద్రతా కారణాలు చూపెట్టి.. అప్పుడు కూడా అనుమతి ఇవ్వలేదు. ఇటీవల కాలంలో ఖమ్మం సభ తర్వాత పరేడ్ గ్రౌండ్స్‌లో బీఆర్ఎస్ సభ నిర్వహించాలని భావించినా.. కంటోన్మెంట్ ఎన్నికలను బూచీగా చూపించి సైనికాధికారులు సభకు అనుమతి ఇవ్వరని భావించి.. బీఆర్ఎస్ ఆ ఆలోచన విరమించుకున్నది. అదే సమయంలో బీజేపీ అక్కడ భారీ బహిరంగ సభ నిర్వహించింది. కేవలం బీఆర్ఎస్‌ను ఇరుకున పెట్టేందుకే బీజేపీ ఇలాంటి నీచ రాజకీయాలకు పాల్పడుతోందని పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా.. 24న ఔరంగాబాద్‌లో సభ తప్పకుండా నిర్వహించి, విజయవంతం చేస్తామని అంటున్నారు.

సభకు మైదానం ఇంకా సిద్ధం కాకపోయినా.. బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం అక్కడ ప్రచార రథాలపై తెలంగాణ పథకాలను వివరిస్తున్నారు. ఔరంగాబాద్ జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేసేందుకు ఈ రథాలను ఏర్పాటు చేశారు. మరాఠీ భాషలో రూపొందించిన డాక్యుమెంటరీల ద్వారా ఔరంగాబాద్‌ జిల్లాలో ప్రచారం చేస్తూ.. తెలంగాణ పథకాలను వివరిస్తున్నారు. స్థానిక ప్రజలు, రైతులు వీటిని ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, ఐడీసీ చైర్మన్‌ వేణుగోపాలచారి, మహారాష్ట్ర బీఆర్‌ఎస్‌ పార్టీ కిసాన్‌ సమితి అధ్యక్షుడు మాణిక్‌ కదమ్, మాజీ ఎమ్మెల్యే శంకరన్న దోండ్గేలు బహిరంగ సభ ఏర్పాట్ల బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు.

First Published:  19 April 2023 7:51 PM IST
Next Story