Telugu Global
National

మోడీ`షా నాయకత్వానికి సవాల్‌.. బీజేపీలో అసంతృప్తుల పర్వం

మంగళవారం నాడు దాదాపు ఐదు గంటలపాటు నరేంద్ర మోడీ నివాసంలో మోడీ, అమిత్‌ షా, బీజేపీ అధ్యక్షుడు జె.పి. నడ్డా సమావేశమయ్యారు. ఆయా రాష్ట్రాలలో తాము చెప్పిన వారినే ముఖ్యమంత్రులుగా అంగీకరించే పరిస్థితి లేదు.

మోడీ`షా నాయకత్వానికి సవాల్‌.. బీజేపీలో అసంతృప్తుల పర్వం
X

పార్టీ అధినాయకత్వంపై ధిక్కారం, అలకలు, అసంతృప్తుల నిరసనరాగాలు కాంగ్రెస్‌లోనే కాదు బీజేపీలోనూ సర్వసాధారణమేనని ప్రస్తుత జాతీయ రాజకీయాల తీరును గమనిస్తే తెలుస్తుంది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో మూడు రాష్ట్రాలలో ఘనవిజయం సాధించిన బీజేపీలో ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం కోసం అనేకులు అర్రులు చాస్తున్నారు. ‘‘కాంగ్రెస్‌లో అందరూ ముఖ్యమంత్రులే’’ అనే విమర్శలు ఇప్పటివరకు వింటూ వచ్చాము. కానీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి ఎన్నిక ప్రక్రియ సజావుగా సాగింది.

ఇందుకు భిన్నమైన దృశ్యం బీజేపీలో చూస్తున్నాం. మూడు రాష్ట్రాలలో కొత్తవారిని ముఖ్యమంత్రులుగా చేయాలని బీజేపీ అధినాయకత్వం చూస్తున్నది. ముఖ్యంగా ఆ పార్టీలో ప్రధాని నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్‌ షా ఎంత చెబితే అంత అని అందరూ అనుకుంటారు. వారి మాటకు ఎదురు ఉండదని భావిస్తారు. కానీ, మూడు రాష్ట్రాలలో ముఖ్యమంత్రి పదవి కోసం అనేకులు పోటీ పడుతున్నారు. బీజేపీ అధినాయకత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. బహిరంగంగానే తమ ఆకాంక్షలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే మంగళవారం నాడు దాదాపు ఐదు గంటలపాటు నరేంద్ర మోడీ నివాసంలో మోడీ, అమిత్‌ షా, బీజేపీ అధ్యక్షుడు జె.పి. నడ్డా సమావేశమయ్యారు. ఆయా రాష్ట్రాలలో తాము చెప్పిన వారినే ముఖ్యమంత్రులుగా అంగీకరించే పరిస్థితి లేదు. కనుకనే ఇంత సుదీర్ఘంగా సమావేశం జరిగిందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా నాలుగుసార్లు పనిచేసిన శివరాజ్‌ సింగ్‌ చౌహాన్ ఐదోసారి తనకు అవకాశం ఇవ్వాలని గట్టిగా కోరుతున్నాడు. 2024 లోక్‌సభ ఎన్నికలలో మధ్యప్రదేశ్‌లో ఉన్న 29 సీట్లను గెలుచుకోడమే తన లక్ష్యమని, ఈ దిశగా పని చేయబోతున్నట్టు చెబుతున్నారాయన. అంటే ముఖ్యమంత్రి పదవికి తనకు అప్పగించమని పరోక్షంగా డిమాండ్ చేస్తున్నాడు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కేంద్రమంత్రులు నరేంద్ర సింగ్‌ తోమర్‌, ప్రహ్లాద్‌ పటేల్‌ కూడా ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నారు. అలాగే జ్యోతిరాదిత్య సింథియా, కైలాస్‌ విజయ్‌ కూడా సిఎం పదవికోసం అధినాయకత్వంపై ఒత్తిడి చేస్తున్నారు. ఈవిధంగా మధ్యప్రదేశ్‌లో సిఎం పోస్టుకు ఐదుగురు క్యూలో నిలబడ్డారు.

ఇక రాజస్థాన్‌లో అయితే ముఖ్యమంత్రి పదవి కోసం ఏకంగా ఏడుగురు ప్రయత్నాలు చేస్తున్నారు. సిఎం పదవి తనకే కట్టబెట్టాలని మాజీ ముఖ్యమంత్రి వసుంధరరాజే డిమాండ్‌ చేస్తున్నారు. గెలిచిన ఎమ్మెల్యేలని ఆమె లంచ్‌ కోసం పిలవగా 70 మంది హాజరయ్యారు. వారంతా మీడియా ముందుకొచ్చి వసుంధర రాజేని సిఎం చేయాలని డిమాండ్‌ చేయడం గమనార్హం. ఆమె గాక బాబా బాలకాంత్‌, దియాకుమారి, కె.ఎల్‌. మీనా, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్‌ షెకావత్‌, అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌, రాజస్థాన్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సి.పి. జోషి సీఎం పోస్టు కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.

ఛ‌త్తీస్‌గడ్‌లోనూ ముఖ్యమంత్రి పదవి కావాలని నలుగురు కోరుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌ తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని అడుగుతున్నారు. మొన్నటివరకు ప్రతిపక్ష నేతగా ఉన్న ధర్మలాల్‌ కౌశిక్‌, బీజేపీ ఛ‌త్తీస్‌గఢ్‌ రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్‌ కుమార్‌ సావో, రిటైర్డ్‌ ఐ.ఏ.ఎస్‌. అధికారి ఓ.పి. చౌదరి సీఎం పోస్టు కోసం ప్రయత్నిస్తున్నారు.

ఈ రీతిన కాంగ్రెస్‌లో మాదిరిగానే బీజేపీలోనూ ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నించేవారు, గ్రూపులు కట్టేవారు, అధినాయకత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేవారు పెరిగారు. మోడీ`షాలు ఎవరి పేరు చెబితే వారిని అంగీకరిస్తామని అనడం లేదు. తమ డిమాండ్లకు తలొగ్గేలా బీజేపీ అధినేతలపై ఒత్తిడి తీసుకు వస్తున్నారు. విశ్వగురువుగా ప్రసిద్ది చెందిన మోడీ, ఆయన అనుయాయి అమిత్‌ షా చెప్పిందే వేదం అనే స్థితి ఆ పార్టీలో ఇప్పుడు లేదు. ఇది బీజేపీలోని అంతర్గత సంక్షోభాన్ని, క్రమశిక్షణారాహిత్యాన్ని, అసంతృప్తుల పర్వాన్ని చెప్పకనే చెబుతున్నది.

రానున్న లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కొత్తవారిని ముఖ్యమంత్రులుగా చేసి జనం ముందుకు వెళ్ళాలని బీజేపీ కేంద్ర నాయకత్వం భావిస్తున్నది. ఈ నేపథ్యంలోనే సీఎం పదవి కోసం తహతహలాడుతున్న పాతకాపులను, సీనియర్‌ నేతలను పక్కకు నెట్టి తమ మాట నెగ్గించుకోవడం మోడీ`షాలకు సవాల్‌గా పరిణమించింది. వారి మాటని శిరోధార్యంగా భావించేంత దృశ్యం బీజేపీలో లేదని ఈ పరిణామాలు చెబుతున్నాయి.

First Published:  6 Dec 2023 5:44 PM IST
Next Story