Telugu Global
National

సరిహద్దుల సమస్య: తన్నుకుంటున్న బీజేపీ పాలిత రాష్ట్రాలు

దేశంలోని ఏ సమస్యనూ తీర్చలేకపోతున్న కేంద్ర బీజేపీ సర్కార్, కనీసం బీజేపీ పాలిత రాష్ట్రాల మధ్య ఉన్న సమస్య‌లనైనా తీర్చలేకపోతోంద‍ంటే ఆ పార్టీలోని, ప్రభుత్వంలోని డొల్లతనం బహిర్గతమవుతోంది.

సరిహద్దుల సమస్య: తన్నుకుంటున్న బీజేపీ పాలిత రాష్ట్రాలు
X

బీజేపీ పాలిత రాష్ట్రాలు, బీజేపీ అలయన్స్ లో ప్రభుత్వాలున్న రాష్ట్రాలు సరిహద్దు సమస్యలతో ఘర్షణపడుతున్నాయి. డబుల్ ఇంజన్ సర్కార్ లు ఒక దానిపై ఒకటి ఒంటికాలిపై లేస్తున్నాయి. డబుల్ ఇంజన్ సర్కార్ లు ఎంత గొప్పగా పాలిస్తున్నాయో ఈ సరిహద్దుల గొడవలే మంచి ఉదహరణ.

దక్షిణాదిన, బిజెపి పాలిత కర్ణాటక రాష్ట్రం మహారాష్ట్ర బిజెపి, శివసేన షిండే వర్గం ప్రభుత్వాల మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఇక బీజేపీ పాలిత అస్సాం, బీజెపి అలయన్స్ పార్టీ నేషనల్ పీపుల్స్ పార్టీ పాలిత మేఘాలయ రాష్ట్రాల మధ్య సరి హద్దు వివాదం హింసకు కూడా దారితీసింది.

గత వారం, అస్సాంలోని వెస్ట్ కర్బీ అంగ్లాంగ్ జిల్లా, మేఘాలయలోని పశ్చిమ జైంతియాలోని ముక్రోహ్ గ్రామం సరిహద్దు ప్రాంతంలో తెల్లవారుజామున 3 గంటలకు అస్సాం పోలీసులకు, మేఘాలయ స్థానికులకు మధ్య జరిగిన ఘర్షణలో అస్సాం ఫారెస్ట్ గార్డ్‌తో సహా ఆరుగురు మరణించారు.అనేక మంది గాయపడ్డారు. ఈ రెండు రాష్ట్రాల మధ్య కొద్ది రోజుల క్రితం కూడా ఇలాగే ఘర్షణలు సాగాయి.

అదే సమయంలో, కొన్ని మహారాష్ట్ర గ్రామాలను కర్ణాటకలో విలీనం చేయాలనే డిమాండ్ పై బీజేపీ పాలిత కర్ణాటక నేతలు, బీజేపీ మద్దతు ఉన్న మహారాష్ట్ర ప్రభుత్వం మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న కొన్ని గ్రామాలు కర్ణాటకలో విలీనం చేయాలని కోరుతూ తీర్మానాన్ని ఆమోదించాయని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై పేర్కొన్నారు.

అతని వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, మహారాష్ట్ర లోని ఏ గ్రామం కూడా కర్ణాటకలో విలీనాన్ని కోరలేదని అన్నారు. మహారాష్ట్రలోని ఏ గ్రామం కర్ణాటకకు ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఫడ్నవీస్‌ను వెనకేసుకొస్తూ, ఇతరులకు ఒక్క అంగుళం భూమిని కూడా ఇవ్వబోమన్నారు.

కర్నాటక సమస్యను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పుడు కర్నాటక, మహారాష్ట్ర సరిహద్దు సమస్య‌పై ఒక కేసు భారత సుప్రీంకోర్టులో ఉంది.

బిజెపి పాలిత రాష్ట్రాలు సరిహద్దుల విషయంలో ఘర్షణ పడుతూ ఉంటే ఆ సమస్యలను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం ఏ చొరవ చూపడం లేదు. ఇక‌ కేంద్ర హోం మంత్రి అమిత్ షా, గత వారం న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొని, ఉత్తరాదికి, తూర్పు భారతదేశానికి మధ్య ఉన్న దూరాన్ని ప్రధాని నరేంద్ర మోడీ "అంతం" చేశారని పేర్కొన్నారు. కానీ తూర్పు భారతంలో సాగుతున్న సరిహద్దు ఘర్షణల గురించి మాత్రం ఒక్క మాట మాట్లాడలేదు.

మరో వైపు బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం తెలంగాణకు చెందిన ఐదు గ్రామాలను ఆంధ్ర ప్రదేశ్‌లో బలవంతంగా విలీనం చేసి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలను ప్రేరేపించింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఏటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు, పురుషోత్తపట్నం, గుండాల గ్రామాల ప్రజలు తమను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్నారు.

దేశంలోని ఏ సమస్యనూ తీర్చలేకపోతున్న కేంద్ర బీజేపీ సర్కార్, కనీసం బీజేపీ పాలిత రాష్ట్రాల మధ్య ఉన్న సమస్య‌లనైనా తీర్చలేకపోతోంద‍ంటే ఆ పార్టీలోని, ప్రభుత్వంలోని డొల్లతనం బహిర్గతమవుతోంది.

First Published:  1 Dec 2022 3:14 PM IST
Next Story