ఫ్రీ రేషన్, యూసీసీ అమలు.. బీజేపీ మేనిఫెస్టో ఇదే
గరీబ్, యువ, అన్నదాత, నారీ-GYAN వర్గాల అభివృద్ధిపై ఈ మేనిఫెస్టో దృష్టి సారిస్తుందని బీజేపీ స్పష్టం చేసింది.
సార్వత్రిక ఎన్నికల కోసం సంకల్ప్ పత్ర్ పేరుతో మేనిఫెస్టో రిలీజ్ చేసింది బీజేపీ. ఈ మేనిఫెస్టోకు మోదీ గ్యారెంటీ ట్యాగ్‌లైన్ కూడా ఇచ్చింది. ఢిల్లీలోని పార్టీ ఆఫీసులో ప్రధాని నరేంద్రమోదీ మేనిఫెస్టోను ఆవిష్కరించారు. రాజ్‌నాథ్‌సింగ్ నేతృత్వంలోని 27 మంది సభ్యుల కమిటీ ఈ మేనిఫెస్టోను రూపొందించింది. మేనిఫెస్టో తయారీ కోసం దాదాపు 15 లక్షల సలహాలు, సూచనలను ఈ కమిటీ పరిశీలించింది. గరీబ్, యువ, అన్నదాత, నారీ-GYAN వర్గాల అభివృద్ధిపై ఈ మేనిఫెస్టో దృష్టి సారిస్తుందని బీజేపీ స్పష్టం చేసింది.
మేనిఫెస్టోలో ప్రధానంగా 14 అంశాలను పొందుపరిచింది బీజేపీ. విశ్వబంధు, సురక్షిత భారత్, సమృద్ధ భారత్, ఈజ్ ఆఫ్ లివింగ్, గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, సాంస్కృతిక వికాసం, సుపరిపాలన, స్వస్థ భారత్, అత్యుత్తమ శిక్షణ, క్రీడావికాసం, సంతులిత అభివృద్ధి, సాంకేతిక వికాసం, సుస్థిర భారత్ ఉన్నాయి. గత పదేళ్లలో సాధించిన విజయాలను తన మేనిఫెస్టోలో వివరించింది బీజేపీ.
కీలక హామీలు ఇవే..
- 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఆయుష్మాన్ భారత్ స్కీంలో భాగంగా రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం
- మూడు కోట్ల ఇళ్ల నిర్మాణం
- పైప్‌లైన్ ద్వారా ఇంటింటికి వంట గ్యాస్
- మరో ఐదేళ్లు ఉచిత రేషన్
- ముద్ర రుణాల పరిమితి రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంపు
- ట్రాన్స్‌జెండర్లకు సైతం ఆయుష్మాన్ భారత్
- ఇళ్ల పథకంలో దివ్యాంగులకు ప్రాధాన్యత
- దేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు
- 2036లో ఇండియాలో ఒలింపిక్స్ నిర్వహణ
- వన్ నేషన్, వన్ ఎలక్షన్ దిశగా అడుగులు
- దేశంలోని అన్ని ప్రాంతాలకు బుల్లెట్ రైలు