Telugu Global
National

లేడీ అమితాబ్ సంగతింతేనా?

కర్నాటక ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో డీకే అరుణ పేరుంది. అరుణ పేరును ఎంపిక చేసిన జాతీయ నేతలు విజయశాంతిని మాత్రం పట్టించుకోలేదు.

లేడీ అమితాబ్ సంగతింతేనా?
X

తెలంగాణ బీజేపీలో మహిళా నేత, సినిమా నటి విజయశాంతి చాప్టర్ దాదాపు ముగిసినట్లేనా? పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోనూ ఇదే అనుమానం పెరిగిపోతోంది. ఎందుకంటే కర్నాటక ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో డీకే అరుణ పేరుంది. అరుణ పేరును ఎంపిక చేసిన జాతీయ నేతలు విజయశాంతిని మాత్రం పట్టించుకోలేదు. లేడీ అమితాబచ్చన్‌గా పాపులరైన విజయశాంతి తనను తాను అలాగే పోల్చుకుంటుంటారు.

కానీ పార్టీయేమో అసలు లెక్కేచేయటంలేదు. దాంతో పార్టీలో విజయశాంతి పరిస్థితి ఏమిటో అర్థంకావటంలేదు. చాలాకాలంగా పార్టీ అధిష్టానంపై ఈమెలో అసంతృప్తి పేరుకుపోతున్నది మాత్రం వాస్తవం. ఈ విషయాన్ని ఆ మధ్య మీడియా ఇంటర్వ్యూలో ఆమే బయటపెట్టుకున్నారు. పార్టీలో తన స్థానమేంటో పార్టీ నాయకత్వాన్నే అడగమని చెప్పటంతోనే ఆమెలోని అసంతృప్తి బయటపడింది. నిజానికి పార్టీ లోకల్ లీడర్లు కూడా ఈమెకు పెద్దగా విలువ ఇవ్వటంలేదు. ఎందుకంటే విజయశాంతి కూడా చెప్పుకోదగ్గ నాయకురాలేమీ కారు.

ఏదో సినిమా గ్లామర్ ఉంది తప్ప రాజకీయంగా ఆమెమీ గొప్ప నేతకాదన్న విషయం అందరికీ తెలిసిందే. కేసీఆర్‌తో ఉన్న కారణంగా ఆమె మెదక్ ఎంపీగా గెలిచారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. ఆ తర్వాత బీజేపీలోకి వచ్చారు. ఏ పార్టీలో ఉన్నా ఆమె అసంతృప్తిగానే ఉండేవారు. కారణం ఏమిటంటే ఆమెలో లోపాలుండటమే. ఆమెకు పార్టీ సరైన గుర్తింపు ఇవ్వటంలేదని అంటారే కానీ పార్టీ కోసం తాను పడుతున్న కష్టాన్ని చెప్పమంటే ఏమీ చెప్పలేరు.

తనంతట తానుగా బీజేపీ కోసమని ఒక్క ఆందోళన చేసింది లేదు. పోలీసు లాఠీ దెబ్బ తిన్నదిలేదు. ఒక్కసారి కూడా ఆందోళనల్లో పాల్గొని అరెస్టయ్యిందీ లేదు. అయితే తాను చాలా పెద్ద లీడర్ని అని విజయశాంతి తనకు తాను అనేసుకుంటుంటారు. ఇక్కడే ఆమెకి పార్టీ నాయకత్వంతో సమస్య వచ్చింది. పెద్ద కార్యక్రమాలు జరిగినపుడు షోపీస్ లాగ వచ్చి వేదిక మీద కూర్చుని వెళ్ళిపోతారు కానీ చొరవ తీసుకుని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నది చాలా తక్కువ. బహుశా ఇవన్నీ చూసిన తర్వాతే అగ్ర నాయకులు విజయశాంతిని కాదని డీకే అరుణకు పెద్దపీట వేస్తున్నారు.

First Published:  20 April 2023 11:18 AM IST
Next Story