ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలపై బీజేపీ వల... ఏక్నాథ్ షిండేల కోసం వేట
ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల ప్రభుత్వాలను కూలదోసేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోందనే సమాచారం వస్తోంది. చత్తీస్ గడ్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టిన బీజేపీ, జార్ఖండ్ లో జే ఎమ్ ఎమ్ ఎమ్మెల్యేలను ఈడీ దాడులు అని భయపెడుతోంది.
బిజెపి అధికార దాహానికి అంతు ఉండడంలేదు. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలను ఏదో విధంగా పడగొట్టి ఆయా రాష్ట్రాల్లో అధికారం చేపట్టేందుకు కాషాయదళం చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర,ల్లో ప్రభుత్వాలను పడగొట్టి మరీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. గోవాలో ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేసేందుకు గట్టిగానే ప్రయత్నిస్తోంది. ఇప్పటికే కర్ణాటకలో అధికారంలో ఉన్నా వచ్చే ఎన్నికల్లో దాన్ని నిలబెట్టుకునేందుకు పెనుగులాడుతోంది. తమిళనాడులో భవిష్యత్తుకు ఇప్పటినుంచే పావులు కదుపుతూ అన్నాడిఎంకె లో తలెత్తిన నాయకత్వ సంక్షోభాన్ని ఆసరాగా చేసుకుని వచ్చే ఎన్నికల నాటికి బలపడాలని చూస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో అసాధ్యంగా కనబడుతున్నా అధికారం లోకి వచ్చేందుకు గల అన్నిమార్గాలను వెతుక్కుంటోంది.
చత్తీస్ గఢ్ లో..
తాజాగా ఛత్తీస్ గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలపై కన్నేసింది బీజేపీ. చత్తీస్ గఢ్ లో కనీసం బలం లేకపోయినప్పటికీ అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి ప్రజల్లో గందరగోళం సృష్టించి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రకు తెరలేపింది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల రెండో రోజున భూపేష్ భాగేల్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బిజెపి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. గురువారంనాడు స్పీకర్ చరణ్ దాస్ మహంత సభలో ఈ తీర్మానాన్ని చదివి వినిపించి దీనిపై జూలై 27న చర్చ జరుగుతుందని ప్రకటించారు.
శాంతిభద్రతలు, రైతుల సంక్షేమం సహా అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ బీజేపీ అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చిందని ప్రతిపక్ష నేత ధరమ్ లాల్ కౌశిక్ తెలిపారు. ముఖ్యమంత్రి పదవి కోసం భూపేష్ బాఘేల్ తో పోటీ పడి భంగపడిన మంత్రి టిఎన్ సింగ్ దేవ్ మిగిలిన శాఖలను ఉంచుకుని పంచాయతీ రాజ్ శాఖను వదులుకుంటున్నట్టు ప్రకటించారు.
దీనిని ఆధారం చేసుకుని మంత్రి తన స్వంత ప్రభుత్వంపై అవిశ్వాసం వ్యక్తం చేస్తూ తన శాఖలలో ఒకదానికి రాజీనామా చేయడంతో రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడందని అందుకే అవిశ్వాస తీర్మానం ఇచ్చామని కౌశిక్ చెప్పారు. ఇది చాలా హాస్యాస్పదంగా ఉందని కాంగ్రెస్ శ్రేణులు విమర్శిస్తున్నాయి. ఏదో సాకుతో ప్రజాస్వామ్య ప్రభుత్వాలను అస్థిరపర్చేందుకు బిజెపి కుట్రలు చేస్తోందని ఆరోపిస్తున్నాయి. రానున్న రోజుల్లో బిజెపి మరే నాటకానికి తెర లేపుతుందో చూడాలి. 90 మంది సభ్యులున్న శాసనసభలో కాంగ్రెస్‌కు 71, బీజేపీకి 14, జేసీసీ (జే)కి ముగ్గురు, బహుజన సమాజ్ పార్టీకి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు.
జార్ఖండ్ లోనూ కుట్రలు..
జార్ఖండ్ లో ప్రభుత్వాన్ని కూల్చేందుకు కూడా బిజెపి ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. రాష్ట్రంలో ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ ను, ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను లొంగదీసుకునేందుకు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడి)ని ఉపయోగించుకునేందుకు ఆలోచిస్తోందని వార్తలు వస్తున్నాయి. రాష్ట్రపతి ఎన్నికలకు ముందే ఇందుకు స్కెచ్ వేసినా ఆ ఎన్నికల్లో వ్యతిరేకత వస్తుందేమోననే ఆలోచనతో వాయిదా వేసుకుంది.
ఇప్పటికే 10 మంది కాంగ్రెస్ శాసనసభ్యులతో బిజెపి నేతలు మంతనాలు జరిపారు. ఫిరాయింపుల నిరోధక చట్టంలోని నిబంధనలు వర్తించకుండా ఉండేందుకు తిరుగుబాటు శిబిరానికి అవసరమైన 12 మంది ఎమ్మెల్యేల బలం కూడగట్టేందుకు ప్రయత్నిస్తోంది. మరో వైపు ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులపై కొంతమంది ఎమ్మల్యేలు అసంతృప్టిగా ఉన్న నేపథ్యంలో జేఎంఎం శిబిరంలో చీలికను తెచ్చే అవకాశాలను కూడా తోసిపుచ్చలేం అంటున్నారు విశ్లేషకులు.
2019లో అధికారంలోకి వచ్చినప్పటి నుండి, హేమంత్ సోరెన్ ప్రభుత్వం కూడా ఒకదాని తర్వాత మరొక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులపై తీవ్ర అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో సోరెన్ పై శాసనసభ్యుడిగా అనర్హత వేటు వేయాలని కోరుతూ పెండింగ్‌లో ఉన్న కేసు దృష్ట్యా, జెఎంఎంలో, సంకీర్ణ భాగస్వాముల మధ్య కూడా పదవి కోసం తీవ్రమైన పోటీ ఏర్పడింది. అంతేగాక రాజ్యసభ ఎన్నికల్లో తమ అభ్యర్ధిని నిలబెట్టాలన్న కాంగ్రెస్ ప్రతిపాదనకు సోరెన్ తిరస్కరించడంతో ఇరు పార్టీల మద్య సయోధ్యకు గండి పడింది. ఈ పరిణామాలన్నీ బీజేపీ వ్యూహకర్తలు రంగంలోకి దిగేందుకు అనుకూలించాయంటున్నారు.
జార్ఖండ్ అసెంబ్లీలో 81 మంది సభ్యులు ఉన్నారు. ప్రస్తుతం జెఎంఎం 30 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌కు 17 మంది, ఆర్జెడి, ఎన్‌సీపీ,సిపిఐ(ఎంఎల్) పార్టీలకు ఒక్కొక్క ఎమ్మెల్యే చొప్పున ఉన్నారు. బిజెపికి 26 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. స్వతంత్రులు ఇద్దరు, ఎజెఎస్‌యు ఇద్దరితో కలిపి ఎన్డియే సంఖ్య 30. రాష్ట్రంలోని గిరిజన బెల్ట్‌లో బిజెపి వాస్తవంగా తుడిచిపెట్టుకుపోయింది. అయినా అడ్డదారిలో అధికారంలోకి రావాలన్న దుగ్ధతో తన ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంది.