Telugu Global
National

బీహార్ లో ఉర్దూ ఉద్యోగ నియామ‌కాల‌పై బిజెపి ఆక్రోశం

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై బీజేపీ ఆక్రోశం వెళ్ళగక్కింది.. ప్ర‌భుత్వ పాఠ‌శాలల్లో ఉర్దూ ఉపాధ్యాయులను నియ‌మించ‌డంపై రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి నిఖిల్ ఆనంద్ మండిపడ్డారు.

బీహార్ లో ఉర్దూ ఉద్యోగ నియామ‌కాల‌పై బిజెపి  ఆక్రోశం
X

బీహార్ లో ప్ర‌భుత్వ పాఠ‌శాలల్లో ఉర్దూ ఉపాధ్యాయులను, పోలీసు ఠాణాల‌లో ఉర్దూ అనువాద‌కుల‌ను నియ‌మించ‌డంపై భార‌తీయ జ‌న‌తా పార్టీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. రాష్ట్రంలో ఇప్పుడు ఉర్దూ ఉద్యోగాల‌ను క‌ల్పించాల్సిన అవ‌స‌రం ఏముంద‌ని రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి నిఖిల్ ఆనంద్ ప్ర‌శ్నించారు.

'ప్రతి పాఠశాలలో ఉర్దూ టీచర్లను మ‌ళ్ళీ ఏర్పాటు చేయాల‌న్న‌దే సీఎం నితీశ్ కుమార్ ఉద్దేశం. బీహార్ అసెంబ్లీలో ఉర్దూ తెలిసిన వారిని నియమించాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ప్రతి పోలీస్ స్టేషన్‌లో ఉర్దూ అనువాదకులను నియమిస్తున్నారు.' అని నిఖిల్ ఆనంద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీహార్‌లోని ముస్లింలు అధికంగా ఉండే జిల్లాల్లో దళితులు, ఓబీసీలు, ఈబీసీల జీవితాలు నాశనమవుతున్నాయని ఆరోపించారు. ' బీహార్‌లో పాకిస్థాన్‌ను సృష్టించవద్దు, నువ్వే పాకిస్థాన్‌కు వెళ్లు.' అని ఆనంద్ అన్నారు.

కాగా మోడీ నేతృత్వంలోని బిజెపి ప్ర‌భుత్వంలో ప్ర‌చారం త‌ప్ప పేద‌ల‌కు జ‌రిగిన మేలు ఏమీ లేద‌ని బిహార్ ముఖ్య‌మంత్రి నితీష్ కుమార్ విమ‌ర్శించారు. బీహార్‌కు ప్రత్యేక హోదా కోసం చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నప్పటికీ, నేటికీ తమ న్యాయ‌మైన డిమాండ్ ను అంగీకరించ‌లేద‌ని అన్నారు. "అన్ని పేద రాష్ట్రాలకు రావాల్సిన" ప్రత్యేక హోదాను కేంద్రం అంగీకరించడం లేదని అన్నారు.

"పేద రాష్ట్రాల్లో ఏదైనా గొప్ప కార్య‌క్ర‌మం కానీ అభివృద్ధి కానీ జరుగుతోందా? ప్రచారం మాత్రమే జరుగుతోంది " అని నితీష్ ధ్వ‌జ‌మెత్తారు. రెండు నెలల క్రితం బీజేపీతో నితీష్ తెగతెంపులు చేసుకున్న విష‌యం తెలిసిందే.

సమాజంలోని బలహీన వర్గాలను, ముఖ్యంగా మైనారిటీలు,దళితుల సంక్షేమం కోసం తన ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వివ‌రించారు. మత సామరస్యం కోసం ఆయన నిబద్ధతతో ప‌ని చేస్తున్నార‌ని ముఖ్య‌మంత్రిని డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, విద్యా మంత్రి విజయ్ కుమార్ చౌదరి ప్రశంసించారు.

సచివాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో దాదాపు 200 మంది ఉర్దూ అనువాదకులకు, స్టెనోగ్రాఫర్లుకు ముఖ్యమంత్రి నియామక పత్రాలను అందజేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపిని ఎదుర్కోనేందుకు విప‌క్షాల మ‌ధ్య ఐక్య‌త కోసం నితీష్ ప్ర‌య‌త్నిస్తున్న విష‌యం తెలిసిందే.

First Published:  4 Nov 2022 1:35 PM IST
Next Story