Telugu Global
National

జార్ఖండ్ లో బిజెపి ఆప‌రేష‌న్ షురూ..ముఖ్యమంత్రికి మైనింగ్ కేసులో ఈడి స‌మ‌న్లు

మైనింగ్ కేసులో మ‌నీ లాండ‌రింగ్ కు సంబంధించి విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ ( ఈడి) జార్ఖండ్ ముఖ్య‌మంత్రి హేమంత్ సోరేన్ కు స‌మ‌న్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సోరేన్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించిందనే ఆరోపణలు జోరందుకున్నాయి.

జార్ఖండ్ లో బిజెపి ఆప‌రేష‌న్ షురూ..ముఖ్యమంత్రికి మైనింగ్ కేసులో ఈడి స‌మ‌న్లు
X

జార్ఖండ్ లో మ‌ళ్ళీ క‌ల‌క‌లం ప్రారంభ‌మ‌వుతోంది. ముఖ్య‌మమంత్రి హేమంత్ సోరెన్ నేతృత్వంలోని సంకీర్ణ ప్ర‌భుత్వాన్ని కూల‌గొట్టేందుకు ఎప్ప‌టినుంచో ప్ర‌య‌త్నిస్తోన్న బిజెపి మ‌ళ్ళీ రంగంలోకి దిగిన‌ట్టు తాజా ప‌రిణామాలు క‌న‌బడుతున్నాయి. ఇటీవ‌ల గ‌వ‌ర్న‌ర్ ర‌మేష్ బైస్ చెప్పిన ' ఏ క్ష‌ణంలోనైనా పేలే బాంబు' ఇదేనా అనే అనుమానాలు క‌లుగుతున్నాయి.

మైనింగ్ కేసులో మ‌నీ లాండ‌రింగ్ కు సంబంధించి విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ ( ఈడి) ముఖ్య‌మంత్రి సోరేన్ కు స‌మ‌న్లు జారీ చేసింది. రాంచీలోని ప్రాంతీయ కార్యాలయంలో రేపు విచారణలో పాల్గొనాల్సిందిగా హేమంత్ సోరెన్‌ను దర్యాప్తు సంస్థ కోరింది.

ఈ కేసులో ముఖ్యమంత్రి సహాయకుడు పంకజ్ మిశ్రాతో పాటు మరో ఇద్దరిని ఈడీ గతంలో అరెస్టు చేసింది. జూలైలో రాష్ట్రవ్యాప్తంగా ఈడి దాడులు నిర్వహించి, మిశ్రా బ్యాంక్ ఖాతాల నుండి రూ.11.88 కోట్లను స్వాధీనం చేసుకున్న తర్వాత అరెస్టు చేశారు. అతని ఇంటిలో రూ.5.34 కోట్ల "ఖాతాలో చూపని" నగదు కూడా దొరికింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మిశ్రా ఇంటి నుంచి హేమంత్ సోరెన్ పాస్‌బుక్ తో పాటు అతను సంతకం చేసిన కొన్ని చెక్కులను కూడా ఈడి స్వాధీనం చేసుకుంది. హేమంత్ సోరెన్ రాజకీయ ప్రతినిధి పంకజ్ మిశ్రా తన సహచరుల ద్వారా ముఖ్యమంత్రి అసెంబ్లీ నియోజకవర్గం బర్హైత్‌లో అక్రమ మైనింగ్ వ్యాపారాన్ని "నియంత్రిస్తున్నారని" ఈడి తన ఛార్జిషీట్‌లో పేర్కొంది.

పంకజ్ మిశ్రాతో పాటు అతని ఇద్దరు సహాయకులు బచ్చు యాదవ్, ప్రేమ్ ప్రకాష్‌లపై చార్జిషీట్ దాఖలు చేసింది. రాష్ట్రంలో అక్ర‌మ‌ మైనింగ్ నుండి వచ్చిన డబ్బుల గురించి విచారిస్తున్న ఈడి, ఇప్పటివరకు రూ. 37 లక్షలను స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో సోరెన్‌ పత్రికా సలహాదారు అభిషేక్‌ ప్రసాద్‌ను కూడా ఆగస్టులో దర్యాప్తు సంస్థ ప్రశ్నించింది.

సోరెన్ 2021లో తనకు తాను మైనింగ్ లీజు మంజూరు చేసుకున్నారని, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద ల‌బ్ధి పొందార‌నే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తనకు తాను మైనింగ్ లీజును పొడిగించుకోవడం ద్వారా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ బీజేపీ చేసినవ్ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం ముఖ్యమంత్రిపై అనర్హత వేటు వేయాలని సిఫార్సు చేసింది.

First Published:  2 Nov 2022 12:10 PM IST
Next Story