Telugu Global
National

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా మరోసారి జేపీ నడ్డా?

2024 ఎన్నికలకు ముందు కీలకమైన జాతీయ కార్యవర్గ సమావేశాలు ఈ నెల 16, 17న ఢిల్లీలో జరుగుతాయి. జేపీ నడ్డా పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనున్నది.

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా మరోసారి జేపీ నడ్డా?
X

కేంద్రంలో మరో సారి అధికారంలోకి రావాలని భావిస్తున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఇప్పటి నుంచే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన కసరత్తు మొదలు పెట్టింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బలహీనంగా ఉన్న పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి ఎలా వ్యవహరించాలనే విషయంపై ఇప్పటికే పలు మార్లు చర్చించింది. ఇటీవల హైదరాబాద్‌లో ముగిసిన 'విస్తారక్'ల భేటీలో ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక పాలక్‌ను నియమించింది. ఆయా నియోజకవర్గాల బాధ్యులు ఇప్పటికే తమ పనిని ప్రారంభించారు. ఇక ఈ నెల మూడో వారంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం ఢిల్లీలో నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో బీజేపీ కొత్త అధ్యక్షుడి నియమాకంపై చర్చ చేయనున్నట్లు తెలుస్తున్నది.

దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో బీజేపీ అంత బలంగా లేదు. ముఖ్యంగా దక్షిణది సహా మహారాష్ట్ర, బెంగాల్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో బీజేపీకి ఎదురు దెబ్బ తప్పడం లేదు. ఇక గుజరాత్‌లో ఘన విజయం సాధించినా.. అదే సమయంలో హిమాచల్‌ప్రదేశ్‌లో ఓడిపోవడం ఆ పార్టీకి ఒక మచ్చలా మిగిలింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సొంత రాష్ట్రమైన హిమాచల్‌ప్రదేశ్‌లో ఓడిపోవడంతో అతడిని బాధ్యతల నుంచి తప్పిస్తారనే వార్తలు వచ్చాయి. సొంత రాష్ట్రంలోనే అధ్యక్షుడు ఓడిపోవడంతో పార్టీలో కూడా చర్చనీయాంశంగా మారింది. అతడిని పక్కన పెడితే బాగుంటుందనే అభిప్రాయాలు కూడా వెలువడుతున్నాయి.

కాగా, ప్రస్తుతం బీజేపీ ఎన్నడూ లేనంత పటిష్టంగా ఉన్నది. ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా.. ఆర్ఎస్ఎస్‌ను కూడా పక్కకు నెట్టి తామే అంతా అయి వ్యవహరిస్తున్నారు. ఇలాంటి సమయంలో తమ కంటే బలమైన నాయకుడు జాతీయ అధ్యక్షుడిగా ఉండటానికి ఆసక్తి చూపించరనే చర్చ జరుగుతున్నది. అందుకే మరో సారి జేపీ నడ్డాకే జాతీయ అధ్యక్ష పదవి కట్టబెట్టాలని వారిరువురు ప్రతిపాదన చేయనున్నట్లు సమాచారం.

2024 ఎన్నికలకు ముందు కీలకమైన జాతీయ కార్యవర్గ సమావేశాలు ఈ నెల 16, 17న ఢిల్లీలో జరుగుతాయి. జేపీ నడ్డా పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనున్నది. మూడేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకుంటున్న నడ్డాకు.. పొడిగింపు లభించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధాని మోడీతో పార్టీ సీనియర్ నాయకులు పాల్గొననున్నారు. ఈ సమావేశంలో నడ్డాను మరోసారి ఎన్నుకోనున్నట్లు తెలుస్తున్నది.

కాంగ్రెస్ సీనియర్ లీడర్ రాహుల్ గాంధీ చేపడుతున్న 'భారత్ జోడో యాత్ర'లో బీజేపీపై అనేక విమర్శలు చేస్తున్నారు. దేశంలో ద్వేషాన్ని పెంచడంలో బీజేపీ సఫలీకృతమయ్యిందని చెబుతున్నారు. అంతే కాకుండా బీజేపీ దేశాన్ని విభజిస్తోందని ఆయన తీవ్రమైన ఆరోపణలు కూడా చేశారు. రాహుల్ వ్యాఖ్యలు దేశంలోని చాలా వర్గాలకు చేరాయి. ఇవి వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉన్నదని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తున్నది. ఢిల్లీలో జరిగే సమావేశాల్లో రాహుల్ వ్యాఖ్యలపై కూడా ఒక తీర్మానం చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

దేశంలో అభివృద్ధికి బీజేపీ ఎలా కట్టుబడి ఉన్నది, కాంగ్రెస్ నేత రాహుల్ వ్యాఖ్యలు ఎంత సత్య దూరాలో చెప్పేందుకు ప్రయత్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. అదే సమయంలో ఈ ఏడాది సెప్టెంబర్‌లో నిర్వహించనున్న జీ-20 సమావేశాలకు పార్టీ పరంగా ఎలా సమాయాత్తం కావాలనే విషయాలను కూడా చర్చించనున్నారు. కేంద్రంలో మోడీ, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంతర్జాతీయ సమాజంలో దేశ ప్రతిష్ట ఎలా పెరిగిందనే విషయాలను ప్రజలకు తెలియజేయాలనే విషయంపై చర్చ జరుగనున్నది.

ఇక జేపీ నడ్డాను మరో దఫా కొనసాగించడం ఆర్ఎస్ఎస్‌కు కూడా ఆమోదయోగ్యమే కాబట్టి.. అతడి పదవీ కాలం పొడిగింపుపై ఎలాంటి అభ్యంతరాలు కూడా ఉండవని పార్టీ భావిస్తోంది. మోడీకి నమ్మకస్తుడిగా, మరోవైపు ఆర్ఎస్ఎస్ మనిషిగా నడ్డానే ఈ కీలక సమయంలో సరైన వ్యక్తిగా పార్టీ భావిస్తున్నది. ఇప్పటికిప్పుడు కొత్త వ్యక్తికి పార్టీ బాధ్యతలు అప్పగించడం కూడా సరైన నిర్ణయం కాదని అనుకుంటున్నది.

First Published:  4 Jan 2023 1:11 AM GMT
Next Story