Telugu Global
National

బీజేపీ ఎంపీ లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా దేశానికి స్వర్ణ పతకాలు తెచ్చిన రెజ్లర్ల ధర్నా

"మహిళా రెజ్లర్లపై జాతీయ శిబిరాల్లో కోచ్ లు, డబ్ల్యుఎఫ్‌ఐ ప్రెసిడెంట్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని వినేష్ ఫోగట్ ఆరోపించారు., "చాలా మంది అమ్మాయిలపై డబ్ల్యుఎఫ్‌ఐ ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.'' అని ఫోగట్ తెలిపారు.

బీజేపీ ఎంపీ  లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా దేశానికి స్వర్ణ పతకాలు తెచ్చిన రెజ్లర్ల ధర్నా
X

భారతీయ జనతా పార్టీ ఎంపీ, భారత రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తమ‌పై లైంగిక వేధింపులు, శారీరక, మానసిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ భారతీయ అగ్రశ్రేణి రెజ్లర్లు వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్, అన్షు మాలిక్, బజరంగ్ పునియాతో సహా 30 మంది రెజ్లర్లు ఢిల్లీ జంతర మంతర్ వద్ద ధర్నాకు దిగారు.

.ధర్నాకు దిగిన 30 మందిలో సరితా మోర్, సంగీతా ఫోగట్, సత్యవర్త్ మాలిక్, జితేందర్ కిన్హా, కామన్వెల్త్ గేమ్స్ పతక విజేత సుమిత్ మాలిక్ కూడా ఉన్నారు.

"మహిళా రెజ్లర్లపై జాతీయ శిబిరాల్లో కోచ్ లు, డబ్ల్యుఎఫ్‌ఐ ప్రెసిడెంట్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని వినేష్ ఫోగట్ ఆరోపించారు., "చాలా మంది అమ్మాయిలపై డబ్ల్యుఎఫ్‌ఐ ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.'' అని ఫోగట్ తెలిపారు.

ఫెడరేషన్ కు క్లోజ్ గా ఉండే కొంతమంది కోచ్‌లు మహిళా కోచ్‌లతో కూడా తప్పుగా ప్రవర్తిస్తున్నారని ఫోగట్ చెప్పారు.

“ఈ రోజు నేను బహిరంగంగా నిజాలు మాట్లాడాను. అందువల్ల‌ రేపు నేను బతికే ఉంటానో లేదో నాకు తెలియదు. డబ్ల్యుఎఫ్‌ఐలోని వ్యక్తులు చాలా శక్తివంతులు” అని ఫోగట్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తో చెప్పారు.

హర్యానాకు చెందిన ఫోగట్ ది రెజ్లింగ్ కుటుంబం. ఆమె కామన్వెల్త్, ఆసియా క్రీడలలో స్వర్ణం గెలిచిన మొదటి భారతీయ మహిళా రెజ్లర్. ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఆమె పలు స్వర్ణాలను సొంతం చేసుకుంది. వినేష్ కజిన్, రెజ్లర్ బబితా ఫోగట్, ఆమె మామ మహావీర్ ఫోగట్ 2020లో భారతీయ జనతా పార్టీలో చేరారు.

దశాబ్ద కాలంగా ఫెడరేషన్ తన సమస్యలను వినేందుకు ఇష్టపడటం లేదని ఫోగట్ అన్నారు. తాను, ఇతర రెజ్లర్లు ప్రధానమంత్రికి గానీ ఏదైనా హైకోర్టుకు గానీ సాక్ష్యం సమర్పించడానికి సిద్ధంగా ఉన్నామని ఆమె ANIకి చెప్పారు.

“చాలా కాలంగా మేము దీనిని మౌనంగా సహిస్తున్నాము. కానీ ఇకపై అలా ఉండబోము ”అని ఒలింపిక్ కాంస్యం గెలుచుకున్న బజరంగ్ పునియా ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో అన్నారు.

రెజ్లర్లు తమ నిరసనలో రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారని పునియా తెలిపారు. అయితే తమ‌ వ్యతిరేకత రాజకీయ పార్టీల‌కు లేదా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు వ్యతిరేకం కాదని చెప్పిన పునియా సమస్య పరిష్కారమయ్యే వరకు పోరాటం చేస్తామని చెప్పారు.

“రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రెజ్లర్లను వేధిస్తోంది. డబ్ల్యుఎఫ్‌ఐలో ఉన్న‌ వారికి ఈ క్రీడ గురించి ఏమీ తెలియదు. బ్రిజ్ భూషణ్ రెజ్లర్లను ఇస్టమొచ్చినట్టు తిట్టేవాడు, కొట్టేవాడు'' అని పునియా విలేకరులతో అన్నారు.

రెజ్లర్లు ఈ వివరాలను ప్రధాన మంత్రి, హోం మంత్రితో వెల్లడించడానికి సిద్ధంగా ఉన్నారని ఒలింపిక్ పతక విజేత రెజ్లర్ సాక్షి మాలిక్ చెప్పారు.

"కొత్త రెజ్లర్ల భవిష్యత్తు సురక్షితంగా ఉండటానికి మొత్తం సమాఖ్యను రద్దు చేయాలి. కొత్త సమాఖ్యను ఏర్పాటు చేయాలి’’ అని ఆమె అన్నారు.

కాగా బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ రెజ్లర్ల ఆరోపణను ఖండించారు. ఈ ఆరోపణలను రుజువు చేయగల్గితే తాను ఉరేసుకుంటానని ఆయన సవాల్ విసిరారు. ఇదో పెద్ద కుట్ర అని, ఇందులో ఓ పారిశ్రామిక వేత్త హస్తం ఉందని ఆయన ఆరోపించారు. ఏది జరిగినా సరే తాను మాత్రం ఫెడరేషన్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయబోనని ఆయన స్పష్టం చేశారు.

కాగా, 2021లో, రాంచీలో జరిగిన అండర్-15 నేషనల్స్‌లో ఒక రెజ్లర్‌ను బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ చెంపదెబ్బ కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

First Published:  19 Jan 2023 7:19 AM IST
Next Story