Telugu Global
National

'మాకు మెజార్టీ రాకపోతే బీజేపీ ఎమ్మెల్యేలను కొంటాము'

"మాకు 30 కంటే తక్కువ సీట్లు వస్తే, నా ప్యాలెస్‌లోని కొన్ని భాగాలను అమ్మి బిజెపి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని నేను ఆలోచిస్తున్నాను" అని 'తిప్ర మోత' పార్టీ చీఫ్ ప్రద్యోత్ మాణిక్య దెబ్ బ‌ర్మ అన్నారు.

మాకు మెజార్టీ రాకపోతే బీజేపీ ఎమ్మెల్యేలను కొంటాము
X

త్రిపుర శాసన సభ ఎన్నికల పోలింగ్ ఓ వైపు జరుగుతుండగానే, ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 'తిప్ర మోత' పార్టీ చీఫ్ ప్రద్యోత్ మాణిక్య దెబ్ బ‌ర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీకి స్పష్టమైన ఆధిక్యత లభించకపోతే, బీజేపీ ఎమ్మెల్యేలను కొనాలనుకుంటున్నామని తెలిపారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ గెలుపై ధీమా వ్యక్తం చేశారు.

త్రిపురలోని 60 స్థానాలకు గానూ 'తిప్ర మోత' పార్టీ 42 స్థానాల్లో పోటీ చేస్తోంది.

''ఈసారి అధిక పోలింగ్ న‌మోదవుతుందని భావిస్తున్నాం. ప్ర‌స్తుతం భార‌తీయ జ‌న‌తా పార్టీతో పోరాడుతున్న ఏకైక పార్టీ తిప్ర‌మోతా మాత్రమే''అని దేబ్ బ‌ర్మ అన్నారు.

"మాకు 30 కంటే తక్కువ సీట్లు వస్తే, నా ప్యాలెస్‌లోని కొన్ని భాగాలను అమ్మి బిజెపి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని నేను ఆలోచిస్తున్నాను" అని ఆయన అన్నారు.

కాగా తిప్రా మోత పార్టీ (TMP)ని తిప్రాహా స్వదేశీ ప్రగతిశీల ప్రాంతీయ కూటమి అని కూడా పిలుస్తారు, ఇది ఒక ప్రాంతీయ రాజకీయ పార్టీ, ఇది గతంలో త్రిపురలో ఒక సామాజిక సంస్థ.ఈ పార్టీ ప్రద్యోత్ బిక్రమ్ మాణిక్య దేబ్ బర్మా నేతృత్వంలో ఉంది.

2019లో, ప్రద్యోత్ బిక్రమ్ మాణిక్య దేబ్ బర్మా త్రిపుర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు.

ఆ తర్వాత కొద్ది రోజులకే అవినీతిపరులకు స్థానం కల్పించాలని కాంగ్రెస్ హైకమాండ్ తనపై ఒత్తిడి తెచ్చిందని ఆరోపిస్తూ దేబ్ బర్మా ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ పదవికి రాజీనామా చేశారు,

దాదాపు మూడు నెలల తరువాత, అతను స్థానిక ప్రజల హక్కుల కోసం ఒక సామాజిక సంస్థను ఏర్పాటు చేశాడు. తర్వాత దానినే రాజకీయ పార్టీగా మార్చాడు.

TIPRA మోతా ప్రధాన లక్ష్యం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 2 , 3 ప్రకారం 'గ్రేటర్ టిప్రాలాండ్' అనే కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం.

కాగా, త్రిపురలో ఈ రోజు జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ, సీపీఎం, కాంగ్రెస్ కూటమి, తిప్రా మోతా పార్టీల మధ్య ముక్కోణపు పోటీ సాగుతోంది.

First Published:  16 Feb 2023 3:03 PM IST
Next Story