బీజేపీ ఎమ్మెల్యే గూండాగిరి, లేడీ పోలీస్ అధికారిపై దాడి..
బీజేపీ మాత్రం ఎమ్మెల్యే తీరుని వెనకేసుకు రావడం గమనార్హం. సదరు ఎమ్మెల్యేపై హత్యకేసు సహా మరో 14 కేసులు ఉండటం ఇక్కడ కొసమెరుపు.
బీజేపీ ఎమ్మెల్యే జయనారాయణ్ మిశ్రా రెచ్చిపోయారు. మహిళా పోలీస్ అధికారిపై దాడికి తెగబడ్డారు. విధి నిర్వహణలో ఉన్న ఆమెపై చేయి చేసుకోబోయారు. దూరంగా నెట్టివేశారు. ఆయన అనుచరులు కూడా ఆమెపై దౌర్జన్యానికి దిగారు. ఈ ఘటన ఒడిశాలోని సంబల్ పూర్ లో జరిగింది.
ఇటీవల ఒడిశాలో ఓ పోలీస్ అధికారి జరిపిన కాల్పుల్లో మంత్రి మరణించిన ఘటన జరిగింది. దీనిపై నిరసన తెలిపేందుకు, రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారాయంటూ విపక్ష బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. సంబల్ పూర్ కలెక్టరేట్ ని ముట్టడించారు. ఎమ్మెల్యే జయనారాయణ్ మిశ్రా ఆ ఆందోళనలో ముందుకు కదిలారు. ఆయన అనుచరులు కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేసుకుంటూ కలెక్టరేట్ లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. అక్కడే విధుల్లో ఉన్న పోలీస్ ఆఫీసర్ అనితా ప్రధాన్ కి జయనారాయణ్ మిశ్రా తో వాగ్వాదం మొదలైంది. ఆయన తనను లంచగొండి, బందిపోటు అంటూ నిందించాడని అనితా ప్రధాన్ ఆరోపించారు. మహిళా కార్మికులను ఇబ్బంది పెడుతున్నప్పుడు తాను అడ్డుకున్నానని చెబుతున్నారు జయనారాయణ్. ఇద్దరి వాదనలు ఎలా ఉన్నా.. తోపులాటలో మహిళా ఆఫీసర్ తీవ్ర ఇబ్బందికి గురయ్యారని వీడియో ఫుటేజీతో స్పష్టమవుతోంది. ఈ దౌర్జన్యానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Does this behove Leader of Opposition in Odisha @BJP4Odisha who misbehaves, threatens & assaults a lady police officer on duty? And this man Jai Narain Mishra has an impeccable track record as a history-sheeter, now on bail! @JPNadda ji, is this the image of @BJP4India you want? pic.twitter.com/d82kVQEF8G
— Dr. Amar Patnaik (@Amar4Odisha) February 15, 2023
ఎమ్మెల్యే, పోలీస్ ఆఫీసర్ ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ ఘర్షణపై సంబల్ పూర్ ఎస్పీ పూర్తి స్థాయి నివేదిక కోరారు. ఎమ్మెల్యే రౌడీయిజం చేశారంటూ ఒడిశా పోలీస్ సర్వీస్ అసోసియేషన్.. డీఐజీని ఆశ్రయించింది. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరింది. అయితే బీజేపీ మాత్రం ఎమ్మెల్యే తీరుని వెనకేసుకు రావడం గమనార్హం. సదరు ఎమ్మెల్యేపై హత్యకేసు సహా మరో 14 కేసులు ఉండటం ఇక్కడ కొసమెరుపు.