Telugu Global
National

బీజేపీలో పెరుగుతున్న భయం

టార్గెట్ 170 అనే ప్రధాన అజెండాతో హైదరాబాద్ లో బీజేపీ మీటింగ్ జరిగినట్టు తెలుస్తోంది. 2024లో జరిగే ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాల్లో కనీసం 170 ఎంపీ సీట్లు రావాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది.

బీజేపీలో పెరుగుతున్న భయం
X

సార్వత్రిక ఎన్నికల విషయంల బీజేపీ భయపడుతోందా..?

కర్నాటక ఫలితాలతో నష్టనివారణ చర్యలు చేపట్టిందా..?

జోడో యాత్ర విజయం తర్వాత బీజేపీ ఆలోచన మారిందా..?

ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తే అదే నిజమనిపిస్తోంది. వరుసగా రెండు సార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ, హ్యాట్రిక్ విషయంలో భయపడుతోంది. కర్నాటక వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలపడటంతోపాటు, కూటమి కట్టడానికి విపక్షాలు సిద్ధమవడం, కేంద్ర ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకత కూడా దీనికి కారణం. తాజాగా హైదరాబాద్ లో జరిగిన 11 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల మీటింగ్ లో కూడా ఇదే విషయం చర్చకు వచ్చింది. ఉత్తరాది హ్యాండ్ ఇస్తే, ఈసారి దక్షిణాది రాష్ట్రాలు ఆదుకునేలా ఉండాలని ఆ మీటింగ్ లో నేతలకు ఉపదేశమిచ్చారట బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.

టార్గెట్ 170

టార్గెట్ 170 అనే ప్రధాన అజెండాతో హైదరాబాద్ లో బీజేపీ మీటింగ్ జరిగినట్టు తెలుస్తోంది. 2024లో జరిగే ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాల్లో కనీసం 170 ఎంపీ సీట్లు రావాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఉత్తరాదిన సీట్లు తగ్గినా.. ఆ లోటును దక్షిణాదితో తీర్చుకోవాలనేది బీజేపీ ఎత్తుగడ. దీనికోసం యాక్షన్ ప్లాన్ రెడీ చేయడానికే ఇక్కడ సమావేశమయ్యారు నేతలు. కర్నాటక చేదు అనుభవం నుంచి ఎలా బయటపడాలనే విషయం కూడా చర్చకు వచ్చిందట.

సాధ్యమేనా..?

ఇప్పటి వరకూ ఉత్తరాదిన కొన్ని రాష్ట్రాల దయతోనే బీజేపీ అధికారంలోకి వచ్చింది. దక్షిణాదిన ఎప్పుడూ ఆ పార్టీకి చీత్కారాలే దక్కాయి. కానీ డబ్బులు వెదజల్లి నాయకుల్ని కొనుగోలు చేసి, దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఉనికి చాటుకుంటోంది బీజేపీ. ఈసారి గణనీయంగా ఎంపీ సీట్లు పెంచుకోవాలని చూస్తోంది. స్థానిక ప్రభుత్వాలపై ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలనుకుంటోంది బీజేపీ. ఇటీవల తెలుగు రాష్ట్రాల అధ్యక్షుల్ని మార్చేయడం వెనక వ్యూహం కూడా అదే. కానీ బీజేపీ ప్లాన్ అంత తేలిగ్గా వర్కవుట్ కాదు అనేది రాజకీయ విశ్లేషకుల వాదన.

భయం మొదలైంది..

మొత్తమ్మీద బీజేపీలో భయం మొదలైందనే విషయం తెలిసిపోతోంది. ఈ ఏడాది చివర్లో జరిగే వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో దీనిపై మరింత క్లారిటీ వస్తుంది. బీజేపీని ప్రజలు నమ్ముతున్నారా, లేదా అనేది తేలుతుంది.

First Published:  10 July 2023 2:17 AM GMT
Next Story