ఆ బీజేపీ నేత రూటే వేరు.. ముస్లిం యువకుడికి కుమార్తెనిచ్చి పెళ్లి
బీజేపీ నేత తన కుమార్తెను ముస్లిం యువకుడికి ఇచ్చి పెళ్లి చేయడంపై ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు అభ్యంతరం తెలిపారు. సంస్కృతికి విరుద్ధమని.. ఇలాంటి పెళ్లి తమకు ఆమోద యోగ్యం కాదని విమర్శించారు.
ఒక్క ముస్లిం కూడా బీజేపీకి ఓటు వేయాల్సిన అవసరం లేదని ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు. కొందరు బీజేపీ నేతలయితే ముస్లిం యువకులు కావాలనే హిందూ అమ్మాయిలకు దగ్గరై లవ్ జిహాద్ కు పాల్పడుతున్నారని ఆరోపణలు చేశారు. దేశం నుంచి ముస్లింలను వెళ్లగొట్టండి.. అని పిలుపునిచ్చిన బీజేపీ నేతలూ ఉన్నారు. కానీ ఓ బీజేపీ నేత మాత్రం వీరందరికీ వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. తన కుమార్తె ఓ ముస్లిం యువకుడిని ప్రేమించగా.. వారిద్దరికీ వివాహం చేస్తున్నారు. అయితే దీనిపై బీజేపీ నుంచి, దాని అనుబంధ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. అయినప్పటికీ ఆ నేత మాత్రం పెళ్లి విషయంలో ముందుకు సాగుతున్నారు.
ఉత్తరాఖండ్ కు చెందిన బీజేపీ నేత యశ్ పాల్ ప్రస్తుతం పౌరి మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు. ఆయన కుమార్తె లక్నో యూనివర్సిటీలో చదువుతున్న సమయంలో ఒక ముస్లిం యువకుడిని ప్రేమించింది. వారి పెళ్లికి ఇరు కుటుంబాలు సమ్మతి తెలిపాయి. కాగా, యశ్ పాల్ తన కుమార్తె పెళ్లి కోసం వెడ్డింగ్ కార్డులు కొట్టించారు. మే 28వ తేదీన పెళ్లి కాగా.. ఆ కార్డులను బంధుమిత్రులకు పంచడం ప్రారంభించారు. అయితే ఆ పెళ్లి కార్డులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
బీజేపీ నేత తన కుమార్తెను ముస్లిం యువకుడికి ఇచ్చి పెళ్లి చేయడంపై ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు అభ్యంతరం తెలిపారు. సంస్కృతికి విరుద్ధమని.. ఇలాంటి పెళ్లి తమకు ఆమోద యోగ్యం కాదని విమర్శించారు. ఇందుకు తాము అంగీకారం కూడా తెలుపమని ప్రకటించారు. బీజేపీ నేతవు అయి ఉండి కుమార్తెను ముస్లిం యువకుడికి ఇచ్చి పెళ్లి చేయడం ఏంటని మండిపడ్డారు.
అయితే ఇటువంటి వారికి యశ్ పాల్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఇది 21వ శతాబ్దం అని గుర్తు చేశారు. 'ప్రతి విషయాన్ని భూతద్దంతో చూసేవాళ్ళకు నేను చెప్పేది ఏమిటంటే.. పెళ్లి అనేది రెండు కుటుంబాలకు సంబంధించిన విషయం. ఇందులో ఇద్దరు యువతీ యువకుల ప్రమేయం ఉంటుంది. మతం అనేది నాకు ప్రధానం కాదు. హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరిపించాలని నిర్ణయించుకున్నాను' అని మీడియాతో చెప్పారు. ఇదిలా ఉంటే తన కుమార్తె వివాహానికి రావాల్సిందిగా యశ్ పాల్ బీజేపీ నేతలతో పాటు కాంగ్రెస్ నాయకులను కూడా ఆహ్వానించారు.