బీజేపీ జాతీయ నాయకురాలి క్రూరమైన హింసలతో పనిమనిషి పరిస్థితి విషమం
ఓ బీజేపీ నాయకురాలు తన ఇంట్లో పని చేసే పనిమనిషిపై దారుణ హింసలకు పాల్పడ్డారు. ఇప్పుడా పనిమనిషి చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతోంది.
జార్ఖండ్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు సీమా పాత్ర తన ఇంట్లో పని చేసే సునీత అనే 29 ఏళ్ళ పని మనిషిని క్రూరంగా హింసించారు. ఆమె భర్త మహేశ్వర్ పాత్ర,రిటైర్డ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) అధికారి. పైగా బేటీ బచావో, బేటీ పఢావో ప్రచారానికి రాష్ట్ర కన్వీనర్.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో బాధితురాలు సునీత ఆస్పత్రి బెడ్ మీద లేవ లేని పరిస్థితుల్లో ఉన్నారు. తనపై సీమా పాత్ర దారుణంగా దాడి చేసిందని, వేడి మూకుడుతో, రాడ్లతో తీవ్రంగా కొట్టిందని, తాను కింద పడిపోయి నేల పై మూత్ర పోసుకున్నానని సునీత బోరుమన్నారు. ఆమె శరీరంపై గాయాల గుర్తులు కనిపిస్తాయి. ఆమె లేచి కూర్చోలేకపోతోంది, ఆమె పళ్ళు విరిగిపోయాయి.
జార్ఖండ్‌లోని గుమ్లాకు చెందిన సునీత 10 సంవత్సరాల క్రితం సీమా పాత్ర కూతురు వత్సల ఇంట్లో పని చేయడానికి ఢిల్లీ వెళ్ళారు. నాలుగేళ్ళ క్రితం వత్సల , సునీత ఇద్దరూ రాంచీ వచ్చేశారు. అప్పటి నుంచి సునీత, సీమా పాత్ర ఇంట్లో పనిచేయడం ప్రారంభించింది.ఈ కాలం మొత్తం తాను సీమా పాత్ర చేతిలో చిత్రహింసలకు గురయ్యానని, తనను ఆమె ఎందుకు కొట్టేదో, తనేం తప్పు చేశానో కూడా తనకు తెలియదని సునీత చెప్పింది. అయితే అనేక సార్లు సీమా పాత్ర కుమారుడు ఆయుష్మాన్ తనను రక్షించాడని, ఆయన లేకపోతే తానెప్పుడో చనిపోయేదాన్నని సునీత బోరుమంది.
స్థానిక మీడియా నివేదికలను ఉటంకిస్తూ, NDTV, ఆయుష్మాన్ సునీత పరిస్థితిని స్నేహితుడికి వివరించాడని, అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడని పేర్కొంది. అనంతరం పోలీసులు సునీతను రక్షించారు. ప్రస్తుతం ఆమె రాంచీలోని రిమ్స్‌లో చికిత్స పొందుతోంది.
పోలీసులు త్వరలో సునీత స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేస్తారని, ఆ తర్వాత సీమ పాత్రను అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు.
కాగా సునీత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో సీమా పాత్ర పై నెటిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమెను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరో వైపు సీమా పాత్రాను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ జార్ఖండ్ బీజేపీ అధ్యక్షుడు దీపక్ ప్రకాశ్ ప్రకటన విడుదల చేశారు.
This is how BJP National Working Committee leader Seema Patra tortured a tribal girl for 8 years ...#BJPseBeti_Ko_Bachaao@KTRTRS pic.twitter.com/oMBkxe9n4d
— krishanKTRS (@krishanKTRS) August 30, 2022