Telugu Global
National

కర్ణాటక ఎన్నికలు 2023: దేవెగౌడతో మోడీ చర్చలు, ఎన్నికల తర్వాత బీజేపీ, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు - బీజేపీ ఎమ్మెల్యే వెల్లడి

కర్ణాటక ఎన్నికలు 2023: ఎన్నికల తర్వాత బీజేపీ, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని బీజేపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే, హాసన్ నియోజకవర్గ అభ్యర్థి ప్రీతమ్‌ గౌడ ప్రకటించారు. అంతే కాదు ఈ విషయంపై ప్రధాని మోడీ దేవెగౌడతో చర్చలు కూడా జరిపారని వెల్లడించారు.

కర్ణాటక ఎన్నికలు 2023: దేవెగౌడతో మోడీ చర్చలు, ఎన్నికల తర్వాత బీజేపీ, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు - బీజేపీ ఎమ్మెల్యే వెల్లడి
X

కర్నాటకలో ఎన్నికల రాజకీయాలు ఫలితాలకుముందే మలుపులు తిరుగుతున్నాయి. అక్కడ జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ పూర్తి మెజార్టీ రాదని, సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు తప్పదని సర్వేలన్నీ తేలుస్తున్న నేపథ్య‍ంలో ఓ బీజేపీ ఎమ్మెల్యే బైటపెట్టిన కొన్ని రహస్యాలు సంచలనంగా మారాయి.

ఎన్నికల తర్వాత బీజేపీ, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని బీజేపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే, హాసన్ నియోజకవర్గ అభ్యర్థి ప్రీతమ్‌ గౌడ ప్రకటించారు. అంతే కాదు ఈ విషయంపై ప్రధాని మోడీ దేవెగౌడతో చర్చలు కూడా జరిపారని వెల్లడించారు.

ఒకవైపు బీజేపీ, జేడీఎస్ ల పొత్తును రెండు పార్టీల అగ్రనేతలు తోసిపుచ్చుతుండగా ప్రీతమ్‌ గౌడ పేల్చిన ఈ బాంబు ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది.

''మోడీ, దేవెగౌడతో చర్చలు జరిపారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ 25 కంటే ఎక్కువ సీట్లు గెలవదు. కర్ణాటకలో హంగ్ అసెంబ్లీ ఏర్పడితే నదులన్నీ చివరికి సముద్రంలో కలిసినట్టు జేడీఎస్ బీజేపీతో కలుస్తుంది.బీజేపీ-జేడీఎస్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. కాబట్టి జెడిఎస్‌కు మీరు వేసే ఓటు ఒక విధంగా బిజెపికి వేసినట్టే'' అని ప్రీతం గౌడ అన్నారు.

ప్రీతం గౌడ మాట్లాడిన ఈ మాటల వీడియో క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై స్పందించేందుకు దేవెగౌడ నిరాకరించారు. ఈ విషయాన్ని తన దగ్గర ప్రస్తావించవద్దని ఆయన మీడియాకు తేల్చిచెప్పారు.

అయితే, మంత్రి, మల్లేశ్వరం అసెంబ్లీ స్థానం నుండి బీజేపీ తరపున పోటీ చేస్తున్న‌ అశ్వథనారాయణ మాత్రం ప్రీతం గౌడ వ్యాఖ్యలను ఖండించారు. ప్రీతం గౌడ చేసిన ప్రకటన బాధ్యతారాహిత్యంగా ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ తమపార్టీకి జేడీఎస్‌తో పొత్తు ఉండదని తేల్చిచెప్పారు. ఈ ఎన్నికల్లో తమ ప్రధాన పోటీ జేడీఎస్ అభ్యర్థులతోనే అని ఆయన అన్నారు.

కాగా, 2006లో జేడీఎస్, బీజేపీ పొత్తు కుదుర్చుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఆ తర్వాత ఇరు పార్టీల మధ్య జరిగిన చర్చల మేరకు జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్‌డీ. కుమారస్వామిని ముఖ్యమంత్రిని చేసి, బిజెపికి చెందిన బి.ఎస్. యడ్యూరప్ప ఆయనకు డిప్యూటీ అయ్యారు. అయితే, ఆ సంకీర్ణం ఎక్కువ కాలం కొనసాగలేదు. అక్టోబర్ 2007 లో ప్రభుత్వం కూలిపోయింది.

First Published:  29 April 2023 3:32 AM GMT
Next Story