Telugu Global
National

నితీశ్ కుమార్ పై కసి తీర్చుకుంటున్న బీజేపీ

బీహార్ లో తమను దెబ్బకొట్టిన జేడీయూ నేత నితీశ్ కుమార్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు బీజేపీ తీవ్ర ప్రణాళికలు వేస్తోంది. మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ లోని జేడీయూ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకున్న బీజేపీ ఇప్పుడు డయ్యూ డామన్ లో అదే పని చేస్తోంది.

నితీశ్ కుమార్ పై కసి తీర్చుకుంటున్న బీజేపీ
X

బీహార్ లో బీజేపీతో తెగతెంపులు చేసుకొని ఆర్జేడీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటు చేసినప్పటి నుంచీ జేడీయూ నేత నితీశ్ కుమార్ పై బీజేపీ కసిగా ఉంది. తమతో కలిసి ఏర్పాటు చేసిన ప్రభుత్వాన్ని నితీశ్ కూల్చేయడం బీజేపీ తట్టుకోలేక పోతోంది. అన్ని రాష్ట్రాల్లో తాము ఒక వైపు విపక్షాలను కూలగొడుతూ ఉంటే నితీశ్ తమ ప్రభుత్వాన్నే కూల్చడం బీజేపీకి కంటగింపుగా మారింది. నితీశ్ ను బీహార్ లో ఏమీ చేయలేక ఇతర రాష్ట్రాల్లో జేడీయూ నేతలను , ఎమ్మెల్యేలను టార్గెట్ చేసింది బీజేపీ.

బీహార్ తర్వాత జేడీయూకు ఎంతో కొంత బలమున్న రాష్ట్రాలు మణిపూర్, అరుణా చల్ ప్రదేశ్. ముందుగా ఈ రెండు రాష్ట్రాల జేడీయూ ఎమ్మెల్యేలను టార్గెట్ చేసిన బీజేపీ, మణిపూర్ లో జేడీయూకు ఆరుగురు ఎమ్మెల్యేలు ఉండగా ఐదుగురిని తమ పార్టీలో విలీనం చేసుకుంది. అరుణా చల్ ప్రదేశ్ లో ఏడుగురు జేడీయూ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిపోయారు.

ఇప్పుడిక డయ్యూ డామన్ పై దృష్టిపెట్టింది బీజేపీ. ఇక్కడ జేడీయూకు 17 మంది పంచాయతీ సభ్యులుండగా వారిలో 15 మంది తాజాగా బీజేపీలో చేరిపోయారు. వారితో పాటు డయ్యూడామన్ లోని మెజార్టీ జేడీయూ నాయకులు కాషాయ కండువాలు కప్పుకున్నారు.ఈ చేరికలన్నీ బీజేపీ ప్రయోగించిన దాన, దండోపాయాల కారణంగానే జరిగాయన్నది జేడీయూ ఆరోపణ.

కాగా బీహార్ లో తమకు షాక్ ఇచ్చిన నితీశ్ కుమార్ కు మిగతా రాష్ట్రాల్లో బీజేపీ షాక్ ఇస్తోంది. నితీశ్ తమనుండి విడిపోవడమే కాక తమకు శతృవైన కేసీఆర్ తో సమావేశమవడం, ఆయనతో కలిసి తమకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విపక్షాలను ఏకంచేసే పనిలో ఉండటం బీజేపీ సహించలేక పోతోంది. ఒక వైపు కేసీఆర్ ను దెబ్బకొట్టడానికి అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ ఇక‌ నితీశ్ మీద పగ తీర్చుకోవడానికి దేనికైనా రడీ అంటోంది.

First Published:  13 Sept 2022 12:18 PM IST
Next Story