బీజేపీలో గుబులు పుట్టిస్తున్న గుజరాత్ ఎన్నికలు
ఇప్పటివరకూ బీజేపీకి అండగా ఉంటూ వచ్చిన అర్బన్ ఓటు బ్యాంకుకు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) రూపంలో గండి పడబోతోందని స్పష్టమవుతున్నది. గత ఎన్నికల వరకూ పట్టణ ప్రాంతాల్లో కాంగ్రెసు బలపడకుండా తన భావజాలంతో అడ్డుకోగలిగింది. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం కాంగ్రెస్ ను ఎదిరించి నిలవలేక పోయినట్టు గణాంకాలు చెబుతున్నాయి.
మరో రెండు రోజుల్లో గుజరాత్ లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కఠిన పరీక్షనే ఎదుర్కోబోతోంది. సాక్షాత్తు ప్రధాని నరేంద్రమోడీ కాలికి బలపం కట్టుకుని ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. పైగా చెప్పుకునేందుకు 'ఘనకార్యాలు' ఏవీ లేవనే విధంగా 'తనను చూసి ఓటెయ్యండని' అభ్యర్థిస్తున్నారు. మిగతా బీజేపీ నాయకులు కూడా ప్రత్యర్థులపై విమర్శలకే పరిమితం అవుతున్నారు తప్ప దాదాపు రెండు దశాబ్దాలకు పైగా అధికారంలో ఉన్న పార్టీగా ప్రజలకు ఫలానా మేలు చేశాం..అని ఎక్కడా గట్టిగా చెప్పలేక హైరానా పడుతున్నారు. ఈ సారి ఎన్నికల్లో నల్లేరు మీద నడక కాదని బీజేపీకి అర్థమైపోయింది.
ఇందుకు ప్రధాన కారణం..ఇప్పటివరకూ తమకు అండగా ఉంటూ వచ్చిన అర్బన్ ఓటు బ్యాంకుకు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) రూపంలో గండి పడబోతోందని స్పష్టమవుతున్నది. గత ఎన్నికల వరకూ పట్టణ ప్రాంతాల్లో కాంగ్రెస్ బలపడకుండా తన భావజాలంతో అడ్డుకోగలిగింది. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం కాంగ్రెస్ ను ఎదిరించి నిలవలేక పోయినట్టు గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం 182 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. వీటిలో పట్టణ ప్రాంతాల్లో 42 నియోజకవర్గాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ 36 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ కేవలం 6 సీట్లు మాత్రమే గెలవగలిగింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లోని 140 స్థానాల్లో కాంగ్రెస్ 71 నియోజకవర్గాల్లో విజయం సాధించి మొత్తం 77 సీట్లతో సత్తా చాటింది. అంతకు ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ దాదాపు 50 శాతానికి పైగా సీట్లు సాధించింది. అంటే అర్బన్ ప్రాంత ఓటర్ల మీదే ఆధారపడి బీజేపీ ఇన్నాళ్ళూ గెలుస్తూ వస్తోందన్న మాట.
మారిన ఎన్నికల ముఖ చిత్రం..
దేశ రాజధాని ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలలో గద్దెనెక్కిన ఆత్మబలంతో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) గుజరాత్ లోనూ పీఠం ఎక్కాలని గట్టిగా కృషి చేస్తోంది. ముఖ్యంగా బీజేపీని దెబ్బతీసేందుకు ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ బీజేపీ ఓటు బ్యాంకుకు గండి కొడుతున్నారు. విద్యాధికుడైన కేజ్రీవాల్ తనదైన మార్కు విధానం, అభివృద్ధితో పట్టణ ప్రాంత ఓటర్లను, విద్యావంతులను బాగానే ఆకట్టుకుంటున్నట్టు స్పష్టమవుతోంది. గ్రామీణ ప్రాంత ఓటర్లలో సంప్రదాయక విధానంతోనే ఓటింగ్ చేస్తుంటారు. వారికి ఇంకా ఆప్ మరింతగా చేరువ కాలేదు. అందుకే ఆప్ తన దృష్టినంతా ప్రధానంగా పట్టణ ప్రాంతాలపైనే కేంద్రీకరించింది. దీనివల్ల ఎక్కువగా నష్టపోయేది బీజేపీయే. అర్బన్ ఓట్లలో చీలిక వస్తే కమలం ఖంగు తినాల్సి వస్తుంది.
కమలం నేతలకు కునుకు లేదు..
బీజేపీ ఇన్నేళ్ళు అధికారంలో ఉన్నా ప్రజలకు ఒరిగిందేమీ లేదనే విషయాన్ని కాంగ్రెస్, ఆప్ పార్టీలు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తుండడంతో కమలం పార్టీ నేతలకు కునుకు పట్టడం లేదు. కాంగ్రెస్ కూడా ఈ సారి గట్టిగా పోటీ ఇస్తోంది. తమకు బలంగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో పట్టు సడలకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే పట్టణ ప్రాంతాల్లో కూడా మరింత బలం పుంజుకునేందుకు కృషి చేస్తోంది. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో కూడా ఆయన బీజేపీ తీరును ఎండగట్టడం దేశ వ్యాప్తంగా మంచి స్పందన వస్తోంది. దీని ప్రభావం కూడా ఎంతో కొంత గుజరాత్ ప్రజలను ఆలోచింపజేస్తుందనే భావన ఉంది.
పార్టీల నుంచి ఎదురవుతున్న సవాళ్ళు ఇలా ఉంటే ప్రధానంగా బిల్కిస్ బానో కేసులో నిందితులను రెమిషన్ పేరుతో సచ్ఛీలురంటూ విడుదల చేయడం దేశ వ్యాప్తంగా సంచలనమైంది. అలాగే గతంలో జరిగిన అల్లర్లలో పాల్గొన్నవారికి గుణపాఠాలు చెప్పామంటూ హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యల డొల్లతనం బయటపడింది. ఈ అంశాలన్నీ ఇప్పుడు తెరపైకి వచ్చి ప్రధాన సమస్యలుగా మారాయి. ఇన్ని సవాళ్ళను ఎదుర్కొంటూ రాష్ట్రంలో కమలం వికసించడం కష్టమే కావచ్చు.