Telugu Global
National

మంత్రి పదవి, పాతిక కోట్లు.. పంజాబ్ లో ఎమ్మెల్యేల బేరసారాలు

ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలకు బీజేపీ నుంచి ఆఫర్ వచ్చినట్టు పక్కా ఆధారాలున్నాయని అన్నారు పంజాబ్ ఆర్థిక మంత్రి హర్ పాల్ సింగ్ చీమా. ఒక్కొక్కరికి రూ.20 నుంచి రూ.25 కోట్లు చొప్పున బీజేపీ నేతలు ఇస్తామన్నారని ఆరోపించారు.

మంత్రి పదవి, పాతిక కోట్లు.. పంజాబ్ లో ఎమ్మెల్యేల బేరసారాలు
X

ఢిల్లీ, జార్ఖండ్ లో ఆపరేషన్ లోటస్ దారుణంగా విఫలమైంది. జేఎంఎం, ఆమ్ ఆద్మీ పార్టీలు ముందు గానే అలర్ట్ కావడంతో కాషాయదళం కు ఛాన్స్ దొరకలేదు. అయితే బీజేపీ నేతలు వెనక్కి తగ్గడంలేదు. ఢిల్లీ, జార్ఖండ్ కాకపోతే పంజాబ్ అంటూ మరో రాష్ట్రాన్ని చూసుకున్నారు. ఇక్కడ కూడా ఆపరేషన్ కమలం మొదలైందని అంటున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు. పంజాబ్ లో ఆప్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు.

10మంది ఎమ్మెల్యేలకు ఆఫర్లు..

ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలకు బీజేపీ నుంచి ఆఫర్ వచ్చినట్టు పక్కా ఆధారాలున్నాయని అన్నారు పంజాబ్ ఆర్థిక మంత్రి హర్ పాల్ సింగ్ చీమా. ఒక్కొక్కరికి రూ.20 నుంచి రూ.25కోట్లు చొప్పున బీజేపీ నేతలు ఇస్తామన్నారని ఆరోపించారు. ఏడు నుంచి పదిమందికి డబ్బులు, మంత్రి పదవులు ఆఫర్ చేశారని అంటున్నారు. ఈ ఆరోపణలపై బీజేపీ స్పందించలేదు కానీ.. ఆప్ మాత్రం పక్కా ఆధారాలున్నాయని చెబుతోంది.

ఢిల్లీలో మీటింగ్ లు..

ఫోన్లో ఆప్ ఎమ్మెల్యేలు మెత్తబడినట్టు కనిపిస్తే, వారిని ఢిల్లీకి తరలిస్తామని, అక్కడ అధినాయకత్వంతో హామీ ఇప్పిస్తామనే తరహాలో బేరసారాలు జరిగాయట. తమకై తాముగా చేరితే రూ.25 కోట్లు, ఎవరినైనా రికమండ్ చేసి తీసుకొస్తే అదనంగా మరికొంత సొమ్ము ముట్టజెబుతామన్నారట. ఢిల్లీలో ఆపరేషన్ లోటస్ విఫలమైందని, ఇప్పుడు పంజాబ్ లో మొదలు పెట్టారని ఆరోపిస్తున్నారు ఆప్ నేతలు. చైన్ స్కీమ్ లాగా ఒకరు రండి, మరొకర్ని చేర్పించండి అంటూ ఆఫర్లు ఇవ్వడం కొత్త సంప్రదాయం అంటూ దుయ్యబట్టారు.

First Published:  14 Sept 2022 3:51 AM GMT
Next Story