భారత్ జోడోతో కలవరం.. విమర్శల డోస్ పెంచిన కమలదళం..
జోడో యాత్రను పూర్తిగా పట్టించుకోకుండా ఉండటం బీజేపీ వ్యూహం. కానీ రోజు రోజుకీ ఈ యాత్రపై పెరుగుతున్న ఆసక్తిని గమనించిన కమలదళం ఇప్పుడు విమర్శలకు పదును పెట్టింది.
నిన్న మొన్నటి వరకు రాహుల్ గాంధీ పాదయాత్రను అసలు పట్టించుకోనట్టే ఉంది బీజేపీ కేంద్ర నాయకత్వం. కానీ ఇప్పుడు స్పందించాల్సిన సమయం వచ్చింది. ముందు సోషల్ మీడియాలో సెటైర్లు వేసినా అది వారికే రివర్స్ అయింది, ఆ తర్వాత రాహుల్, చర్చి ఫాదర్ ని కలసిన విషయాన్ని రాద్ధాంతం చేయాలని చూసినా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో నేరుగా అమిత్ షా రంగంలోకి దిగారు. రాహుల్ గాంధీ ముందు చరిత్ర తెలుసుకోవాలంటూ హితవు పలుకుతున్నారు. ఇంతకీ అమిత్ షా కి కోపం ఎందుకొచ్చిందంటే..?
టీషర్ట్ ని వదిలిపెట్టరా..?
రాహుల్ గాంధీ టీ షర్ట్ విషయాన్ని బీజేపీ అప్పుడే వదిలిపెట్టేలా లేదు. టీషర్ట్ రేటు 41వేలు అంటూ బీజేపీ కామెంట్ చేయగా, మోదీ సూటు ఖరీదు 10లక్షలంటూ కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. దీంతో బీజేపీ దీన్ని స్వదేశీ - విదేశీ అంటూ మార్చేసింది. విదేశీ బ్రాండ్ టీషర్ట్ ధరించి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు వెళ్లారని అంటున్నారు అమిత్ షా. రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, జోడో యాత్రపై విమర్శలు గుప్పించారు.
చరిత్ర తెలుసుకోవాలి..
రాహుల్ గాంధీ చరిత్ర తెలుసుకోవాలంటున్న అమిత్ షా, పార్లమెంట్ సమావేశాల్లో భారత్ అసలు దేశమే కాదని రాహుల్ చెప్పారంటూ విమర్శించారు. దేశాన్ని ఏకం చేసేందుకు యాత్ర చేస్తున్నానంటున్న రాహుల్, ముందు దేశ చరిత్ర అధ్యయనం చేయాలని హితవు పలికారు. బుజ్జగింపు, ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే కాంగ్రెస్ పార్టీ పని చేస్తోందని ఆరోపించారు. మరో మంత్రి స్మృతి ఇరానీ కూడా రాహుల్ పై విమర్శలు ఎక్కు పెట్టారు. దేశాన్ని ఏకం చేసేందుకు యాత్ర చేపట్టిన రాహుల్ గాంధీ.. అసలు దేశ ఐక్యతను ఎవరు దెబ్బతీశారో చెప్పాలని నిలదీశారు. దేశం ముక్కలు ముక్కలవుతుందని నినాదాలు చేసిన వ్యక్తి కాంగ్రెస్ లోనే ఉన్నారని చెప్పారు.
చురుకు పుట్టినట్టేనా..?
జోడో యాత్రను పూర్తిగా పట్టించుకోకుండా ఉండటం బీజేపీ వ్యూహం. కానీ రోజు రోజుకీ ఈ యాత్రపై పెరుగుతున్న ఆసక్తిని గమనించిన కమలదళం ఇప్పుడు విమర్శలకు పదును పెట్టింది. అమిత్ షా తో మొదలు పెట్టి అందరూ టీ షర్ట్ వంటి సిల్లీ విషయాలను హైలెట్ చేస్తూ తమ పరువు తీసుకుంటున్నారు. యాత్ర పూర్తయ్యేలోపు బీజేపీ నేతల నుంచి ఇంకెన్ని సూక్తులు వినాల్సి వస్తుందో అని నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు.